Begin typing your search above and press return to search.

భార‌త్ మేలు మ‌రువంః పాక్ దంప‌తులు

By:  Tupaki Desk   |   19 July 2017 10:30 AM GMT
భార‌త్ మేలు మ‌రువంః పాక్ దంప‌తులు
X
ప్ర‌స్తుతం భార‌త్‌ - పాక్ ల మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. నిత్యం స‌రిహ‌ద్దుల్లో పాక్ క‌య్యానికి కాలు దువ్వుతూ భార‌త భూభాగంలోకి చొర‌బడేందుకు య‌త్నిస్తోంది. ప్ర‌తిరోజు కాల్పుల‌కు తెగ‌బ‌డి భార‌త సైనికులను అన్యాయంగా బ‌లి తీసుకుంటోంది. ఇటువంటి ప‌రిస్థితుల‌లో కూడా భార‌త్ త‌న ఔదార్యాన్ని చాటుకుంది. ప్రాణాపాయంలో ఉన్న పాక్ చిన్నారికి వీసా మంజూరు చేసి మాన‌వ‌త్వానికి స‌రిహ‌ద్దులు లేద‌ని చాటింది.

పాకిస్థాన్ కు చెందిన కాన్వాల్‌ సిద్ధిక్‌ కుమారుడు రోహాన్‌ గుండెకు చిల్లుపడిందని అక్క‌డి వైద్యులు తెలిపారు. ఆప‌రేష‌న్ చేస్తే కానీ బ్రతకడన్నారు. దీంతో తమ బిడ్డ ప్రాణాలు కాపాడుకోవడానికి ఇతర దేశాలకు వెళ్లాలనుకున్నారు. ఈ లోపు భారత్‌ లోని వైద్యుల గురించి తెలుసుకున్న సిద్దిక్ త‌న కుమారుడికి భార‌త్ లో వైద్యం చేయించాల‌నుకున్నాడు. భారత్ కు వ‌చ్చేందుకు సిద్దిక్‌ - అత‌డి భార్య వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు.

దాయాది దేశాల మధ్య ఉన్నఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా వారికి వీసా మంజూరు కాలేదు. దీంతో, సిద్దిక్ తమ బిడ్డ పరిస్థితిని వివ‌రిస్తూ విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కు ట్విట్టర్‌ లో సందేశం పంపాడు. ఆ ట్వీట్ కు వెంట‌నే స్పందించిన సుష్మా స్వ‌రాజ్ వారికి వీసా మంజూరు చేయించారు. వారు భార‌త్ కు వ‌చ్చేందుకు మాన‌వ‌త్వంతో అనుమ‌తినిచ్చారు.

వీసా మంజూరు కావ‌డంతో సిద్దిక్‌ తన కుమారుడిని నోయిడాలోని జైపీ హాస్పిటల్‌ లో జూన్‌ 12న చేర్పించాడు. అక్క‌డి వైద్యులు జూన్‌ 14న రోహన్‌ కు ఆపరేషన్ చేశారు. ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న ఆ చిన్నారికి పున‌ర్జ‌న్మ‌నిచ్చారు. నెలరోజుల పరీక్షల అనంతరం సిద్దిక్‌ కుటుంబం నేడు పాకిస్తాన్‌ కు ప్ర‌యాణ‌మ‌య్యారు. చ‌నిపోతాడ‌నుకున్న త‌మ బిడ్డ ప్రాణాలు కాపాడిన భార‌త్ కు, త‌మ ప్ర‌యాణానికి వీసా మంజూరు చేసిన సుష్మా స్వ‌రాజ్ కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. భార‌త్ చేసిన మేలును మ‌రువబోమ‌ని చెప్పారు.