Begin typing your search above and press return to search.

పాక్ తీరు మారలేదు..రాష్ట్రపతి ఫ్లైట్ కూ మొకాలొడ్డింది

By:  Tupaki Desk   |   8 Sep 2019 4:24 AM GMT
పాక్ తీరు మారలేదు..రాష్ట్రపతి ఫ్లైట్ కూ మొకాలొడ్డింది
X
దాయాదీ దేశం పాకిస్థాన్ తనదైన వక్రబుద్ధిని మరోమారు చూపించుకుందనే చెప్పాలి. ఇప్పటికే తనది కాని ప్రదేశంపై హక్కులున్నాయంటూ తనదైన శైలి వాదనలు వినిపిస్తున్న పాక్... తాజాగా భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రయాణించే విమానాన్ని తన గగనతలం మీదుగా అనుమతించకుండా తనదైన శైలి వైచిత్రిని బయటపెట్టుకుంది. రామ్‌నాథ్ కోవింద్ విదేశీ పర్యటనకు తమ గగనతలం ఉపయోగించుకునేందుకు నిరాకరించింది. రామ్‌నాథ్ కోవింద్ ప్రయాణించే విమానం పాక్ గగనతలం మీదుగా ఐస్‌ ల్యాండ్‌కు వెళ్లేందుకు అనుమతించాలంటూ భారత్ చేసిన విజ్ఞప్తిని తమ ప్రభుత్వం తోసిపుచ్చినట్టు పాక్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషి శనివారం తెలిపారు.

కశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తమ గగనతలాన్ని ఉపయోగించుకునే అవకాశం ఇవ్వరాదనే నిర్ణయానికి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆమోదం తెలిపినట్టు ఆయన చెప్పారు. ఇటీవల పుల్వామా ఉగ్రదాడి ఘటనలో 40 మంది సీఆర్‌ పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోవడం - దీనికి ప్రతిగా పాక్‌‌ లోని బాలాకోట్‌ లో జైషే మొహమ్మద్ ఉగ్రవాద శిక్షణా శిబిరాలపై భారత వాయుసేన దాడులు జరపడంతో గత ఫిబ్రవరి 26న పాక్ తమ గగనతలాన్ని పూర్తిగా మూసేసింది. అయితే, గత మార్చిలో పాక్షికంగా గగనతలాన్ని తెరిచినప్పటికీ భారతదేశ విమానాలపై మాత్రం నిషేధం అమలు చేస్తోంది.

ఈ నేపథ్యంలోనే భారత రాష్ట్రపతి హోదాలో రామ్ నాథ్ కోవింద్ విదేశీ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధం కాగా... ఆయన విమానం పాక్ గగనతలం మీదుగా వెళ్లాల్సి ఉంది. ఐస్‌ ల్యాండ్ - స్విట్జర్లాండ్ - స్లొవేనియాలో రాష్ట్రపతి కోవింద్ మూడు రోజుల పర్యటన సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఐస్ ల్యాండ్ కు వెళ్లాలంటే పాక్ గగనతలం మీదుగానే వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో రాష్ట్రపతి ఫ్లైట్ కు అనుమతించాలన్న భారత వినతిని పాక్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. ఈ నిర్ణయంతో పాక్ తన వక్రబుద్ధిని మరోమారు చాటుకుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.