Begin typing your search above and press return to search.
కన్నడ బరిలో ఉన్న ఈ చాయ్ వాలా!
By: Tupaki Desk | 21 April 2018 1:55 PM GMTఇదో చాయ్ వాలా కథ. జీవితంలో కసి ఉంటే ఎలా తన జీవితాన్ని మార్చుకోవచ్చో తెలియజెప్పే కథ. చాయ్ వాలా అంటే కేవలం మోడీ మాత్రమే కాదని తెలియజెప్పే కథ. సూటిగా విషయంలోకి వెళితే...ఆయన పేరు అనిల్ కుమార్. కడు పేదరికం.. తినడానికి తిండి లేదు.. ఫుట్ పాత్ లే ఆశ్రయాలు.. వయసు పెరిగిన తర్వాత తనకున్న తెలివితో ఒక చాయ్ బండి నడుపుతూ.. క్రమక్రమంగా ఎదిగాడు. ఒకప్పుడు చాయ్ వాలా అయిన ఆయన.. నేడు కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాడు. ఆయన ఆస్తి రూ.339 కోట్లంటే నమ్ముతారా?
ఇంత క్రేజీ ఉన్న ఈయన కేరళకు చెందిన వ్యక్తి. ప్రస్తుతం 43 ఏళ్ల వయసున్న పి. అనిల్ కుమార్ పదేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయాడు. అనిల్ కుమార్ తల్లి తన ముగ్గురు పిల్లలను పోషించేందుకు ఇళ్లలో పనులు చేసేది. కష్టాలు పడుతూ వచ్చిన డబ్బుతో తన పిల్లలను పెంచింది. ప్రతి రోజు నాలుగు ఇడ్లీలు తీసుకువచ్చి అనిల్ కుమార్ తో సహా మరో ఇద్దరి పిల్లలకు తినిపించేది. ఈ క్రమంలో మూడో తరగతి వరకు చదివి చదువు ఆపేసిన అనిల్ కుమార్.. 11 ఏళ్ల వయసున్నప్పుడు 1985లో బెంగళూరుకు వచ్చేశాడు. ఇంకేముంది ఎప్పట్లాగే కష్టాలు...బెంగళూరులో ఫుట్ పాత్ లపై పడుకుంటూ.. జీవనం గడిపేవాడు. ఆకలిని చంపుకొని పస్తులతో కాలం వెల్లదీశాడు. ఓ రోజు రాత్రి ఫుట్ పాత్ పై పడుకున్న అనిల్ ను.. ఓ పెద్దమనిషి చెరదీశాడు. ఆ తర్వాత ఓ షాపులో అనిల్ ను పనికి పెట్టాడు. సంపాదించిన డబ్బుతో 1990లో చాయ్ బండి సొంతంగా నడపడం ప్రారంభించాడు అనిల్. ఆ సమయంలోనే బెంగళూరులో ఐటీ బూమ్ వచ్చింది. దీంతో తన చాయ్ బండి వ్యాపారాన్ని ఐటీ కంపెనీలకు అనిల్ విస్తరించాడు.
ఇక్కడే సీన్ మారింది. ఈ సమయంలోనే బెంగళూరుకు చెందిన ఓ యువతి అనిల్‌ను పెళ్లి చేసుకుంది. ఆమె కట్నం కింద ఒక ప్లాట్‌ను తీసుకువచ్చింది. కొద్ది రోజుల తర్వాత ఈ ప్లాట్ ధర రెట్టింపు అవడంతో దాన్ని అమ్మేశాడు. అదే సమయంలో రియల్ ఎస్టేట్ రంగంలోకి అనిల్ అడుగు పెట్టాడు. ప్లాట్లను కొనడం, అమ్మడంతో మరింత ఆదాయం సమకూరింది. ఆరేళ్లలోనే అనిల్ కోట్లకు పడగలెత్తాడు. ఎనిమిదేళ్ల క్రితం కర్ణాటకలోని బొమ్మనహళిలో ఎంజే ఇన్‌ఫ్రాస్టక్చర్ కంపెనీని స్థాపించాడు. అలా చాయ్ అమ్ముకునే జీవితం నుంచి ఓ కంపెనీ స్థాపించే స్థాయికి ఎదిగాడు అనిల్. మొత్తంగా రూ. 339 కోట్ల ఆస్తులు సంపాదించాడు. ఇంతటితోనే ఆగిపోవద్దని అనిల్ నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో కర్ణాటక ఎన్నికల్లో బొమ్మనహళి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాడు. బొమ్మనహళి నియోజకవర్గంలో తాను తప్పకుండా గెలుస్తానని అనిల్ కుమార్ ధీమా వ్యక్తం చేశాడు. ఈ నియోజకవర్గంలో ప్రజల మద్దతు తనకు ఉందన్నారు అనిల్. బొమ్మనహళి నియోజకవర్గంలో అనిల్ మంచి పేరున్న వ్యక్తి కాబట్టి ఆయన గెలుపు కష్టం కాదంటున్నారు విశ్లేషకులు.