Begin typing your search above and press return to search.

ఆ ఒప్పందంపై ఇమ్రాన్ ను తలంటిన పాక్ సుప్రీంకోర్టు

By:  Tupaki Desk   |   11 Nov 2021 5:30 AM GMT
ఆ ఒప్పందంపై ఇమ్రాన్ ను తలంటిన పాక్ సుప్రీంకోర్టు
X
పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. తాజాగా ఆయన పాకిస్తాన్ తాలిబన్ల పార్టీ అయిన తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్తాన్ తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం కుదుర్చుకున్న తర్వాతి రోజునే ఆయన ప్రభుత్వానికి దేశ అత్యున్నత న్యాయస్థానం నుంచి ఎదురుదెబ్బ తగలటమే కాదు.. తలంపు పోయించుకునే పరిస్థితి.

2014లో ఆర్మీ ఆధ్వర్యంలో నడిచే స్కూల్ మీద ఈ ఉగ్ర సంస్థ జరిపిన హేయమైన దాడిలో 150 మంది చిన్నారులు బలయ్యారని.. ఈ ఘటనకు సంబంధించి విచారణకు ప్రధానిగా వ్యవహరిస్తున్న ఇమ్రాన్ ఖాన్ కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

చిన్నారుల ప్రాణాల్ని బలి తీసుకున్న వారికి మీరు మోకరిల్లుతారా? మీరు అధికారంలో ఉన్నారు.. ఏం చేస్తున్నారు? ఆ దోషులతో తీరిగ్గా చర్చలు జరుపుతున్నారు అంటూ సీజే అహ్మద్ ప్రధాని ఇమ్రాన్ ను ఘాటుగా ప్రశ్నించారు. ఇదిలా ఉంటే ఈ ఉదంతం జరిగిన సమయంలో తాము అధికారంలో లేమని.. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం కింద ఆర్థిక సాయం అందించామని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు.

ప్రధాని హోదాలో ఉన్న ఇమ్రాన్ మాటలకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆయన మాటలు చిన్నారుల్ని పోగొట్టుకున్న కుటుంబాలకు.. వారి తల్లిదండ్రులకు తగిలినగాయాల మీద కారం రాసినట్లుగా ఉన్నట్లుగా తలంటింది. ఉగ్రవాద పార్టీతో ఒప్పందం కుదుర్చుకున్న పక్క రోజునే దేశ అత్యుత్తమ న్యాయస్థానం తప్పు పట్టటమే కాదు.. తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది. దీంతో.. ఇమ్రాన్ సర్కారు ఇరుకున పడినట్లైంది.