Begin typing your search above and press return to search.

వ్యతిరేకించేటోడు సైతం మద్దతు ఇచ్చేలా పాక్ తీరు

By:  Tupaki Desk   |   17 Dec 2019 5:51 AM GMT
వ్యతిరేకించేటోడు సైతం మద్దతు ఇచ్చేలా పాక్ తీరు
X
ఇప్పటివరకూ మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించేటోళ్లు సైతం.. తమ తీరును మార్చుకునేలా దాయాది పాకిస్తాన్ తీరు ఉందని చెప్పాలి. పాకిస్థాన్ సరిగ్గా ఏడ్చి చచ్చి ఉంటే.. అసలీ రోజున ఈ సమస్య వచ్చేది కాదు. గురివింద తరహాలో.. తన కింద నలుపును వదిలేసి.. భారత్ చేసిన సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆ దేశ పార్లమెంటు చేపట్టిన తీర్మానం ఒళ్లు మండేలా చేస్తుందని చెప్పాలి.

భారత్ చేపట్టిన పౌరసత్వ సవరణ చట్టాన్ని పాక్ వ్యతిరేకించటమే కాదు.. తాజాగా ఆ దేశ పార్లమెంటులో ఇందుకు సంబంధించిన ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ వ్యవహారం ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలకు వ్యతిరేకంగా పేర్కొంది. తక్షణమే ఈ చట్టాన్ని భారత ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేయటం ద్వారా.. తమ నిర్ణయాన్ని మరింత పట్టుదలతో అమలు చేసేలా చేసిందని చెప్పాలి.

ఓపక్క పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. వీటిల్లో చాలావరకూ రాజకీయ ప్రేరేపితమైనవిగా చెప్పాలి. వామపక్ష భావజాలంతో ఉన్న పార్టీలతో పాటు.. ప్రగతిశీల భావనలపై వాదనలు వినిపించే వర్గం తప్పించి.. మిగిలిన వారు మోడీ సర్కారు చేపట్టిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా లేరని చెప్పాలి.

ఈ చట్టంపై తొలుత ఆందోళనలు చెలరేగిన ఈశాన్య రాష్ట్రాల్లో తగ్గుముఖం పడితే.. పశ్చిమబెంగాల్ తో పాటు కొన్ని రాష్ట్రాల్లో.. అది కూడా బీజేపీయేతర ప్రభుత్వాలు కొలువు ఉన్న రాష్ట్రాల్లోనే నిరసనలు.. ఆందోళనలు చోటు చేసుకుంటున్నాయన్న నిజాన్ని మర్చిపోలేం. ఇదిలా ఉంటే.. తాజాగా పాక్ పార్లమెంటులో చేసిన తీర్మానం అభ్యంతరకరంగా మారిందని చెప్పాలి.

అంతర్జాతీయ మానవహక్కుల చట్టం.. పక్షపాతం.. సమానత్వ నిబంధనలకు భారత దేశం చేపట్టిన పౌరసత్వ సవరణ చట్టం విరుద్ధమని.. ఇరుదేశాల ద్వైపాక్షిక ఒప్పందాలకు విరుద్ధంగా పాక్ పేర్కొంది. మైనార్టీల హక్కులు.. భద్రతకు ఈ చట్టం భంగం కలిగిస్తుందని స్పష్టం చేసింది. పొరుగు దేశాల నుంచి వలస వచ్చే మైనార్టీలకు రక్షణ కల్పించటానికి ఈ చట్టం ఆమోదించినట్లు చెబుతున్న భారత సర్కార్.. స్వదేశంలోని మైనార్టీల హక్కులను ఉల్లంఘిస్తున్నామన్న నిజాన్ని విస్మరిస్తోందంటూ పాక్ మంత్రి షఫ్ కత్ మహ్ మూద్ చేసిన వ్యాఖ్యలు వింటే ఒళ్లు మండకమానదు.

అసలు తప్పంతా పాక్ ది. ఆ దేశమే కనుక.. తన దేశంలోని మైనార్టీల విషయంలోనూ.. వారి హక్కుల విషయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించి ఉండకపోతే.. ఈ రోజు ఈ సమస్య తలెత్తేదే కాదు. దశాబ్దాల తరబడి తమ దేశంలో మైనార్టీల హక్కుల్ని పాతరేసిన పాక్.. భారత్ లోని మైనార్టీల హక్కుల గురించి మాట్లాడటమా? ఒకవేళ భారత్ లోని మైనార్టీల మీదా.. వారి హక్కులకు భంగం వాటిల్లుతుందన్న ఆందోళన నిజంగా ఉండి ఉంటే.. భారత్ మాదిరి పాక్ సర్కారు సైతం పౌరసత్వ సవరణ చట్టాన్ని చేపట్టి.. భారత్ నుంచి పాక్ కు వచ్చేందుకు మైనార్టీలకు అవకాశం కల్పిస్తామంటూ ఓపెన్ ఆఫర్ పెట్టేయొచ్చుగా? దేశంలోని మైనార్టీల బాగోగులు పట్టించుకోని పాక్ సర్కారు.. భారత్ గురించి మాట్లాడటమా? అని ఒళ్లు మండక మానదు.