Begin typing your search above and press return to search.

అలా నారాయణ అంత మొనగాడంట

By:  Tupaki Desk   |   6 Aug 2016 4:35 AM GMT
అలా నారాయణ అంత మొనగాడంట
X
ఏపీ విషయానికి సంబంధించి పలువురు ఒక ఆసక్తికర విషయాన్ని చెప్పుకొస్తారు. విభజన అనంతరం ఏపీ ఆర్థికంగా బక్కచిక్కిపోయిన విషయం తెలిసిందే. నెలవారీగా ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతాలకు సైతం కటకటలాడే పరిస్థితి. రాష్ట్రంగా ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ.. రాష్ట్రంలోని సంపన్నులకు కొదవలేదు. సంపన్నులున్న పేద రాష్ట్రంగా ఏపీని పలువురు అభివర్ణిస్తారు. ఇందుకు తగ్గట్లే తాజాగా ఈ విషయం ఒక సర్వేలో తాజాగా నిరూపితమైంది.

ఏపీ రాష్ట్ర మంత్రి నారాయణ దేశంలోనే అత్యంత ధనవంతుడైన మంత్రిగా ఘనత సాధించారు. దేశ వ్యాప్తంగా 29 రాష్ట్రాల్లోని మంత్రులుగా వ్యవహరిస్తున్న అందరి కంటే ఎక్కువ ఆస్తులు నారాయణకు ఉన్నట్లుగా తాజాగా తేలింది. దేశ వ్యాప్తంగా ఉన్న మంత్రుల నేర చరిత.. వారిపై ఉన్న కేసులు.. వారి ఆస్తులపై అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ ఒక సర్వే నిర్వహించింది.

దేశ వ్యాప్తంగా ఉన్న 620 మంది మంత్రుల్లో 609 మంత్రుల డేటాను విశ్లేషించింది. ఈ నివేదిక ప్రకారం రాష్ట్రాల్లో మంత్రుల ఆస్తుల విషయంలో ఏపీ మంత్రి నారాయణకు రూ.496 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తేలింది. సంపన్నుడైన మంత్రిగా ఆయన అగ్రస్థానంలో ఉంటే.. ఆయన తర్వాత కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ మంత్రి శివకుమార్ రూ.251 కోట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఒకటి.. రెండు స్థానాల మధ్యన రూ.245 కోట్ల ఆస్తులు వ్యత్యాసం ఉండటం గమనార్హం.

దేశ వ్యాప్తంగా మంత్రుల సరాసరి ఆస్తులు రూ.8.59 కోట్లు కాగా.. ఏపీ మంత్రుల సరాసరి ఆస్తి రూ.45.49 కోట్లు కావటం గమనార్హం. ఏపీ తర్వాత సంపన్న మంత్రుల జాబితాలో కర్ణాటక.. అరుణాచల్ ప్రదేశ్ నిలవగా.. అత్యల్ప ఆస్తులున్న మంత్రుల రాష్ట్రంగా త్రిపుర నిలిచింది. ఆస్తుల విషయాన్ని పక్కన పెట్టి క్రిమినల్ రికార్డుల్ని పరిశీలిస్తే.. దేశ వ్యాప్తంగా ఉన్న మంత్రుల్లో 210 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీరిలో 113 మందిపై హత్య.. కిడ్నాప్ లాంటి తీవ్ర కేసులు ఉన్నాయి. నేర చరిత ఉన్న మంత్రుల జాబితాలో మహారాష్ట్ర అగ్రస్థానంలో నిలవటం గమనార్హం. ఈ రాష్ట్రంలోని మంత్రుల్లో 18 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. మహారాష్ట్ర తర్వాత బీహార్లో 11 మందిపై.. తెలంగాణలో తొమ్మిదిమందిపై.. జార్ఖండ్ లో 9 మంది మంత్రులపై క్రిమినల్ కేసులు ఉండటం విశేషం.