Begin typing your search above and press return to search.

'పద్మా'ల చుట్టూ బురద

By:  Tupaki Desk   |   3 March 2016 10:30 PM GMT
పద్మాల చుట్టూ బురద
X
రామోజీ రావుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ విభూషణ్ పురస్కారం వివాదాలకు దారితీస్తోంది. రామోజీరావుపై గతంలోనూ పలు పోరాటాలు చేసిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తాజాగా ఈ వ్యవహారంపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీంతో పద్మ పురస్కారాల అంశం దేశవ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ పురస్కారాలకు చేసే ఎంపికలపై ఉన్న విమర్శలు మరోసారి వినిపిస్తున్నాయి. తమకు నచ్చిన వారికి... తమకు అనుకూలంగా ఉండే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదించినవారికి... తమకు కీలకంగా ఉండే రాష్ట్రాలవారికి పురస్కారాలు ఇస్తున్నట్లుగా లెక్కలు చెబుతున్నాయి.

కేంద్రంలోని ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వమే కాదు గతంలో ఉన్న ప్రభుత్వాలూ పద్మ పురస్కారాలు పూర్తిగా రాజకీయపరమైన కారణాలు, ప్రాధాన్యాల నేపథ్యంలోనే ఎంపికలు చేస్తున్నాయన్న విమర్శలున్నాయి. గత 60 ఏళ్లలో పద్మపురస్కారాలు ఎవరెవరికి ఇచ్చారన్నది పరిశీలిస్తే ఆసక్తికర అంశాలు బయటపడ్డాయి. దేశంలో కానీ, వివిధ రాష్ట్రాల్లో కానీ ఎన్నికలు ఉన్న సంవత్సరాల్లో పెద్ద సంఖ్యలో పురస్కారాలను ప్రకటించిన ఉదంతాలు కనిపించాయి.

పద్మ పురస్కారాలను మొట్టమొదట 1954లో ప్రారంభించారు. కొన్ని కారణాల వల్ల 1978 - 1979 - 1993 - 1997 ల్లో తప్ప మిగిలిన అన్ని సంవత్సరాల్లోనూ ఈ అవార్డులను ప్రకటించారు. పద్మవిభూషన్ - పద్మభూషణ్ - పద్మశ్రీ అన్న మూడు కేటగిరీల్లో ఈ అవార్డులు ఉంటాయి. విదేశీయులకు, మరణానంతరం ప్రకటించేవారికి ఇచ్చే పురస్కారాలు కాకుండా మిగతావారికి మొత్తం 120 కంటే ఎక్కువ అవార్డులు ప్రకటించరాదన్న నిబంధన ఉంది.

ఇప్పటివరకు పద్మశ్రీ అవార్డుల ఏ రంగానికి ఎన్ని వచ్చాయి..?
-----------
రంగం సంఖ్య
------
కళలు 600 పైగా
సాహిత్యం - విద్య 505
మెడిసన్ సుమారు 400
సైన్స్ - ఇంజినీరింగ్ 300 పైన
సోషల్ వర్క్ 300
సివిల్ సర్వీసెస్ 220
క్రీడలు 180
పారిశ్రామికవేత్తలు సుమారు100
ప్రజాజీవితం 50కి పైగా
ఇతరులు సుమారు50

- ఎన్నికల సంవత్సరాల్లోనే పద్మ పురస్కారాలు ఎక్కువగా ఇస్తున్నారు. సాధారణ సంవత్సరాల కంటే ఎన్నికల ఏడాదిలో 30 శాతం ఎక్కువ పురస్కారాలు ప్రకటిస్తున్నారు.

గత పదిహేనేళ్లలో మూడు జనరల్ ఎలక్షన్లు వచ్చాయి. ఆ ఏడాదిలో ప్రటించిన పురస్కారాల సంఖ్య అంతకుముందు మూణ్నాలుగేళ్ల పురస్కారాల సగటు కంటే 30 శాతం ఎక్కువగా ఉంది.
--------------
ఎన్నికల సంవత్సరం ఆ ఏడాది పద్మశ్రీ పురస్కారాలు అంతకుముందు సంవత్సరాల సగటు
-----------------
2004 74 57
2009 93 66
2014 101 80
--------

ఇకపోతే ఏఏ రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇస్తున్నారన్న లెక్కలు ఆసక్తికరమే.. గత 16 సంవత్సరాల్లో కేవలం 7 రాష్ట్రాలు తమిళనాడు - కర్ణాటక - ఏపీ - యూపీ - కేరళ రాష్ట్రాలకే 63 శాతం అవార్డులు దక్కాయి.

2000, 2016 మధ్య ఏ రాష్ట్రానికి ఎంత శాతం అవార్డులు వచ్చాయి..
--------
రాష్ట్రం అవార్డుల్లో శాతం
-------
ఢిల్లీ 19 శాతం
మహారాష్ట్ర 15
తమిళనాడు 8
కర్ణాటక 6
ఏపీ 6
యూపీ 5
కేరళ 4
మిగతా అన్ని రాష్ట్రాలకు కలిపి 37శాతం

- పద్మపురస్కారాల్లో పక్షపాతాలు, రాజకీయ సమీకరణలకు తోడు ఇంకా ఎన్నో అవకతవకలు కూడా ఉన్నాయన్న ఆరోపణలు ఉంటున్నాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతిపాదన రావడంతో కేంద్రం రామోజీరావును పద్మవిభూషణ్ కు ఎంపిక చేసింది. దేశంలో రెండో అత్యున్నత పురస్కారానికి ఎంపికైన ఆయనకు ఆ పురస్కారం ప్రకటించడంపై కోర్టులో కేసు నడుస్తుండడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.