Begin typing your search above and press return to search.

పద్మ పురస్కారాలతో ప్రముఖులైన 'సామాన్యులు'

By:  Tupaki Desk   |   26 Jan 2020 4:22 AM GMT
పద్మ పురస్కారాలతో ప్రముఖులైన సామాన్యులు
X
దేశంలోని వివిధ రంగాల వారికి అందే అత్యుత్తమ పౌర పురస్కారంగా పద్మ పురస్కరాల్ని చెబుతుంటారు. అయితే.. బాగా పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్న వారికి మాత్రమే ఇవి లభిస్తాయన్న పేరుంది. మోడీ హయాంలో ఈతీరు కాస్త మారినా.. ఈ ఏడాది ఈ తేడా కొట్టొచ్చినట్లుగా కనిపించింది. పద్మశ్రీ పురస్కారం లభించిన కొందరిని చూస్తే.. వారిలో చాలాపేర్లు ఆయా రాష్ట్రాలకు చెందిన వారికి కూడా పెద్దగా తెలీని వారు ఉండటం విశేషం.

ప్రచారానికి దూరంగా ఉంటూ.. తమ పని తాము చేసుకుంటూ పోవటమే తప్పించి.. గుర్తింపు కోసం పాకులాడే వారికి భిన్నంగా పద్మ పురస్కారాలు లభించాయి. పద్మశ్రీలు లభించిన వారిలో చాలావరకూ సామాన్యులే కావటం గమనార్హం. తమ సేవతో సామాన్యులుగా ఉన్న వారిని ప్రముఖులుగా మార్చేసిన కొత్త ట్రెండ్ ఈసారి మోడీ సర్కారు షురూ చేసిందని చెప్పాలి.

అలాంటి వారికి సంబంధించి కొందరిని చూసినప్పుడు.. పద్మశ్రీ పురస్కారాల ఎంపికతో కేంద్రం కసరత్తు కొట్టొచ్చినట్లుగా కనిపించక మానదు. చండీగఢ్ పీజీ ఆసుపత్రి ఎదురుగా రోజూ రెండు వేల మందికి అన్నదానం చేసే జగదీశ్ లాల్ ఆహుజా.. ఫైజాబాద్ లో పాతికవేల అనాథ శవాలకు మతంతో సంబంధం లేకుండా అంత్యక్రియలు జరిపించిన మహ్మద్ షరీఫ్ లతో పాటు.. దివ్యాంగులకు సేవ చేసే జావెద్ అహ్మద్ తక్.. ఎలాంటి విద్యార్హత లేకున్నా వేలాది మొక్కలు.. వివిధ జాతులపై అపారమైన పట్టున్న కర్ణాటకకు చెందిన అలక్కి గిరిజన జాతికి చెందిన తులసిగౌడ్ లాంటి వారెందరో కనిపిస్తారు.

భోపాల్ గ్యాస్ ప్రమాదంలో సగం చూపు కోల్పోయినా.. భర్తల్ని కోల్పోయిన 2300 మందికి స్వచ్ఛంద శిక్షణను అందిస్తున్న జబ్బార్.. సులభ్ ఇంటర్నేషనల్ సామాజిక సేవా సంస్థ అధ్యక్షురాలు ఉషా చౌమార్.. గ్రంథాలయోద్యమాన్ని నిర్వహించిన అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన సత్యనారాయణ్ ముండయార్.. మహారాష్ట్రలోని కరవు పీడిత గ్రామాన్ని చెట్లతో నింపిన హివారే బజార్ సర్పంచ్ పోపట్రావ్ పవార్.. బత్తాయి పళ్లను అమ్ముతూ పేదల్ని చదివించిన కర్ణాటకకు చెందిన హరేకళా హజబ్బా.. రోగులకు ఉచిత వైద్య చికిత్సను అందించే అరుణోదయ మండల్ తో పాటు..గుజరాత్ లో సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించే ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ రాధామోహన్.. ఆయన సతీమణి సబర్మతికి జంటగా పద్మశ్రీలు లభించటం విశేషంగా చెప్పాలి.

ఏనుగుల సంరక్షణ కోసం నిర్విరామంగా పని చేసే కుశాల్ కోన్వర్ శర్మ.. సాదాసీదా మహిళల్ని ఒకరకం పసుపు కొమ్ము ఎగుమతిదారులుగా మార్చిన స్కూల్ టీచర్ ట్రినిటీ సాయూ.. 70వేల మంది కేన్సర్ రోగులకు అసోంలో ఉచిత చికిత్స అందించిన డాక్టర్ రవికన్నన్.. ముస్లిం అయినప్పటికీ శ్రీకృష్ణుడిపై వందలాది భజనగీతాల్ని రాసి పాడే జైపూర్ వాసి మున్నా మాస్టర్ తదితరులకు పద్మశ్రీ లభించాయి. ఈసారి పద్మ పురస్కారాల్లో 34 మంది మహిళలు ఉన్నారు.