Begin typing your search above and press return to search.

హై అలెర్ట్: పంజాబ్ పొలాల్లో పాకిస్తానీ గ్రైనేడ్లు

By:  Tupaki Desk   |   21 Dec 2020 3:30 PM GMT
హై అలెర్ట్: పంజాబ్ పొలాల్లో పాకిస్తానీ గ్రైనేడ్లు
X
భారత్ లోని పంజాబ్ సరిహద్దుల్లో పాకిస్తాన్ కుట్రలకు పాల్పడుతోంది. పంజాబ్ లోని గురుదాస్పూర్ జిల్లాలో చక్రి పోస్ట్ వద్ద ఓ పొలంలో 11 గ్రేనేడ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి పాకిస్తాన్ లోని రావల్పిండిలో గల ఆయుధ ఫ్యాక్టరీలో తయారైనట్లు గుర్తించారు.

పాకిస్తాన్ సరిహద్దుకు కేవలం కిలోమీటరు దూరంలో భారత భూభాగంలో వీటిని పోలీసులు గుర్తించారు. సలాచ్ అనే గ్రామ పొలంలో ప్లాస్టిక్ పాకెట్ లో ఇవి చుట్టి ఉన్నాయి. వీటిపై ఆర్.జీ.ఎస్ అనే మార్క్ ఉందని.. పాకిస్తాన్ లో తయారైన బాంబులపై ఈ విధమైన మార్క్ లు ఉంటాయని పోలీసులు తెలిపారు.

శనివారం అర్ధరాత్రి డ్రోన్ ద్వారా ఈ గ్రెనేడ్లను జారవిడిచినట్లు పోలీసులు తెలిపారు. డ్రోన్లపై పోలీసులు కాల్పులు జరిపినప్పటికీ అవి ఎగిరిపోయాయి. నాశనం చేయలేకపోయారు. భారత్ లోని పాకిస్తాన్ ఉగ్రవాదులకు చేరవేసేందుకు ఇలా పాకిస్తాన్ డ్రోన్ల ద్వారా సరఫరా చేస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇటీవల ఇంటర్నేషనల్ నెట్ వర్క్ ద్వారా ఆయుధాలు, డ్రగ్స్ ను స్మగుల్ చేసేందుకు డ్రోన్లను ఉపయోగిస్తున్న ఇద్దరు వ్యక్తులను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఖలిస్తాన్ సంస్థతో లింక్ ఉన్న స్మగ్లర్లకు వీరికి సంబంధాలున్నట్టు తెలుస్తోంది.

సరిహద్దుల్లోని పాకిస్తాన్ ఉగ్రవాదుల కోసం ఇలా ఆయుధాలు, గ్రెనేడ్లను డ్రోన్ల ద్వారా పాకిస్తాన్ సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. ఇలా 8వ సారి జరిగిందని.. ఈ బాంబుల వెనుక పాకిస్తాన్ ఐఎస్ఐ హస్తం ఉందని భద్రతా దళాలు పేర్కొంటున్నాయి. దీంతో ఇక్కడ భద్రతను పెంచాయి.