Begin typing your search above and press return to search.

భార‌త్, పాక్‌ ల మ‌ధ్య యుద్ధ‌మేనా?

By:  Tupaki Desk   |   11 April 2017 4:51 PM GMT
భార‌త్, పాక్‌ ల మ‌ధ్య యుద్ధ‌మేనా?
X
భార‌త నావికా ద‌ళానికి చెందిన మాజీ అధికారి కుల‌భూష‌ణ్ జాద‌వ్ వ్య‌వ‌హారం దాయాదీ దేశాలైన భార‌త్‌ - పాకిస్థాన్‌ ల మ‌ధ్య మ‌రోమారు హైటెన్ష‌న్ వాతావ‌ర‌ణానికి కార‌ణ‌మైంద‌న్న వాద‌న వినిపిస్తోంది. త‌న దేశంలోకి ప్ర‌వేశించి గూఢ‌చ‌ర్యానికి పాల్ప‌డ్డాడ‌ని ఆరోపిస్తూ జాద‌వ్‌ కు పాకిస్థాన్ మిలిట‌రీ కోర్టు ఉరి శిక్ష విధించిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యం తెలిసిన వెంట‌నే భార‌త్ వేగంగా స్పందించింది. జాద‌వ్ గూఢ‌చారి కాద‌ని, ఆయ‌న‌ను వ‌దిలివేయాల‌ని, లేని ప‌క్షంలో తీవ్ర ప‌రిణామాలు త‌ప్ప‌వ‌ని కాస్తంత గ‌ట్టి స్వ‌రాన్ని వినిపించింది. అయితే భార‌త్ వాద‌న‌ను కొట్టిపారేస్తూ పాకిస్థాన్ కూడా త‌న‌దైన వాద‌న‌ను వినిపించింది. గూఢ‌చారి కాకుంటే త‌మ దేశంలో గుట్టుగా ఉండాల్సిన అవ‌స‌ర‌మేమిట‌న్న అంశాన్ని ఆ దేశం వాదిస్తోంది. దీనికి కౌంట‌ర్ ఇచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌ నాథ్ సింగ్‌... అస‌లు గూఢ‌చారుల వ‌ద్ద పాస్ పోర్టులు - ఇత‌ర గుర్తింపు కార్డులు ఉండ‌టం ఎప్పుడైనా చూశారా? అని సాంకేతిక అంశాల‌ను ప్ర‌స్తావిస్తూ... జాద‌వ్ ముమ్మాటికీ గూఢ‌చారి కాద‌ని పాక్‌కు అర్థ‌మ‌య్యేలా చెప్పారు. అయితే రాజ్ నాథ్ మాట‌ను కూడా పాకిస్థాన్ అంత‌గా ప‌ట్టించుకున్న దాఖ‌లా లేదు. ఈ క్ర‌మంలో నిన్న మ‌ధ్యాహ్నం నుంచే ఈ వ్య‌వ‌హారంపై ఇరు దేశాల మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రిగింది.

ఆ త‌ర్వాత రంగ‌లోకి దిగిన బీజేపీ ఫైర్ బ్రాండ్ - ఆ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి పాక్ వైఖ‌రిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ సంచల‌న వ్యాఖ్య‌లు చేశారు. జాదవ్‌ ను పాకిస్థాన్‌ ఉరితీస్తే...పాక్‌లోని బలోచిస్థాన్‌ ను స్వతంత్ర‌ దేశంగా భార‌త్‌ గుర్తించాల్సిందేనన్నారు. సింధ్‌ ప్రావిన్స్‌ ను పాకిస్థాన్‌ విడిచి వెళ్లాల్సిందేనని డిమాండ్‌ చేశారు.పాకిస్థాన్‌ కు భారత్‌ గట్టి వార్నింగ్‌ ఇవ్వాల్సిందేనని కోరారు. జాదవ్‌ ను ఉరితీస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, ఆ దేశానికి మంచిది కాదని నేరుగా హెచ్చరించాలని కేంద్రాన్ని కోరారు. ఇక నేటి ఉద‌యం పార్ల‌మెంటు స‌మావేశాలు ప్రారంభం కాగానే... ఉభ‌య స‌భ‌ల్లో జాద‌వ్ వ్య‌వ‌హారంపైనే పెద్ద చ‌ర్చ న‌డిచింది. ప్ర‌తిప‌క్షంతో పాటు అధికార ప‌క్షం కూడా ఒకే తాటిపైకి వ‌చ్చాయి. కులభూష‌ణ్ గూఢ‌చారి కాద‌ని, ఆయ‌న‌ను త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయాల‌ని పాకిస్థాన్‌ను ఇరుప‌క్షాలు డిమాండ్ చేస్తూ గ‌ట్టి వాద‌న‌నే వినిపించాయి. అధికార ప‌క్షం త‌ర‌ఫున కేంద్ర విదేశీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి సుష్మా స్వ‌రాజ్ ఈ విష‌యంపై పెద్ద ప్ర‌క‌ట‌నే చేశారు. కుల‌భూష‌ణ్‌ను సుర‌క్షితంగా దేశానికి తిరిగి ర‌ప్పించేందుకు అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ప్ర‌క‌టించారు.

ఈ విష‌యంలో పాకిస్థాన్ త‌న వైఖ‌రిని మార్చుకోవాల్సి ఉంద‌ని, అవ‌స‌ర‌మైతే... పాక్ తో చ‌ర్చ‌ల కోసం ఆ దేశానికి ప్ర‌తినిధి బృందాన్ని పంపుతామ‌ని సుష్మా ప్ర‌క‌టించారు. జాధవ్‌ విషయంలో పాకిస్తాన్ కుట్రపూరితంగా వ్యవరిస్తోందని ఆమె ఆరోపించారు. నిష్పక్షపాతంగా విచారణ జరపకుండానే పాకిస్తాన్‌ మిలటరీ కోర్టు జాద‌వ్‌కు ఉరిశిక్ష విధించిందన్నారు. కుల్‌ భూషణ్‌ గూఢచర్యానికి పాల్పడినట్టు ఆధారాలు లేవన్నారు. జాద‌వ్‌కు ఉరిశిక్ష విధిస్తే రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో చోటుచేసుకోబోయే పరిణామాలకు పాకిస్తాన్ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కుల్‌భూషణ్‌ కు భారత్ అండగా ఉంటుందని చెప్పారు. జాద‌వ్‌ కు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. పాకిస్తాన్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. ఇక ప్ర‌భుత్వ వాద‌న‌ను మ‌ద్ద‌తు ప‌లికిన విప‌క్షం కూడా జాద‌వ్‌ను సురక్షితంగా దేశానికి రప్పించాల‌ని డిమాండ్ చేసింది. రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత గులాం న‌బీ ఆజాద్ ఈ విష‌యంపై మాట్లాడుతూ జాద‌వ్‌ తరపున పాకిస్తాన్ సుప్రీంకోర్టులో వాదించేందుకు మంచి లాయర్‌ ను నియమించాలని ప్రభుత్వానికి సూచించారు.

ఇక భార‌త్ వాద‌న‌ను అంత‌గా ప‌ట్టించుకున్న‌ట్టుగా పాక్ క‌నిపించ‌లేదు. జాద‌వ్‌ కు మ‌ద్ద‌తుగా భార‌త్ చేసిన ప్ర‌కట‌న‌లు, హెచ్చ‌రిక‌ల‌ను పాక్ చాలా తేలిగ్గా తీసుకున్న‌ట్టే క‌నిపిస్తోంది. అంతేకాకుండా... త‌న‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేసిన భార‌త్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ పాక్ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్‌... కాస్తంత ఘాటు వ్యాఖ్య‌లే చేశారు. ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటించారు. ఎలాంటి పరిస్థితినైనా ఢీకొట్టేందుకు, ఎదురు నిలిచేందుకు తమ దేశ సైన్యం సిద్ధంగా ఉందంటూ మంగళవారం నవాజ్‌ షరీఫ్‌ వ్యాఖ్యానించారు. ఈ రోజుల్లో యుద్ధం పెద్ద దూరంలో ఏమీ లేదంటూ వ్యాఖ్యానించారు. కులభూషణ్‌కు ఉరిశిక్ష విధించడంపై భారత్‌ హెచ్చరికలు పంపించిన కొద్ది సేపటికే షరీఫ్‌ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

‘పాకిస్థాన్‌ ప్రేమపూర్వక శాంతియుత దేశం. దీనిని ఎవరూ బలహీనతగా చూడొద్దు. విభేదాలకన్నా సహకారంతో ఉండటం, సంశయించడం కంటే శ్రేయస్సును పంచుకోవడమే మా దేశం విధానం. స్నేహం విస్తరించుకునే విషయాన్ని మేం ఎప్పుడూ కాదనం’ అంటూ ఆయ‌న వ్యాఖ్యానించారు. ష‌రీఫ్ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ఇరు దేశాల మ‌ధ్య మ‌రోమారు ఉద్రిక్త పరిస్థితులు నెల‌కొన్న‌ట్లుగానే క‌నిపిస్తోంది. భార‌త్‌తో యుద్ధానికి కూడా తాము సిద్ధంగానే ఉన్నామ‌ని ప్ర‌క‌టించిన ష‌రీఫ్‌... ఒక్క భార‌త్‌నే కాకుండా ప్ర‌పంచ దేశాల‌ను కూడా నివ్వెర‌ప‌రచార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. త‌మ‌ది స్నేహ‌పూర్వ‌క దేశ‌మంటూనే... త‌మ‌ను బ‌ల‌హీనులుగా ప‌రిగ‌ణిస్తే మాత్రం స‌హించేది లేదంటూ ఆయ‌న ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా ప‌రిస్థితి చూస్తే... ఇరు దేశాల మ‌ధ్య యుద్ధ మేఘాలు అల‌ముకున్న‌ట్లుగానే ఉంద‌న్న వాద‌న వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/