Begin typing your search above and press return to search.

పాక్‌ లో భ‌యం...అత్య‌వ‌స‌ర స‌మావేశం

By:  Tupaki Desk   |   26 Feb 2019 8:19 AM GMT
పాక్‌ లో భ‌యం...అత్య‌వ‌స‌ర స‌మావేశం
X
పుల్వామా దాడికి ప్ర‌తీకారంగా పాక్‌ పై భారత్ జ‌రిపిన‌ దాడిలో దాదాపు 300 మందికి పైగా ఉగ్రవాదులు హతమైన‌ సంగ‌తి తెలిసిందే. పాకిస్థాన్ భూభాగంలోకి 1971 యుద్ధం త‌ర్వాత భార‌త ఫైట‌ర్ జెట్లు వెళ్లడం ఇదే మొద‌టిసారి. భారత్‌ జరిపిన సర్జికల్‌ స్ట్రయిక్స్‌ ధాటికి పీవోకేలో ఉన్న అతిపెద్ద జైషే ఉగ్ర శిబిరం పూర్తిగా ధ్వంసమైంది. బాలాకోట్ - చకోటి - ముజఫరబాద్‌ లోని 3 ఉగ్రశిబిరాలు కూడా నేలమట్టం అయ్యాయి. నిన్న అర్ధరాత్రి భారత సరిహద్దుల నుంచీ బయలుదేరిన 12 యుద్ధ విమానాలు - డ్రోన్లు అకస్మాత్తుగా మెరుపు దాడులు చేయడంతో సరిహద్దుల్లో ఉగ్రవాద శిబిరాలు సర్వనాశనం అయ్యాయి. ఆ శిబిరాల్లో ఉగ్రవాదులు ఉండి ఉంటే... వాళ్లు తప్పించుకునే అవకాశమే లేనంతగా భీకర దాడులు జరిగాయి.

ఇలాంటి భారీ దాడి జ‌రిగిన నేప‌థ్యంలో బాలాకోట్‌ లో జైషే మహమ్మద్‌ ఉగ్రవాద శిబిరాలపై భారత్‌ మెరుపుదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ .. ఇస్లామాబాద్‌ లో అత్యవసర భేటీ ఏర్పాటు చేశారు. సీనియర్‌ రాయబారులు - విదేశాంగ శాఖ మాజీ రాయబారులను ఈ భేటీని ఆహ్వానించారు. భారత్‌ వైమానికి దాడి నేపథ్యంలో ఇవాళ ఉదయమే పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహ్ముద్ ఖురేషి అప్రమత్తమయ్యారు. అధికారులతో సమావేశమై ఎప్పటికప్పుడు పరిస్థితిని ప్రధానికి చేరవేశారు. ఈ దాడి ఘటనతో పాక్‌ పౌరులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. మరోవైపు.. భారత్‌-పాక్‌ ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇమ్రాన్‌ ఖాన్‌ తన జపాన్ పర్యటనను వాయిదా వేసుకున్నట్లు పాక్‌ ప్రధాన వార్తా పత్రిక డాన్ వెల్లడించింది.

ఇదిలాఉండంగా, ఉగ్ర‌స్థావ‌రాల‌పై భార‌త వైమానిక ద‌ళం చేసిన దాడిపై ఇవాళ విదేశాంగ శాఖ కార్య‌ద‌ర్శి విజ‌య్ గోఖ‌లే మాట్లాడారు. బాల్ కోట్‌ లో జైషే ఉగ్ర‌వాద సంస్థ‌కు చెందిన అతిపెద్ద స్థావ‌రంపై దాడి జ‌రిగిన‌ట్లు ఆయ‌న ద్రువీక‌రించారు. వైమానిక ద‌ళం చేసిన దాడిలో.. జైషే సంస్థకు చెందిన ఉగ్ర‌వాదులు - ట్రైన‌ర్లు - సీనియ‌ర్ క‌మాండ‌ర్లు - జిహాదీలు హ‌త‌మైన‌ట్లు ఆయ‌న తెలిపారు. పుల్వామా దాడి త‌ర్వాత జైష్ మ‌హ్మ‌ద్ సంస్థ మ‌రో దాడికి ప‌న్నాగం వేసిన‌ట్లు తెలిసింద‌ని - దేశంలోని మ‌రికొన్ని చోట్ల సూసైడ్ దాడుల‌కు పాల్ప‌డేందుకు ప్లాన్ వేశారు. దీని కోసం ఫిదాయిన్ జిహాదీలు కూడా త‌యారైన‌ట్లు ఆయ‌న చెప్పారు. అయితే వైమానిక దాడిలో వాళ్లంతా హ‌త‌మైన‌ట్లు విజ‌య్ గోఖ‌లే చెప్పారు. బాల్ కోట్‌ లోని జైషే క్యాంపును మౌలానా యూసుఫ్ అజ‌ర్ అలియాస్ ఉస్తాద్ ఘౌరి నిర్వ‌హిస్తున్నాడు. జైషే చీఫ్ మ‌సూద్ అజ‌ర్‌ కు బావ‌మ‌రిదే ఉస్తాద్‌. ఉగ్ర‌వాదంపై పోరుకు భార‌త్ క‌ట్టుబ‌డి ఉంద‌ని - వైమానిక దాడితో జైషే క్యాంపును టార్గెట్ చేశామ‌ని - సాధార‌ణ పౌరుల‌కు ఎటువంటి న‌ష్టం జ‌ర‌గ‌కూడ‌ద‌న్న ఉద్దేశంతో దాడిని ప్లాన్ చేశామ‌న్నారు. కాగా, పాక్ ఉగ్ర శిబిరాలపై దాడి నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం అత్యవసరంగా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటన చేస్తూ సాయంత్రం 5గంటలకు సమావేశం జరుగుతుందని తెలిపారు.