Begin typing your search above and press return to search.

మీరు చెప్పింది నిజ‌మేనా నారాయ‌ణ‌?

By:  Tupaki Desk   |   10 Jun 2017 7:11 PM GMT
మీరు చెప్పింది నిజ‌మేనా నారాయ‌ణ‌?
X
గ్రాఫిక్ బొమ్మ‌ల‌తో ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిపై అంచ‌నాల‌ను అంత‌కంత‌కూ పెంచేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఏపీ రాజ‌ధాని న‌గ‌రాన్ని అద్భుతంగా తీర్చి దిద్దుతామ‌ని అటు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెప్ప‌టం తెలిసిందే. ఎంత అద్భుతంగా క‌ట్టినా.. సామాన్యులు.. దిగువ‌.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారికి ఏమాత్రం అవ‌కాశం లేని రీతిలో అమ‌రావ‌తి నిర్మాణం సాగుతుంద‌న్న విమ‌ర్శ ఉంది.

కోట్లాది రూపాయిల ధ‌ర‌తో మండిపోతున్న అమ‌రావ‌తి న‌గ‌రంలో.. అంతా సంప‌న్నులే ఉంటే.. వారికి అవ‌స‌ర‌మైన అవ‌స‌రాల్ని.. సౌక‌ర్యాల్ని తీర్చే వారెవ‌రు? అన్న ప్ర‌శ్న‌కు ఇప్ప‌టివ‌ర‌కూ స‌మాధానం చెప్పింది లేదు. రాజ‌ధానిలో నిర్మించే నిర్మాణాలు.. అందుకు సంబంధించిన ఫోటోలు చూసిన‌ప్పుడు అనిపించేది ఒక్క‌టే. సినిమా సెట్టింగు ను త‌ల‌పించేలా క‌నిపిస్తున్న అమ‌రావ‌తి మ‌హానగ‌రంలో బ‌డుగు.. బ‌ల‌హీన వ‌ర్గాల ప‌రిస్థితి ఏంద‌న్న ప్ర‌శ్న‌కు సంతృప్తిక‌ర‌మైన జ‌వాబు ఇప్ప‌టివ‌ర‌కు ల‌భించింది లేదు.

ఇలాంటి వేళ‌.. తాజాగా ఏపీ మంత్రి నారాయ‌ణ ఆస‌క్తిక‌ర ముచ్చ‌ట చెప్పుకొచ్చారు. ఏపీ సీడ్ యాక్సెస్ రోడ్డు భూసేక‌ర‌ణ 45 రోజుల్లో పూర్తి కానున్న‌ట్లు చెప్పిన ఆయ‌న‌.. ఆర్థిక‌.. క్రీడా న‌గ‌రాల‌పై మెకెన్సీ నివేదిక ఇచ్చిన‌ట్లుగా వెల్ల‌డించారు.

ఇక‌.. రాజ‌ధానిలో ఇల్లు లేని వ్య‌వ‌సాయ కూలీల‌కు ఇళ్లు క‌ట్టించాల‌ని చెప్పిన ఆయ‌న‌.. కేంద్ర‌.. రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌లిసి అమ‌రావ‌తిలోని ప‌ది చోట్ల వ్య‌వ‌సాయ కూలీల‌కు ఇళ్లు క‌ట్టించిన ఇవ్వ‌నున్న‌ట్లుగా చెప్పారు. వ్య‌వ‌సాయం అన్న‌ది లేకుండా అమ‌రావ‌తి న‌గ‌రాన్ని మార్చేస్తున్న వేళ‌.. వ్య‌వ‌సాయ కూలీల‌కు ఇళ్లు క‌ట్టించి ఇస్తే.. మ‌రి మిగిలిన బ‌డుగు జీవుల ప‌రిస్థితి ఏంది? అన్న‌ది ఒక ప్ర‌శ్న‌. వ్య‌వ‌సాయ కూలీలకు ఇళ్లు క‌ట్టిస్తాన‌ని చెబుతున్న మంత్రి నారాయ‌ణ‌.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి జీవుల సంగ‌తేంది? అన్న సందేహానికి కూడా స‌మాధానం చెబితే బాగుంటుంద‌న్న మాట వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/