Begin typing your search above and press return to search.

భారత్ పై పాక్ కుట్ర.. చైనాకు మద్దతుగా 20వేల పాక్ సైనికులు!

By:  Tupaki Desk   |   2 July 2020 6:30 PM GMT
భారత్ పై పాక్ కుట్ర.. చైనాకు మద్దతుగా 20వేల పాక్ సైనికులు!
X
చైనాతో సరిహద్దుల్లో వివాదం చెలరేగుతున్న వేళ పాకిస్తాన్ భారీ కుట్ర చేస్తోందా? చైనాతో భారత్ ఫైట్ ను పాకిస్తాన్ తనకు అనుకూలంగా మార్చుకుంటోందా? భారత్ ను దొంగ దెబ్బ తీసేందుకు పాక్ ప్రయత్నిస్తోందా అంటే ఔననే అంటున్నాయి నిఘా వర్గాలు..

తూర్పున చైనా.. పశ్చిమాన పాకిస్తాన్ ఆర్మీలు భారత్ సరిహద్దుల్లో మోహరించినట్టు తెలిసింది. ఇప్పటికే వాస్తవాధీన రేఖ వెంట చైనా 20వేల మంది సైనికులను మోహరించింది. చైనాకు మద్దతుగా అంతే మొత్తంలో లఢక్ పశ్చిమ భాగంలో పాకిస్తాన్ గిల్గిత్ బల్టిస్తాన్ లో 20వేల సైనికులను మోహరించింది.

ఇక పాక్ ఆక్రమిత కశ్మీర్ లో భారీగా సైనిక బలగాలను పాకిస్తాన్ తరలిస్తోంది. ఈ మేరకు భారత నిఘా వర్గాలు గుర్తించాయి. మరో వైపు కశ్మీర్ లో పెద్ద ఎత్తున హింసకు పాక్ ఉగ్రవాదులకు చైనా సూచించినట్టు భారత గూఢచారులు కనిపెట్టారు. గల్వాన్ ఘర్షణ తర్వాత పాకిస్తాన్, చైనా అధికారుల మధ్య సంప్రదింపులు పెరిగాయని సమాచారం.

ఇక ఎల్ఏసీ వెంట చైనా 20వేల సైనికులను మోహరించగా..దానికి సమీపంలోని జిన్ జియాంగ్ లో భారీగా ఆయుధాలు నిల్వచేశారని తెలిసింది. తాజాగా మరో 12వేల మంది సైనికులను మోహరించారని తెలిసింది. సైనికులను వేగంగా తరలించేందుకు అక్కడ వాహనాలు ఉన్నట్టు రక్షణ వర్గాలు గుర్తించాయి. టిబెట్ రీజియన్ లోనూ చైనా సైన్యాన్ని పెంచింది. భారత్ కూడా సైన్యాన్ని పెంచింది. దీంతో చైనా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. అటు పాకిస్తాన్.. ఇటు చైనాతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది.