Begin typing your search above and press return to search.

గుంటూరు కారం దెబ్బ చూపిస్తారట

By:  Tupaki Desk   |   14 Oct 2015 9:47 AM GMT
గుంటూరు కారం దెబ్బ చూపిస్తారట
X
అమరావతి శంకుస్థాపనకు ఏర్పాట్లు ఏ రేంజిలో జరుగుతున్నాయో తెలిసిందే... లక్షన్నర మంది హాజరయ్యే ఈ కార్యక్రమం గురించి ప్రపంచమంతా చెప్పుకోవాలన్నంత రేంజిలో ప్రచారం చేస్తున్నారు. వేలాది మంది విదేశీ అతిథులు ఈ కార్యక్రమానికి రానున్నారు... దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లూ వస్తారు. ఏ కార్యక్రమమైనా ఎంత చేసినా భోజనాలు ఎంత బాగున్నాయన్నదే ముఖ్యం... ఏపీ ప్రభుత్వం సరిగ్గా ఆ పాయింటు క్యాచ్ చేసింది. విదేశీ అతిథులకు దిమ్మతిరిగే రుచులు అందించాలని ప్లాను చేస్తోంది. అమరావతి శంకుస్థాపన వేడుకలో ఆతిథ్యం అదిరిపోవాలని మంత్రి నారాయణ బుధవారం అధికారులను ఆదేశించారు కూడా.

ఆతిథ్యానికి ఆంధ్రులకు సాటిలేరన్న రేంజ్‌ లో ఉండాలన్నారు. జపాన్ - సింగపూర్ ప్రతినిధులకు స్థానిక వంటకాల రుచి చూపించాలన్నారు. అమరావతి రాజధాని వేడుకకు పారిశ్రామికవేత్తలు - రాయబారులు - ప్రముఖులు - న్యాయమూర్తులు వస్తున్నారని చెప్పారు. ఆతిథ్యం పట్ల వారు ముగ్ధులవ్వాలని చెప్పారు.

అతిథులను బాగా చూసుకోవాలని, మంచి భోజనం పెట్టి పంపించాలన్నది మంచి ఆలోచననే అయినా అతిథులు ఎవరు... వారి ఆహారపు అలవాట్లేమిటి... వారికి మనం పెడుతున్న తిండేమిటి అన్నది కూడా ఆలోచించాల్సిన అవసరం కనిపిస్తోంది. చైనా వెళ్తే మనం అక్కడ కప్పలు - పాములు తినలేం కదా... లోకల్ రుచులు అని చెప్పి వారు మనకు అవే సర్వ్ చేస్తే పారిపోయి వచ్చేయాల్సిఉంటుంది. ఇక్కడ కూడా అదే సూత్రం వర్తిస్తుందని మంత్రులు మర్చిపోతున్నారు. విదేశీయులు కారం - ఉప్పు వంటి తక్కువ తింటారు... అంతెందుకు మన దేశంలోని ఉత్తరాది ప్రాంతం వారికీ కారం తక్కువ అలవాటే. కానీ రాజధాని శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించే గుంటూరు ప్రాంత వంటకాలు కారానికి పెట్టింది పేరు. గుంటూరు కారం అని అంటారు... వాటికి అలవాటుపడిన ఆంధ్ర ప్రజలకు అవి అత్యంత రుచికరంగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అక్కడి గోంగూర - మిరప పచ్చళ్లను మనమంతా లొట్టలేసుకుని తింటాం. కానీ, విదేశీ అతిథులకు అవి వడ్డిస్తే శంకుస్థాపన ప్రాంగణం ఖరాబు కాక మానదు. కాబట్టి లోకల్ రుచులంటూ సింగపూర్, జపాన్ దేశాలవారికి గుంటూరు కారం కొసరికొసరి తినిపిస్తే అంతే. టాయిలెట్లు ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేసుకుంటేనే ఈ ప్రయోగం చేయడం మంచిది.