Begin typing your search above and press return to search.

కేశ‌వ‌రెడ్డి స్కూళ్ల‌పై క‌న్నేసిన ఏపీ మంత్రి

By:  Tupaki Desk   |   15 Sep 2015 9:26 AM GMT
కేశ‌వ‌రెడ్డి స్కూళ్ల‌పై క‌న్నేసిన ఏపీ మంత్రి
X
విద్యార్థుల త‌ల్లిదండ్రుల నుంచి ఫీజులు క‌ట్టించుకోవాల్సింది పోయి...నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా డిపాజిట్లు సేక‌రించిన కేశ‌వ‌రెడ్డి విద్యాసంస్థ‌ల అధినేత కేశ‌వ్‌ రెడ్డి ఇప్పుడు క‌ట‌క‌టాల పాల‌య్యారు. మొత్తం 11 వేల మంది నుంచి ఆయ‌న రూ.575 కోట్ల‌ను డిపాజిట్లుగా సేక‌రించిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం రిమాండ్‌ లో ఉన్న కేశ‌వ‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రియ‌ల్ ఎస్టేట్ కాస్త డౌన్ అవ్వ‌డం వ‌ల్లే ఈ ప‌రిస్థితి వ‌చ్చింద‌ని..త‌న‌కు ఉన్న అప్పుల కంటే ఆస్తులు చాలా ఎక్కువ‌గా ఉన్నాయ‌ని...ఓ ఏడాది టైం ఇస్తే వెంట‌నే వాటిని తీర్చేస్తాన‌ని ఆయ‌న అంటున్నారు.

కేశ‌వ‌రెడ్డి ఇబ్బందుల్లో ఉండ‌డంతో ఇప్పుడు కేశ‌వ‌రెడ్డి గ్రూప్ స్కూళ్ల ప‌రిస్థితి ఏంటి..అందులో చ‌దువుతున్న 40వేల మంది విద్యార్థుల భ‌విష్య‌త్తు ఏం కావాల‌న్న ప్ర‌శ్న‌ల‌కు కూడా తెర‌పైకి వ‌స్తున్నాయి. అయితే సంద‌ట్లో స‌డేమియాగా ఆయ‌న్ను ఆదుకునేందుకు ఏపీ క్యాబినెట్‌ లోని మంత్రి రెఢీ అయ్యార‌ట‌. ఆయ‌న ఎవ‌రో కాదు నారాయ‌ణ గ్రూప్ విద్యాసంస్థ‌ల అధినేత‌, పుర‌పాల‌క శాఖా మంత్రి నారాయ‌ణ‌.

కేశ‌వ‌రెడ్డి స్కూల్స్‌ లో విద్యార్థుల భ‌విష్య‌త్తు మాది అన్న మాట అడ్డం పెట్టుకుని నారాయ‌ణ‌ త‌మ విద్యా సంస్థ‌ల‌కు పోటీగా ఉన్న కేశ‌వ‌రెడ్డి స్కూల్స్‌ ను టేకోవ‌ర్ చేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. రెండు తెలుగు రాష్ర్టాల్లో ఉన్న కేశ‌వ‌రెడ్డి స్కూళ్ల‌న్ని నారాయ‌ణ ఈ టెక్నో స్కూళ్ల‌లో విలీనం కావ‌డం ఖాయ‌మ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఇక్క‌డే మ‌రో రూమ‌ర్ కూడా ఏపీలో వినిపిస్తోంది. ఇదంతా ఓ ప‌థ‌కం ప్ర‌కార‌మే జ‌రిగింద‌ని...నారాయ‌ణ కేశ‌వ‌రెడ్డి స్కూళ్ల‌పై క‌న్నేసే ఇదంతా చేయించార‌ని అంటున్నారు. మ‌రి ఈ వార్త‌ల్లో ఎంత వ‌ర‌కు నిజం ఉందో తెలియ‌దు కాని...కేశ‌వ‌రెడ్డి స్కూల్స్ అయితే నారాయ‌ణ సంస్థ‌లో విలీనం ఖాయ‌మ‌ని మాత్రం జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.