Begin typing your search above and press return to search.

సైకిల్ మెకానిక్ చాచాకు పద్మశ్రీ...దక్కి తీరాల్సిందేనబ్బా

By:  Tupaki Desk   |   27 Jan 2020 2:02 PM GMT
సైకిల్ మెకానిక్ చాచాకు పద్మశ్రీ...దక్కి తీరాల్సిందేనబ్బా
X
భారత గణతంత్రి దినోత్సవాన్ని పురస్కరించుకుని నిన్న కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. మొత్తం 141 మందికి పద్మ పురస్కారాలను ప్రకటించిన మోదీ సర్కారు.. వారిలో ఏడుగురికి పద్మ విభూషణ్, 16 మందికి పద్మ భూషణ్, 118 మందికి పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. ఈ జాబితాలో ఆయా రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఈ పురస్కారాలు అందజేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. పురస్కారాలు దక్కిన వారిలో... ఎవరెవరికి ఏఏ రంగంలో, ఎందుకు అవార్డులు ప్రకటించిన విషయాన్ని కూడా కేంద్రం ప్రకటించింది. ఈ మొత్తం జాబితాలో 140 మందికి అందిన పురస్కారాలు ఒక ఎత్తైతే... సైకిల్ మెకానిక్ గా జీవనం సాగిస్తున్న మొహహ్మద్ షరీఫ్ అలియాస్ చాచాకు పద్మశ్రీ పురస్కారం దక్కడం ఒక ఎత్తని చెప్పాలి.

ఎందుకంటే... పురస్కారాలు దక్కించుకున్న 140 మంది వారి వారి రంగాల్లో విశిష్ట సేవలతో పురస్కారాలు చేజిక్కించుకుంటే... చాచా మాత్రం తనకు చెందని రంగంలో, తనవారు కాని వారి అంత్యక్రియలను జరిపి ఈ పురస్కారాన్ని దక్కించుకోవడం విశేషం. అయినా పద్మశ్రీ అవార్డు దక్కేంత స్థాయిలో చాచా ఎంతమందికి అంత్యక్రియలు జరిపారన్నదే కదా మీ డౌటు? ఒకరు కాదు... ఇద్దరు కాదు... ఏకంగా 25 వేల మంది అనాథలకు చాచా అంత్యక్రియలు నిర్వహించారు. అది కూడా 27 ఏళ్ల వ్యవధిలో. ఏంటీ... 27 ఏళ్ల వ్యవధిలో 25 వేల మంది అభాగ్యులు చనిపోతే... చాచానే వారి శవాలకు అంత్యక్రియలు నిర్వహించారా? నిజమేనండీ బాబూ... అందుకే ఉత్తర ప్రదేశ్ లోని ఫైజాబాద్ కు చెందిన 82 ఏళ్ల వయస్సున్న చాచాకు పద్మశ్రీ పుపరస్కారం దక్కింది.

అయినా చాచా ఇలా అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించే పనికి చాచా ఎందుకు పూనుకున్నారు? దీని వెనుక ఓ గాథ ఉంది. షరీఫ్‌ చాచా 27 సంవత్సరాల క్రితం తన కొడుకును కోల్పోయాడు. అయితే.. కొడుకు మరణాన్ని కూడా చాచా నెల రోజుల తరువాత తెలుసుకున్నాడు. అంటే మరణించిన తన కుమారుడి శవానికి ఎలా అంత్యక్రియలు జరిగాయో? అసలు అంత్యక్రియలు జరిగాయో? లేదో?... ఇక్కడే చాచా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కొడుకు మాదిరిగా ఏ ఒక్కరికీ దహన సంస్కారాలు లేని పరిస్థితి రాకూడదు అనుకున్నారు. అంతే... అప్పటి నుండి అనాథ శవాలను దహనం చేయటానికి చాచా కంకణం కట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ఫైజాబాద్ పరిసరాల్లో 25 వేలకు పైగా అనాథ శవాలకు చాచా దహన సంస్కారాలను నిర్వహించారు. అంతేకాదండోయ్... చాచా నిస్వార్థ సేవలో ఓ ప్రత్యేక లక్షణం కూడా ఉంది. కులం, మతం అన్న తారతమ్యం చూడకుండా... చనిపోయిన అభాగ్యుడు ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయితే ఆ వ్యక్తి దహన సంస్కారాలను ఆ మతం నిబంధనలకు అనుగుణంగానే చాచా నిర్వహించారట. సో... ఏ లెక్కన చూసినా... చాచాకు పద్మశ్రీ పురస్కారం దక్కి తీరాల్సిందే.