Begin typing your search above and press return to search.

వచ్చే వారం నుండి ఇండియాలో వ్యాక్సినేషన్ !

By:  Tupaki Desk   |   23 Dec 2020 7:31 AM GMT
వచ్చే వారం నుండి ఇండియాలో వ్యాక్సినేషన్ !
X
దేశంలో కరోనా మహమ్మారి జోరు మళ్లీ పెరుగుతున్న ఈ సమయంలో శీయంగా కోవీషీల్డ్‌ వ్యాక్సిన్ ‌కు వచ్చే వారం అనుమతి లభించే వీలున్నట్లు ఫార్మా వర్గాలు భావిస్తున్నాయి. ఇందుకు వీలుగా సీరమ్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఔషధ నియంత్రణ సంస్థకు తాజాగా మరింత క్లినికల్‌ డేటాను అందించినట్లు తెలుస్తోంది. దీంతో దేశీ ఔషధ నియంత్రణ సంస్థలు అత్యవసర ప్రాతిపదికన వ్యాక్సిన్‌ వినియోగానికి అనుమతించనున్నట్లు సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి.

వెరసి కోవీషీల్డ్‌ వ్యాక్సిన్‌ను అనుమతించిన తొలి దేశంగా భారత్‌ నిలిచే వీలున్నట్లు పేర్కొంటున్నాయి. ఆక్స్‌ ఫర్డ్ ఆస్త్రాజెనెకా కంపెనీ తయారుచేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ ‌కి కేంద్ర ప్రభుత్వం ఎమర్జెన్సీ వాడకానికి వచ్చే వారం అనుమతి ఇవ్వబోతున్నట్లు తెలిసింది. ఈ వ్యాక్సిన్‌ ని ఇండియాలో ఉత్పత్తి చేస్తున్న సీరం ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా, అనుమతి కోసం అప్లికేషన్ పెట్టుకుంది. దీన్ని పరిశీలించి అనుమతి ఇస్తారని, రెండు వర్గాల నుంచి తమకు నమ్మదగిన సమాచారం వచ్చిందని రాయిటర్స్ తెలిపింది. ఈ అనుమతి ఇస్తే గనక బ్రిటన్‌లో తయారుచేసిన ఆక్స్ ‌ఫర్డ్ వ్యాక్సిన్‌కి అనుమతి ఇచ్చిన తొలి దేశంగా ఇండియా మారనుంది.

కేంద్ర ప్రభుత్వం వెంటనే దేనికీ అనుమతి ఇచ్చేయకుండా అన్నీ పరిశీలించాకే అనుమతి ఇవ్వాలనుకుంటోంది. ఆక్స్‌ ఫర్డ్ లాగే అమెరికా కంపెనీ ఫైజర్, భారత కంపెనీ భారత్ బయోటెక్ కూడా తమ వ్యక్సిన్ల ఎమర్జెన్సీ వాడకానికి అప్లికేషన్లు పెట్టుకున్నాయి. కేంద్రం ఇంకా దేనికీ అనుమతి ఇవ్వలేదు. వ్యాక్సిన్‌కు అనుమతి ఇస్తే, ఒక్కసారిగా 30 కోట్ల వ్యాక్సిన్లను పంపిణీ చెయ్యాలని కేంద్రం ప్లాన్ వేసుకుంది. ఆ ప్రకారం అన్ని రాష్ట్రాల్లో ఏర్పాట్లు ఆల్రెడీ జరిగాయి. ఫైజర్ వ్యాక్సిన్ చాలా రేటు ఎక్కువ. పైగా ఇండియాలో దాన్ని మైనస్ 70 డిగ్రీల్లో ఉంచడం కష్టమైన పని. అదే , ఆక్స్‌ ఫర్డ్ వ్యాక్సిన్ అయితే... చాలా తక్కువ రేటుకే లభించే అవకాశం ఉంది. పైగా దాన్ని అంత ఎక్కువ కూలింగ్‌ లో ఉంచాల్సిన పనిలేదు. ఇళ్లలోని ఫ్రిజ్ ‌లలో కూడా ఉంచవచ్చు. అందువల్ల దానికే అనుమతి ఇవ్వాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలిసింది. ఇండియా ఇప్పటివరకూ వ్యాక్సిన్ల పంపిణీ కోసం ఏ కంపెనీతోనూ డీల్ కుదుర్చుకోలేదు. సీరం మాత్రం ఇప్పటికే 5 కోట్ల డోసుల వ్యాక్సిన్ రెడీగా ఉత్పత్తి చేసి పెట్టుకుంది. జులై నాటికి 40 కోట్ల డోసులు రెడీ చేయ్యాలనుకుంటోంది.