Begin typing your search above and press return to search.

ఇమ్రాన్ యార్కర్.. సుప్రీం బౌన్సర్.. క్రికెట్ మ్యాచ్ కు తగ్గని పాక్ రాజకీయాలు..

By:  Tupaki Desk   |   8 April 2022 9:32 AM GMT
ఇమ్రాన్ యార్కర్.. సుప్రీం బౌన్సర్.. క్రికెట్ మ్యాచ్ కు తగ్గని పాక్ రాజకీయాలు..
X
అప్రజాస్వామిక పాకిస్థాన్ లో రాజకీయాలు క్రికెట్ మ్యాచ్ ను తలపిస్తున్నాయి. ప్రధాన మంత్రి వికెట్ తీయాలని ప్రతిపక్షాలు తీవ్రంగా ప్రయత్నిస్తుంటే.. ప్రధానమంత్రేమో వారికే కౌంటర్ యార్కర్లు వేస్తూ మ్యాచ్ ను రసవత్తరంగా మార్చేస్తున్నారు. చివరకు అలసిపోయిన వికెట్ పడిపోయే పరిస్థితుల్లో ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ రివర్స్ స్వింగ్ అస్త్రం బయటకు తీశారు.

తాను క్రికెట్ ఆడే రోజుల్లో రివర్స్ స్వింగ్ కింగ్ గా పేరొందిన ఇమ్రాన్ ఇప్పుడు మళ్లీ ఆ ఆయుధాన్ని బయటకు తీశారు. ఈ నెల 3న జాతీయ అసెంబ్లీలో విశ్వాస పరీక్షను, జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తూ డిప్యూటీ స్పీకర్ ఖాసీం సూరి తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్థాన్ సుప్రీం కోర్టు గురువారం కొట్టివేసింది. దీంతో అధికార మ్యాచ్ మళ్లీ ఉత్కంఠగా మారింది.

జాతీయ అసెంబ్లీని పునరుద్ధరిస్తున్నట్లుగా ప్రకటించడంతో మళ్లీ రీ మ్యాచ్ ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే.. ఇమ్రాన్ మళ్లీ ప్రతిపక్షాల బౌన్సర్లను ఎదుర్కొనక తప్పదు. అదే జరిగితే.. ఆయనకు ఛేదించలేని పెద్ద టార్గెట్ విధించినట్లే. అంటే.. తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయాల్సిన క్లిష్ట కాలం.

నాడు అక్రమ్.. నేడు సూరి ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ కెప్టెన్ గా ఉన్న రోజుల్లో ఆ జట్టు పేస్ బౌలింగ్ భలే ముచ్చటేసేది. కుడిచేతి వాటం ఇమ్రాన్ కు ఎడమ చేతి వాటం పదునైన పేసర్ వసీం అక్రమ్ జత కలవడంతో వారిని ఎదుర్కొనడం ప్రత్యర్థులకు కష్టమయ్యేది. అలా నాడు అక్రమ్ ను డిప్యూటీగా ఎంచుకుని పాకిస్థాన్ ను విజేతగా నిలిపిన ఇమ్రాన్.. నేడు డిప్యూటీ స్పీకర్‌ ఖాసీం సూరి తోడుగా ప్రభుత్వాన్ని గెలిపించాలనుకున్నారు. అయితే, నాలుగు రోజులు తిరక్కముందే న్యాయస్థానం.. మ్యాచ్ ఫలితాన్ని నిలిపివేసి షాకిచ్చింది. శనివారం ఉదయం 10.00 గంటలకు జాతీయ అసెంబ్లీని సమావేశపరచి, ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానంపై ఓటింగు నిర్వహించాలంటూ స్పీకర్‌ను ఆదేశించింది.

భారత్ ప్రేక్షకుడే..ఇమ్రాన్ ఖాన్ యార్కర్లు వేస్తే సుప్రీం బౌన్సర్లతో బెంబేలెత్తిస్తున్న పాకిస్థాన్ మ్యాచ్ లో భారత్ ఒక సాధారణ ప్రేక్షుడిలా చూస్తూ ఉండిపోనుంది. అక్కడి పరిణామాల్లో నేరుగా పాల్గొనేది లేదంటూ ప్రకటించింది. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ మీడియాతో మాట్లాడుతూ.. 'ఇస్లామాబాద్‌లో ఏం జరుగుతోందో ఓ కంట గమనిస్తున్నాం. అయినా ఇది వాళ్ల అంతర్గత వ్యవహారం'అని అన్నారు.

ఇంతకూ స్కోరెంత?342.. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో సభ్యుల సంఖ్య ఇది. సాధారణ మెజారిటీ 172 మంది కావాలి. కానీ 2018 ఎన్నికల్లో ఇమ్రాన్ పార్టీ 149 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. టెయిలెండర్ల లాంటి చిన్నాచితక పార్టీలతో కలిసి ఇమ్రాన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి లీగ్ మ్యాచ్ ను గెలిపించారు. అయితే, కీలకమైన నాకౌట్ దశకు వచ్చేసరికి టెయిలెండర్లు హ్యాండిచ్చారు. దీంతో జట్టును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఇమ్రాన్ పై పడింది. చూద్దాం.. రేపు ఏం జరుగుద్దో..? సుప్రీం కోర్టు బౌన్సర్ కు ఇమ్రాన్ సర్కారు కుప్పకూలుతుందా? లేదా ముక్కి మూలుగుతూ గట్టెక్కుతుందా?