Begin typing your search above and press return to search.

పాక్ ఆర్మీ దుర్మార్గం.. పీవోకే‌లోకి కరోనా పేషెంట్ల తరలింపు !

By:  Tupaki Desk   |   27 March 2020 11:30 PM GMT
పాక్ ఆర్మీ దుర్మార్గం.. పీవోకే‌లోకి కరోనా పేషెంట్ల తరలింపు !
X
క‌రోనావైర‌స్ మ‌హ‌మ్మారి రోజురోజుకు మరింతగా విస్త‌రిస్తోంది. ఒక్కో దేశం వ్యాప్తి చెందుతూ, ప్ర‌పంచ దేశాల‌న్నింటికి సోకింది. ఈ క్ర‌మంలో పంజాబ్ ప్రావిన్స్ లోని కరోనా బాధితుల‌ను పాక్ ఆర్మీ బ‌ల‌వంతంగా పీఓకే పాక్ ఆక్రమిత కశ్మీర్, గిల్గిట్ బల్టిస్థాన్‌కు పంపిస్తోంది. పంజాబ్ ప్రావిన్స్‌ లో కరోనా పేషెంట్లు లేకుండా చూడటం కోసం పాక్ ఆక్రమిత కశ్మీర్లోని మిర్పూర్, ఇతర ప్రాంతాల్లో క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేశారని సమాచారం. ఆర్మీ కేంద్రాలు, సైనికుల కుటుంబాలకు సమీపంలో ఒక్క కరోనా పేషెంట్ కూడా ఉండొద్దని ఆర్మీ చీఫ్ ఆదేశాలు జారీ చేశారు.

లాక్ చేసిన రవాణా వాహనాల్లో భారీ సంఖ్యలో కరోనా పేషెంట్లను మిర్పూర్ సిటీతోపాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. కాగా పీవోకేలో వైద్య సదుపాయాలు, శిక్షణ పొందిన వైద్య సిబ్బంది సరిపడా లేరు. దీంతో తమ ప్రాంతంలో క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేయడం పట్ల పీవోకే ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక కశ్మీరీ ప్రజల మనుగడకు ముప్పు వాటిల్లుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పాకిస్థాన్‌లో పంజాబ్ ప్రావిన్స్‌కు రాజకీయంగా ప్రాధాన్య‌త‌ ఉండ‌టంతో ఈ త‌ర‌హా చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతుంద‌ని.. పీవోకే ప్రజలు ఆరోపిస్తున్నారు. చిన్నపాటి వ్యాధులకు చికిత్స అందించడానికే వైద్య వసతులు సరిగ్గా లేనిచోట కోవిడ్ కి ట్రీట్మెంట్ ఏంట‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.