Begin typing your search above and press return to search.

మంత్రి నారాయణ దుకాణ్ బంద్

By:  Tupaki Desk   |   19 April 2016 7:00 AM GMT
మంత్రి నారాయణ దుకాణ్ బంద్
X
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారనడానికి తాజా ర్యాంకింగులే ఉదాహరణగా చెప్పొచ్చు. కేబినెట్ నుంచి తొలగించబోయే జాబితాలో ఎవరెవరు ఉంటారన్న విషయాన్ని ర్యాంకుల ద్వారా లీక్ చేసి, అందుకు వారిని మానసికంగా సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. వైసీపీ నుంచి చేరిన వారికి సామాజిక సమీకరణలో భాగంగా స్థానం కల్పించేందుకు, ఇప్పటికే ఉన్న వారిని తప్పించేందుకు సిద్ధమవుతున్నారన్న వాదన వినిపిస్తోంది. ఆ క్రమంలోనే వ్యూహాత్మకంగా మంత్రులకు ర్యాంకులు ప్రకటించారని... తొలి వేటు మునిసిపల్ శాఖ మంత్రి నారాయణపైనే అని టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది.

తన మంత్రివర్గ సభ్యుల పనితీరు ఆధారంగా, చంద్రబాబు నాయుడు ఇచ్చిన ర్యాంకింగులు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే, ఇందులో ఆశ్చర్యక రమైన విషయం ఏమిటంటే... రాజధాని నిర్మాణ వ్యవహారంలో మొదటి నుంచి చురుకుగా పనిచేస్తున్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు చివరి స్థానం దక్కడం. అసలు భూ సమీకరణ - రాజధాని ఎంపిక - దానికోసం సీఆర్‌ డిఎ ఏర్పాటు వంటి కీలక అంశాల్లో చంద్రబాబునాయుడు ఏరికోరి నారాయణను ఎంచుకున్నారు. నిజానికి భూముల వ్యవహారం రెవిన్యూ శాఖ మంత్రి కెఇ కృష్ణమూర్తిది అయినప్పటికీ, కొత్త రాజధాని భూముల విషయంలో ఎక్కడా ఆయన ప్రమేయం లేకుండా, కేఈని పక్కకు తప్పించి, సీఆర్‌ డిఏ లో కూడా ఆయనకు పాత్ర లేకుండా చేశారు. మరి అంత ప్రాముఖ్యం ఇచ్చిన నారాయణకు చివరి ర్యాంకు ఇవ్వడం బట్టి, బాబు-నారాయణ మధ్య విబేధాలు వచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తోందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇటీవలి కాలంలో నారాయణ సొంత లక్ష్యాలతో వెళుతున్నారన్న చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. సీఆర్‌ డీఏలో కూడా కాపు - బలిజ సామాజికవర్గాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారని, తన దగ్గర పనిచేసే ఉన్నతాధికారికి పెత్తనం ఇచ్చారని, ఉద్యోగాలు కూడా తన సొంత సామాజికవర్గానికి చెందిన వారికే, దొడ్డి దారిన ఇస్తున్నారన్న విమర్శలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. దీన్నిబట్టి, నారాయణను త్వరలో తొలగిస్తారని పార్టీ ముఖ్యులు తమ అంతరంగిక సంభాషణల్లో చెబుతున్నారు. జ్యోతుల నెహ్రును కేబినెట్లోకి తీసుకోవాలంటే ఆ వర్గం కోటాలో ఉన్న నారాయణను తప్పించడమే మార్గం. అందుకే నారాయణపై వేటు వేసే వ్యూహంలో భాగంగనే ర్యాంకులను తెరపైకి తెచ్చారంటున్నారు. ఒకవేళ నారాయణను ఇంకా కొనసాగిస్తే, చివరి ర్యాంకు వచ్చిన మంత్రిని ఎలా కొనసాగిస్తారన్న విమర్శలు ఎదుర్కోవలసి వస్తుంది. ఏ కోణంలో చూసినా నారాయణపై వేటు ఖాయమని అర్ధమవుతోందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

మరోవైపు సమాచారశాఖ మంత్రి పల్లె రఘునాధరెడ్డికి 11వ ర్యాంకు వచ్చింది. ఆయన స్థానంలో రాయలసీమ నుంచి రెడ్డి వర్గానికి చెందిన భూమా నాగిరెడ్డికి మంత్రివర్గంలో స్థానం కల్పించాల్సి ఉన్నందున, అదే సామాజికవర్గానికి చెందిన పల్లెపై వేటు వేయక తప్పదని తెలుస్తోంది. ఇక మృణాళిని పనితీరుపై చాలాకాలం నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఆమె తన శాఖలో చురుకుగా పనిచేయలేకపోతున్నారని, ఆమె భర్త పెత్తనం ఎక్కువయిందన్న విమర్శలున్నాయి. విజయనగరం జిల్లాలో ఎమ్మెల్యేలతో ఆమెకు పొసగడం లేదు. పైగా, ఆమె బావ - టిడిపి ఏపి అధ్యక్షుడయిన కళా వెంకట్రావుకు మంత్రి పదవి ఇవ్వవచ్చన్న చర్చ జరుగుతోంది. అప్పుడు ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలంటే, మృణాళినిని తొలగించకతప్పదు. మొత్తానికి ర్యాంకులు మంత్రుల్లో గుబులు పుట్టిస్తున్నాయి.