Begin typing your search above and press return to search.

ముద్రగడను దులిపేసిన నారాయణ

By:  Tupaki Desk   |   5 March 2016 4:28 AM GMT
ముద్రగడను దులిపేసిన నారాయణ
X
మాట్లాడేవాడే మొనగాడన్నది ఒక యాడ్ లో వినిపించే మాట. అలా అని నోటికి వచ్చినట్లు మాట్లాడటం సరికాదు. అలా అని మౌనంగా ఉండటం ఎంతమాత్రం మంచిది కాదు. ఏ అవసరానికి ఎంత మోతాదులో మాట్లాడాలన్న విషయంలో లెక్క పక్కాగా ఉండాలి. ఆ విషయంలో ఏ చిన్న తేడా వచ్చినా మొదటికే మోసం వస్తుంది. మిగిలిన విషయాల్లో ఈ సూత్రం ఎంతలా పని చేస్తుందో.. రాజకీయాల్లోనూ అంతలానే పని చేస్తుంది.

రాజకీయ విమర్శలు పెద్దగా చేసినట్లుగా కనిపించని ఏపీ మంత్రి నారాయణ.. ఈ మధ్యన విపరీతంగా చెలరేగిపోతున్నారు. ఓపక్క జగన్ పత్రికలో తనపై వస్తున్న ఆరోపణల ప్రభావమో.. లేక తనను అందరికంటే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారన్న ఆలోచనో కానీ.. ఆయనీ మద్య తరచూ ఆగ్రహానికి గురి అవుతున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన తాను ఓపక్క పెద్దగా ఉన్నా.. కాపులకు అండ తానేననంటూ ముద్రగడ పద్మనాభం చేస్తున్న వ్యాఖ్యలు ఆయనకు చిరాకు పుట్టిస్తున్నాయి.

ఇవాళ ఏపీలో ఉన్న పరిస్థితుల్లో ముద్రగడపై తీవ్రస్థాయిలో విరుచుకుపడే వారు కాస్త తక్కువే. తొందరపడి ఆయనపై నోరు చేసుకోలేరు. లెక్కలన్నీ సరి చూసుకుంటే.. నారాయణ.. గంటా లాంటి వాళ్లకు ముద్రగడను ఏదైనా మాట అనే అవకాశం ఉంది. ఈ విషయంలో గంటాతో పోలిస్తే.. నారాయణ బెటర్ అని చెప్పొచ్చు. తాజాగా ముద్రగడ మీద తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి నారాయణ. ఏపీ రాజధానికి ఎంత భూమి కావాలో చెప్పటానికి ముద్రగడ ఎవరని ప్రశ్నిస్తున్న నారాయణ.. భూసేకరణకు అంగీకరించిన రైతులకు లేని బాధ ముద్రగడకు ఎందుకని నిలదీస్తున్నారు.
అసలు రాజధాని కోసం ఎంత భూమి కావాలో ముద్రగడకు తెలుసా? అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. రాజధానికి 33వేల ఎకరాలు కాదు.. 55వేల ఎకరాల నుంచి లక్ష ఎకరాలు కావాలని నారాయణ వ్యాఖ్యానించటం గమనార్హం. ఈ విషయాన్ని రాయ్ పూర్.. గాంధీ నగర్ లకు వెళ్లి.. అక్కడ నిర్మించిన రాజధానుల్ని చూడాలని ముద్రగడకు నారాయణ సూచించారు.

రాజధాని ప్రాంతంలో రైతులంతా చాలా హ్యాపీగా ఉన్నారని.. కావాలంటే ఆయన వచ్చిరైతులతో మాట్లాడాలని వ్యాఖ్యానించారు. రాజధాని అంటే ఉత్త సెక్రటేరియట్ మాత్రమే కాదని చెప్పిన నారాయణ.. తాను కూడా కాపునేనని చెప్పుకొచ్చారు.

అంతాబాగానే ఉంది కానీ.. నారాయణ తన సామాజిక వర్గాన్ని చెప్పుకోవటమే ఇబ్బంది. ఎందుకంటే.. ఎవరైనా తమ గురించి మర్చిపోతే గుర్తు చేయాలి. ఈ లెక్కన నారాయణ తాను కాపు సామాజిక వర్గానికి చెందిన వాడినేనని ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోంది? ఈ విషయం మీద నారాయణ కాస్త ఆలోచిస్తే మంచిదేమో..?