Begin typing your search above and press return to search.

మీడియాకు నో అనటం మామూలేనట

By:  Tupaki Desk   |   5 Aug 2016 4:56 AM GMT
మీడియాకు నో అనటం మామూలేనట
X
సార్క్ దేశాల హోం మంత్రుల సమావేశం సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. దాయాది గడ్డ మీద జరిగిన ఈ సదస్సుకు కేంద్ర హోం మంత్రిరాజ్ నాథ్ హాజరు కావటం తెలిసిందే. తన తాజాపర్యటనలో పాక్ తో అంటీ ముట్టనట్లుగా వ్యవహరించటమే కాదు.. పాక్ హోం మంత్రికి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు సైతం రాజ్ నాథ్ ఇష్టపడకపోవటం గమనార్హం. ఇక.. సార్క్ ప్రతినిధులు అతిధ్య దేశ ప్రధానిని గౌరవంగా కలిసే అంశాన్ని ప్రోటోకాల్ అంశంగా మార్చి.. ఆయన్ను కలిశామంటే కలిసామన్నట్లుగా వ్యవహరించేశారు రాజ్ నాథ్.

ఇక.. రాజ్ నాథ్ ప్రసంగించే సమయంలో భారత్ తో పాటు.. అంతర్జాతీయ మీడియాను అనుమతించకపోవటం.. ఆయన ప్రసంగాన్ని పాక్ టీవీలు టెలికాస్ట్ చేయకపోవటం వివాదంగా మారింది. దీనిపై విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించినట్లు చెబుతున్నా.. తాజాగా భారత్ స్పందించిన తీరు ఆసక్తికరంగా మారింది. అందరూ తప్పు జరిగినట్లుగా వేలెత్తి చూపించిన మీడియాకు నో అంశాన్ని భారత్ సమర్థిస్తూ ప్రకటనను విడుదల చేయటం గమనార్హం.
హోంమంత్రి ప్రసంగాన్ని మీడియాలో ప్రసారం కానివ్వలేదన్న అంశంపై స్సందించిన భారత్.. సార్క్ సంప్రదాయం ప్రకారం.. అతిధ్య దేశం ఇచ్చే ప్రారంభ ప్రకటనను మాత్రమే మీడియాలో ప్రసారం చేస్తారని.. మిగిలిన చర్చలు.. ప్రసంగాలను ప్రసారం చేసేందుకు మీడియాకు అనుమతి ఇవ్వకపోవటం సాధారణ అంశంగా పేర్కొనటం గమనార్హం. మరీ ప్రకటననే ప్రాతిపదికగా తీసుకుంటే.. తమను అనుమతించని పాక్ అధికారులతో భారత మీడియా ప్రతినిధులు వాదులాట పెట్టుకోవటంలో అర్థం లేదని చెప్పాలి.

మీడియాకు అనుమతి నో అన్నది సాధారణమే అయిన పక్షంలో.. ఆ విషయాన్ని భారత మీడియా ప్రతినిధులకు భారత ప్రభుత్వం తరఫున ముందుగానే సమాచారం అందించి ఉంటే సరిపోయేది కదా? అలాంటిదేమీ లేకుండా.. ఏదో తప్పు జరిగిపోయినట్లుగా హడావుడి చేయటంలో అర్థం లేదనే చెప్పాలి. ఇక.. దాయాది గడ్డ మీద జరిగిన సార్క్ హోంమంత్రుల సదస్సులో రాజ్ నాథ్.. పాక్ తీరును తీవ్రంగా తప్పు పట్టారు. తీవ్రవాదం మీద మాటలు ఆపి చేతలు చూపించాలని.. ఉగ్రవాదంలో మంచి.. చెడు అన్నవి ఉండవని.. ఉగ్రవాద కార్యకలాపాలు ఏ మాత్రం సరికావన్న విషయాన్ని విస్పష్టంగా రాజ్ నాథ్ చెప్పటం గమనార్హం. కశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాకు పాల్పడుతున్న బుర్హాన్ వానిని భారత దళాలు ఎన్ కౌంటర్ చేసిన నేపథ్యంలో వానిని స్వాతంత్ర్య సమరయోధుడిగా పాక్ కీర్తిస్తున్న విషయాన్ని తప్పు పట్టిన రాజ్ నాథ్.. ఉగ్రవాదులను అమరవీరులుగానో.. స్వాతంత్ర్య సమరయోథులుగానో కీర్తించటం సరికాదంటూ పాక్ తీరును సార్క్ దేశాల సాక్షిగా వారి గడ్డ మీదనే రాజ్ నాథ్ తప్పు పట్టటం గమనార్హం.