Begin typing your search above and press return to search.

బాబు డ‌బుల్ స్టాండ్ కు ఇదే నిద‌ర్శ‌నం

By:  Tupaki Desk   |   30 Dec 2016 5:32 AM GMT
బాబు డ‌బుల్ స్టాండ్ కు ఇదే నిద‌ర్శ‌నం
X
పోలవరం ప్రాజెక్టుకు ఒక న్యాయం - గండికోట ప్రాజెక్టుకు మరొక న్యాయమా అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పోల‌వ‌రం ప్రాజెక్టును శ‌ర‌వేవగంగా ముందుకు తీసుకుపోతున్న ఏపీ స‌ర్కార‌కు గండికోట ప్రాజెక్టు ఎందుకు క‌నిపించ‌డం లేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. బాబు డ‌బుల్ స్టాండ్ కు ఇదే నిద‌ర్శ‌న‌మ‌ని మధు మండిప‌డ్డారు. గండికోట ప్రాజెక్టు కూడా పోలవరం ప్రాజెక్టు మాదిరే ఆంధ్రప్రదేశ్‌ లో ఉందని - ఇది ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. కడప జిల్లా కొండాపురం మండలం చౌటపల్లె గ్రామస్థులు - గండికోట నిర్వాసితులు మూడు రోజులుగా చేస్తున్న ఆందోళన కొనసాగుతున్న నేప‌థ్యంలో ధర్నా వద్ద మధు మట్లాడారు. ముంపునకు గురైన గ్రామాలకు చెందిన ప్రజలతో క్షేత్రస్థాయిలో ప్రజలు పడుతున్న ఇబ్బందుల అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ చంద్రబాబునాయుడు తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

పోలవరం ప్రాజెక్టు కింద నిర్వాసితులకు రూ.10 లక్షలు పరిహారం ఇచ్చారని - గండికోట ముంపు వాసులకు రూ.6.70 లక్షలు పరిహారం అడిగితే ఇవ్వకపోవడం ఏమిటని మధు సూటిగా ప్రశ్నించారు. కాంట్రాక్టర్లకు లబ్ది చేయడానికి పోలవరం ప్రాజెక్టు మొదట రూ.ఆరు వేల కోట్లు అన్నారనీ - తర్వాత రూ.8 వేలు - రూ.16 వేలు - చివరకు రూ.32 వేల కోట్లకు పెంచారని పేర్కొన్నారు. అక్కడ పెరిగినప్పుడు నిర్వాసితులకు మాత్రం పరిహారం ఎందుకు పెంచి ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గండికోట నిర్వాసితులకు మాత్రం ప్యాకేజి ఇవ్వమంటే క్యాబినెట్‌ లో చట్టబద్దత కావాలి - జీఓ రావాలని కుంటి సాకులు చెబుతున్నారని మ‌ధు విమర్శించారు. క్యాబినెట్‌ లో జీఓలు లేకుండా ఎక్కడా ఖర్చు చేయలేదా అని ప్రశ్నించారు. రైతులను ఇంత ఏడ్పించడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. ఈ క్యాబినెట్‌ లు - జీఓలు రైతులను మభ్య పెట్టి మోసం చేయడానికేనని పేర్కొన్నారు. ప్యాకేజి చెల్లించకుండా గ్రామాలలోకి నీరు రావడం దుర్మార్గమైన చర్య అని - పొమ్మనలేక పొగ పెట్టినట్లేనని మ‌ధు వ్యాఖ్యానించారు. గ్రామాల్లోకి నీరు వచ్చి ఇళ్లు పడిపోతుంటే వారు ఎక్కడికి పోవాలో దిక్కు తోచని పరిస్థితులో ఉన్నారన్నారు. మూడు రోజుల నుంచి ఏ ఒక్క అధికారైనా గ్రామాలలో తొంగి చూసిన పాపాన పోలేదని తెలిపారు. వెంటనే ప్రాజెక్టులోకి నీరు రాకుండా నిలిపివేయాలని, ప్యాకేజి ఇచ్చిన తర్వాతే గ్రామాలు ఖాళీ చేయించాలన్నారు. లేకపోతే పోరాటాన్ని మరింత ఉదృతం చేసి జిల్లా, రాష్ట్ర స్థాయికి తీసుకుపోతామని మధు హెచ్చరించారు.

ఇదిలాఉండ‌గా....పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ వే కాంక్రీటు పనులను నేడు మధ్యాహ్నం 1.59 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించనున్నారు. ముఖ్య అతిధులుగా కేంద్ర మంత్రులు ఉమా భారతి - వెంకయ్యనాయుడు - సురేష్‌ ప్రభు - అశోక్‌ గజపతిరాజు - వై.సుజనాచౌదరి - రాష్ట్ర మంత్రులు - ఎంఎల్‌ ఎలు పాల్గొన‌నున్నారు. ప్రాజెక్టు ప్రాంతంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మండలానికి రెండువేల మంది చొప్పున పశ్చిమగోదావరి జిల్లా నుంచి లక్షమందిని - తూర్పుగోదావరి జిల్లా నుంచి 50 వేల మందిని తరలించేందుకు సన్నాహాలు చేశారు. అందుకోసం ప్రయివేటు స్కూళ్లు - ఆర్‌ టీసీ బస్సులను పెద్దఎత్తున ఉపయోగిస్తున్నారు. సభకు హాజరైన వారందరికీ భోజనం - తాగునీటి సదుపాయాలు కల్పించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/