Begin typing your search above and press return to search.

ఆర్మీ క్యాప్ లతో క్రికెటా.. పాక్ ఫిర్యాదు..

By:  Tupaki Desk   |   9 March 2019 8:39 AM GMT
ఆర్మీ క్యాప్ లతో క్రికెటా.. పాక్ ఫిర్యాదు..
X
పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన భారత జవాన్లకు టీమిండియా శుక్రవారం ఘన నివాళి అర్పించింది. వారి మరణానికి సంతాపంగా భారత క్రికెటర్లు శుక్రవారం ఆస్ట్రేలియాతో మూడో వన్డే సందర్భంగా ఆర్మీ క్యాప్ లు ధరించి మ్యాచ్ ఆడారు.

ఈ మ్యాచ్ కు భారత ఆర్మీలో టెరిటోరియల్ ఆర్మీ గౌరవ లెఫ్ట్ నెంట్ కల్నల్ హోదాలో ఉన్న మహేంద్ర సింగ్ ధోని తన సహచరులకు మ్యాచ్ కు ముందు బీసీసీఐ లోగోలతో ఉన్న ప్రత్యేక క్యాప్ లను అందించాడు. దీంతో కోహ్లీ సేన వీటిని ధరించే మ్యాచ్ మొత్తం ఆడేసింది. అంతేకాదు.. మూడో వన్డే సందర్భంగా తమకు దక్కిన మ్యాచ్ ఫీజును ఆటగాళ్లందరూ జాతీయ రక్షణ నిధికి విరాళంగా ఇస్తున్నట్టు టీమిండియా కెప్టెన్ కోహ్లీ తెలిపాడు.

భారత క్రికెట్లు ఆర్మీ క్యాపులు ధరించి క్రికెట్ ఆడటాన్ని పాకిస్తాన్ వ్యతిరేకించింది. పాక్ సమాచార శాఖ మంత్రి ఫావద్ చౌదరీ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. బీసీసీఐపై చర్యలు తీసుకునేందుకు పోరాటం చేయాలని పాక్ క్రికెట్ బోర్డును కోరారు. ‘భారత్ క్రికెట్ ను రాజకీయం చేస్తోంది. బీసీసీఐపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చర్యలు తీసుకోవాలి. టీమిండియా ఆటగాళ్లు ఆర్మీ క్యాప్ లు ధరించిన అంశాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి ఫిర్యాదు చేయాలని’’ ఫావద్ చౌదరి ఆదేశించారు.

ఇలా పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన జవాన్లకు భారత క్రికెటర్లు ఘననివాళి అర్పించగా పాకిస్తాన్ మాత్రం దీన్ని కూడా వివాదాస్పద అంశంగా మార్చి రచ్చచేస్తోంది.