Begin typing your search above and press return to search.

ప్ర‌ధాని మోడీ.. సొంత సంస్థ కూడా వ్య‌తిరేకిస్తోందా?

By:  Tupaki Desk   |   30 April 2021 9:30 AM GMT
ప్ర‌ధాని మోడీ.. సొంత సంస్థ కూడా వ్య‌తిరేకిస్తోందా?
X
దేశంలో క‌రోనా మార‌ణ‌హోమం సృష్టిస్తోంది. ఆసుప‌త్రులు రోగుల‌తో నిండిపోతుంటే.. శ్మ‌శానాల్లో శ‌వాల గుట్ట‌లు పేరుకుపోతున్నాయి. ఈ ప‌రిస్థితికి న‌రేంద్ర మోడీ స‌ర్కారు నిర్ల‌క్ష్య‌మే కార‌ణ‌మ‌నే విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. స్వ‌యానా సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తంచేయ‌గా.. అంత‌ర్జాతీయ మీడియా కూడా ఎండ‌గ‌ట్టింది.

అయితే.. బీజేపీ మాతృసంస్థ ఆరెస్సెస్ కూడా మోడీ స‌ర్కారు ప‌నితీరుపై అసంతృప్తిగా ఉంద‌నే ప్ర‌చారం సాగుతోంది. క‌రోనాను ఎదుర్కోవ‌డంలో కేంద్ర ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌నే భావ‌న‌లో సంఘ్ నాయ‌క‌త్వం ఉంద‌ని తెలుస్తోంది. ఈ మేర‌కు ఢిల్లీ ఆరెస్సెస్ రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌భ్యుడు రాజీవ్ తుల్లి నేరుగా బీజేపీపై మండిప‌డ్డ‌ట్టు స‌మాచారం.

క‌రోనా మ‌హ‌మ్మారి ధాటికి ఢిల్లీ స‌ర్వ‌నాశనం అవుతుంటే.. ప్ర‌జ‌ల‌కు స‌హాయం చేసేందుకు రాష్ట్ర బీజేపీ నేత‌లు ఎక్క‌డా క‌నిపించ‌ట్లేద‌ని అన్నార‌ట‌. ఢిల్లీ వాసుల‌కు అండ‌గా నిల‌వాల్సిన బీజేపీ తీరు ఇదేనా? అని నిల‌దీశార‌ని స‌మాచారం. అంతేకాదు.. బీజేపీ ఢిల్లీ రాష్ట్ర కార్య‌వ‌ర్గాన్ని ర‌ద్దుచేశారా? అని కూడా తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

అయితే.. రాజీవ్ మాత్ర‌మే బ‌య‌ట‌ప‌డ్డార‌ని, ఆరెస్సెస్ ఉన్న‌త‌స్థాయి వ‌ర్గాలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నాయ‌ని అంటున్నారు. ఆరెస్సెస్ అఖిల భార‌తీయ ప్ర‌చార ప్ర‌ముఖ్ సునీల్ అంబేద్క‌ర్ రాజీవ్ వ్యాఖ్య‌లపై స్పందించిన‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న వ్యాఖ్య‌లు వ్య‌క్తిగ‌త‌మ‌ని, సంఘ్ కు సంబంధం లేద‌ని అన్నార‌ట‌. మొత్తానికి.. రాజీవ్ వ్యాఖ్య‌ల‌తో ప్ర‌ధాని మోడీ ప‌నితీరును సొంత సంస్థ కూడా వ్య‌తిరేకిస్తోంద‌న్న ప్ర‌చారం ఊపందుకుంది.