Begin typing your search above and press return to search.

పాకిస్తాన్ ఒంట్లో భయం మొదలైంది

By:  Tupaki Desk   |   11 Jan 2016 11:49 AM GMT
పాకిస్తాన్ ఒంట్లో భయం మొదలైంది
X
పాకిస్థాన్ ప్రధానితో భారత ప్రధాని మోడీ నిన్నమొన్నటి వరకు నెరిపిన ఆత్మీయ సంబంధాలకు మనసు చలించిందో లేదంటే తాజాగా భారత్ - అమెరికాలు కలిసి చేసిన హెచ్చరికల ఫలితమో ఏమో కానీ పాకిస్థాన్ ప్రభుత్వంలో పఠాన్ కోట్ దాడి విషయంలో కదలిక వచ్చింది. భారత్ లోని పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై దాడి వెనుక ఉన్న ఉగ్రనేతలను పట్టుకోవడానికి పాక్ అధికారులు తమ దేశంలో జల్లెడ పడుతున్నారు. సోమవారం పాక్ లోని ఉగ్రవాద స్థావరాలు, ఉగ్రవాద ప్రాంతాలపై దాడులు చేశారు. కొందరు అనుమానితులను కూడా అరెస్ట్ చేసినట్లు భారత్, అమెరికా నిఘా వర్గాలకు సమాచారం అందింది.

పాకిస్థాన్ లో ఉగ్రవాదులకు బాగా పట్టున్న గుజ్రన్ వాలా - జెలుమ్ - బహవల్పూర్ జిల్లాల్లో పాక్ సైనికాధికారులు దాడులు చేసి కొందరిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. పఠాన్ కోట్ ఉగ్రదాడి ఘటనపై విచారణకు పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రత్యేకంగా ఒక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇందులో ఇంటలిజెన్స్ బ్యూరో - ఐఎస్ ఐ - మిలటరీ ఇంటలిజెన్స్ - ఫెడరల్ ఇంటలిజెన్స్ ఏజన్సీ - పోలీసులు ఉన్నారు. పఠాన్ కోట్ దాడి సూత్రధారులపై పాక్ చర్యలు తీసుకోకుంటే ఇరు దేశాల విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శుల సమావేశం జరగదని భారత్ హెచ్చరించడం... అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రి కూడా పాక్ ప్రధానితో మాట్లాడి సూత్రధారులను పట్టుకోవాలని కఠినంగా హెచ్చరించడంతో పాక్ చర్యలకు దిగిందని భావిస్తున్నారు. భారత్ తో సంబంధాలను షరీఫ్ కోరుకుంటుండడం.... అమెరికా కూడా భారత్ కు మద్దతుగా నిలుస్తుండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన సైన్యం మాటను కాదని చర్యలకు ఆదేశాలిచ్చారని తెలుస్తోంది.