Begin typing your search above and press return to search.

ఫస్ట్ టైం...ఇండియాను అప్రమత్తం చేసి పాక్

By:  Tupaki Desk   |   6 March 2016 7:31 AM GMT
ఫస్ట్ టైం...ఇండియాను అప్రమత్తం చేసి పాక్
X
ఇండియాలో ఉగ్రవాదులు చొరబడ్డారంటూ పాకిస్థాన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్ నుంచి భారత్ కు వర్తమానం అందింది. చరిత్రలో ఇంతవరకు లేనట్లుగా తొలిసారి ఉగ్రవాదుల విషయంలో భారత్ కు పాకిస్థాన్ అప్రమత్తం చేయడం విశేషం. ఇండియాపై దాడులు చేయడమే లక్ష్యంగా 10 మంది ఉగ్రవాదులు గుజరాత్ లో చొరబడ్డారంటూ పాక్ ఎన్ ఎస్ ఏ నాజర్ ఖాన్ నుంచి ఇండియా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కు సమాచారం అందింది. సోమవారం శివరాత్రి సందర్భంగా భక్తులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వీరు దాడులు చేసే ప్రమాదం ఉందని ఇంటిలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి.

పాక్ నుంచి వచ్చిన సమాచారం నేపథ్యంలో ధోవల్ వెంటనే గుజరాత్ రాష్ట్రాన్ని అప్రమత్తం చేశారు. నేరుగా పాక్ నుంచే సమాచారం అందడంతో వెంటనే గుజరాత్ అంతా అప్రమత్తమయ్యారు. పోలీసులకు సెలవులు రద్దు చేశారు.

మరోవైపు పాక్ హెచ్చరికల అనంతరం గుజరాత్ పోలీసు వర్గాలు దర్యాప్తు చేసి ఆ సమాచారం నిజమేనని ధ్రువీకరించాయి. గుజరాత్ లోని సముద్ర తీరంలోంచి ఉగ్రవాదులు ప్రవేశించినట్లు తేల్చారు. కచ్ సమీపంలో ఓ బోటు ఖాళీ ఉండడం.... అది తమదని ఎవరూ క్లెయిమ్ చేయకపోవడంతో అందులోనే ఉగ్రవాదులు వచ్చారని అనుమానిస్తున్నారు. ఆదివారం గుజరాత్ అంతటా తనిఖీలు చేస్తూ జల్లెడ పడుతున్నారు. సరైన గుర్తింపు కార్డులు లేనివారిని నిర్దాక్షిణ్యంగా అదుపులోకి తీసుకుంటుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే... భద్రతా కారణాల రీత్యా ఈ అసౌకర్యం తప్పదని పోలీసులు ప్రజలకు నచ్చజెబుతున్నారు.