Begin typing your search above and press return to search.

ఈసారి పద్మ పురస్కారాల ప్రత్యేకత ఏమంటే?

By:  Tupaki Desk   |   26 Jan 2020 4:19 AM GMT
ఈసారి పద్మ పురస్కారాల ప్రత్యేకత ఏమంటే?
X
జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా..ముందు రోజు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు.. సేవే లక్ష్యంగా.. సాటి మనిషికి సాయం చేసే వారిని గుర్తించి పురస్కరాల్ని ప్రకటించటం ఆనవాయితీగా వస్తున్నదే. ఈసారి అలాంటి ప్రక్రియే జరిగింది. కాకుంటే కాస్త ఆలస్యంగా. ప్రతిసారీ జనవరి 25 మధ్యాహ్నం నుంచి సాయంత్రం లోపులో పద్మ పురస్కారాల ప్రకటన వచ్చేస్తుండగా.. ఈసారి కాస్త ఆలస్యంగా పురస్కారాలు వరించిన వారి వివరాల్ని ప్రకటించారు.

ఈ ఏడాది మొత్తం 141 మందికి పద్మ పురస్కారాలు లభించాయి. వీటిల్లో భారత రత్న తర్వాత అత్యున్నత పౌరపురస్కారంగా చెప్పే పద్మవిభూషణ్ ఏడుగురికి అందింది. పద్మభూషణ్ పదహారు మందికి ఇస్తున్నట్లు చెప్పగా.. 118 మందికి పద్మశ్రీ పురస్కారాల్ని ప్రకటించారు. పద్మ విభూషణ్ పురస్కారం విషయానికి వస్తే.. ఏడుగురిలో అత్యధికులు ఈ మధ్యన మరణించిన వారే కావటం గమనార్హం.

గత ఏడాది కన్నుమూసిన రాజకీయ ప్రముఖులు జార్జి ఫెర్నాండెజ్.. సుష్మా స్వరాజ్.. అరుణ్ జైట్లీలకు పద్మ విభూషణ్ ను ప్రకటించారు. వాజ్ పేయ్ సర్కారులో జార్జి ఫెర్నాండెజ్ కేంద్రమంత్రిగా వ్యవహరిస్తే.. సుష్మా మోడీ 1 సర్కారులో కీలకమైన విదేశాంగ మంత్రిగా వ్యవహరించారు. ఆర్థిక మంత్రిగా వ్యవహరించి.. అనారోగ్యంతో మరణించిన అరుణ్ జైట్లీకి పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించారు. ఇటీవల మరణించిన కర్ణాటకకు చెందిన ఉడిపి పీఠాధిపతి విశ్వేకతీర్థ స్వామిజీ కూడా మరణాంతర పద్మవిభూషణ్ ను ప్రకటించారు. మొత్తం ఏడుగురికి ఈసారి పద్మవిభూషణ్ ప్రకటిస్తే.. అందులో నలుగురు మరణాంతర పురస్కారాలు ఉండటం గమనార్హం. మిగిలిన ముగ్గురి విషయానికి వస్తే.. సుప్రసిద్ధ బాక్సర్ మేరీకోమ్.. మారిషస్ మాజీ ప్రధాని అనెరూద్ జగన్నాథ్.. ప్రముఖ గాయకుడు చెన్నూలాల్ మిశ్రా కూడా ఉన్నారు.

ఇక.. పద్మభూషణ్ పురస్కారాల విషయానికి వస్తే మరో మాజీ కేంద్రమంత్రి.. దివంగత గోవా ముఖ్యమంత్రిగా వ్యవహరించిన మనోహర్ పారీకర్ కు పద్మభూషణ్ ను ప్రకటించారు. ఈ పురస్కారాల్ని పొందిన వారిలో ప్రముఖ పారిశ్రామికవేత్త.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆనంద్ మహీంద్ర.. వేణుశ్రీనివాసన్.. నాగాలాండ్ మాజీ సీఎం ఎస్ సీ జమీర్.. జమ్ముకశ్మీర్ మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి ముజఫర్ అలీబేగ్ లాంటి ప్రముఖులు పద్మభూషణ్ కు ఎంపికయ్యారు. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. భారత బ్యాడ్మింటన్ సంచలనం పీవీ సింధూకు తెలంగాణ రాష్ట్రం తరఫున పద్మభూషణ్ పురస్కారం లభించింది. పద్మశ్రీ పురస్కారాలే ఈసారి తెలుగు రాష్ట్రాల వారికి దక్కాయి.

దేశంలోని అన్ని రాష్ట్రాల వారికి పద్మ పురస్కారాలు వరించాయి. భారీ జాబితాను కాస్త వడపోసి చూస్తే.. దక్షిణాది వారి కంటే ఉత్తరాది వారికే ఎక్కువగా పురస్కారాలు సొంతమయ్యాయి. జమ్ముకశ్మీర్.. ఈశాన్య రాష్ట్రాలకు సైతం ప్రాధాన్యత మిస్ కాకుండా చూసుకున్నారు. ఇక.. పద్మ పురస్కారాలు లభించిన సినీ ప్రముఖుల్లో ప్రముఖ హీరోయిన్ కంగనా రౌనత్ కు పద్మ పురస్కారం లభించింది. ఆమెతో పాటు ప్రముఖ నిర్మాతలుగా పేరున్న ఏక్తా కపూర్.. కరణ్ జోహార్.. గాయకుడు అద్నాన్ సమీలకు పద్మశ్రీలు వరించాయి.

తెలుగువారి విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురికి పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. ఏపీ విషయానికి వస్తే శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రముఖ రంగస్థల కళాకారుడు యడ్ల గోపాలరావు.. అనంతకు చెందిన తోలుబొమ్మలాట కళాకారుడు చలపతి దళవాయిలకు పద్మశ్రీలు రాగా.. తెలంగాణకు సంబంధించి చూస్తే.. సేంద్రీయ వ్యవసాయంలో విశేషంగా పని చేస్తున్న సికింద్రాబాద్ వాసి చింతల వెంకటరెడ్డి.. కరీంనగర్ కు చెందిన సంస్కృత పండితులు శ్రీభాష్యం విజయసారథికి పద్మశ్రీలు వరించాయి.