Begin typing your search above and press return to search.

ఇంత‌కీ చిదంబ‌రం కొడుకును ఎందుకు అరెస్ట్

By:  Tupaki Desk   |   1 March 2018 6:12 AM GMT
ఇంత‌కీ చిదంబ‌రం కొడుకును ఎందుకు అరెస్ట్
X
కేంద్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి - కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌ పీ చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరాన్ని బుధవారం సీబీఐ అరెస్టు చేసింది. కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియ‌ర్‌ - ముఖ్య నేత‌ల్లో ఒక‌రైన చిదంబ‌రం... ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర విభ‌జ‌న‌లో కీల‌క పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే. త‌మిళ‌నాడుకు చెందిన ఈ సీనియ‌ర్ నేత ఆ పార్టీ అధికారం కోల్పోయిన త‌ర్వాత కూడా క్రియాశీలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే తాజాగా ఆయ‌న కుమారుడిని అరెస్ట్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. లండన్ నుంచి ఉదయం చెన్నై చేరుకున్న ఆయన్ను ఈ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తునకు సహకరించడం లేదన్న దానిపై కేంద్ర దర్యాప్తు సంస్థ విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్నది. ఎయిర్‌ పోర్టులోనే కార్తీని ప్రశ్నించిన అధికారులు.. అక్కడి నుంచి ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి తీసుకువచ్చారు.

తాజా ఎపిసోడ్‌ తో ఐఎన్‌ ఎక్స్ మీడియా వ్యవహారం మరోసారి వార్తల్లోకెక్కింది. స‌హ‌జంగానే ఏమిటీ కేసు అనే ఆస‌క్తి ప‌లువురిలో నెల‌కొంది. కార్తీతో సంబంధమున్న కొన్ని సంస్థలు ఐఎన్‌ ఎక్స్ మీడియాలో రూ.305 కోట్ల అక్రమ పెట్టుబడుల కోసం ఎఫ్‌ ఐపీబీపై ఒత్తిడి తీసుకువచ్చాయన్నది సీబీఐ ఆరోపణ. దీంతో కార్తీతోపాటు ఐఎన్‌ ఎక్స్ మీడియా - మరో ఎనిమిది మందిని - కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన కొందరు అధికారులపై ఎఫ్‌ ఐఆర్ నమోదైంది. 2007లో ఇది జరుగగా - ఆ సమయంలో కార్తీ తండ్రి చిదంబరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే ఓ జాతీయ సంస్థే విదేశీ పెట్టుబడుల ప్రగతి విభాగం (ఎఫ్‌ ఐపీబీ). కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం పరిధిలో ఇది పనిచేస్తుంది. దేశంలోకి ఆటోమేటిక్ మార్గంలో కాకుండా వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌ డీఐ) ప్రతిపాదనల్ని పరిశీలించి, ప్రధాన మంత్రి నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్‌కు సిఫార్సు చేస్తుంది. క్యాబినెట్ ఆమోదిస్తే ఆ ఎఫ్‌ డీఐకి ఇక మార్గం సుగమమైనట్లే.

అయితే దీని ఆధారంగానే చిదంబ‌రం కుమారుడు అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డ్డారు. పెట్టుబడులకు సంబంధించి ఎఫ్‌ ఐపీబీ ఆమోదం కోసం ఐఎన్‌ ఎక్స్ మీడియా నుంచి ఓ దరఖాస్తును 2007 మార్చి 15న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అందుకున్నది. ఈ క్రమంలోనే అదే ఏడాది మే 18న జరిగిన ఎఫ్‌ఐపీబీ సమావేశంలో ఐఎన్‌ ఎక్స్ మీడియా ప్రతిపాదన పరిశీలనకు వచ్చింది. అయినప్పటికీ ఐఎన్‌ ఎక్స్ న్యూస్‌ లో ఐఎన్‌ ఎక్స్ మీడియా పరోక్ష విదేశీ పెట్టుబడి ప్రతిపాదనను ఎఫ్‌ ఐపీబీ అంగీకరించలేదు. అయితే ఇందులో ఉన్న రూ.4.62 కోట్ల ఎఫ్‌డీఐని మాత్రమే అనుమతించింది. విదేశీ మదుపరులకు ఒక్కో షేర్‌ను రూ.800లకుపైగా ధరకు జారీ చేసుకోవచ్చని సూచించింది. కానీ సీబీఐ ఎఫ్‌ ఐఆర్ ప్రకారం ఎఫ్‌ ఐపీబీ ఆమోదానికి విరుద్ధంగా ఐఎన్‌ ఎక్స్ మీడియా ముందుకెళ్లింది. ఉద్దేశపూర్వకంగానే నిబంధనల్ని ఉల్లంఘిస్తూ.. ఐఎన్‌ ఎక్స్ న్యూస్‌ లో 26 శాతం దాకా పరోక్ష విదేశీ పెట్టుబడుల్ని స్వీకరించింది. దీంతో ఐఎన్‌ ఎక్స్ మీడియాకు రూ.305 కోట్లకుపైగా నిధులు అందాయి. దీనంతటికీ కారణం కార్తీ పలుకుబడి కారణంగా కొందరు అధికారులు నిబంధనల్ని ఉల్లంఘించి పనిచేయడమేనని సీబీఐ ఆరోపిస్తున్నది. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలన్న రెవిన్యూ శాఖ విజ్ఞప్తినీ సదరు అధికారులు పట్టించుకోలేదని సీబీఐ చెబుతున్నది.

స‌హ‌జంగా ఈ ఎపిసోడ్ లో కార్తీ పాత్రేమిటనే సందేహం వస్తుంది. సీబీఐ వివరాల ప్రకారం చెస్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ ప్రమోటరైన కార్తీతో కలిసి ఐఎన్‌ ఎక్స్ మీడియా నేరపూరిత కుట్ర చేసింది. అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం.. కార్తీ త్రండి కావడంతో ఎఫ్‌ఐపీబీ, ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులను లోబర్చుకుని, తమకు కావాల్సిన ప్రయోజనాన్ని పొందింది. ఇందుకు ప్రతిఫలంగా క్విడ్ ప్రోకో (నీకిది-నాకది) ఆధారంగా కార్తీకి ఐఎన్‌ ఎక్స్ మీడియా చెల్లింపులు జరిపింది. చెస్ మేనేజ్‌ మెంట్ సర్వీసెస్, అడ్వాంటేజ్ స్ట్రాటజిక్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌ లు వేదికగా ఐఎన్‌ ఎక్స్ గ్రూప్‌ నకు - కార్తీకి మధ్య లావాదేవీలు జరిగాయి. వీటికి ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుకూలంగా పావులు కదిపింది. దీంతో అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరంపైనా సీబీఐ దృష్టి పెట్టింది. ఈ క్ర‌మంలోనే తాజాగా అరెస్ట్ చేసింది.