Begin typing your search above and press return to search.

కశ్మీర్‌ పై పాకిస్థాన్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   14 Nov 2018 7:05 PM GMT
కశ్మీర్‌ పై పాకిస్థాన్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
X
పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది సంచలన వ్యాఖ్యలతో వార్తల్లోకి వచ్చాడు. అతను తన దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దీర్ఘ కాలంగా నానుతున్న కశ్మీర్ సమస్యపై అతను ఆశ్చర్యకర రీతిలో స్పందించాడు. తమ దేశానికి కశ్మీర్ అవసరం లేదన్నాడు. ఉన్న రాష్ట్రాలనే పాకిస్థాన్ సరిగా పరిపాలించడం లేదని.. అలాంటపుడు కశ్మీర్ ఎందుకని అతను ప్రశ్నించడం విశేషం. అదే సమయంలో కశ్మీర్ ను భారత్ లో కూడా కలపాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించడం ద్వారా స్వదేశంలో మరీ తీవ్ర వ్యతిరేకత రాకుండా చూసుకున్నాడతను. కశ్మీర్‌ ను స్వతంత్ర దేశంగా ప్రకటించాలని అఫ్రిది డిమాండ్‌ చేశాడు.

కశ్మీర్ లోయలో అమాయక ప్రజలు చనిపోతున్నారని.. మానవత్వంతో ఆలోచించి ఇరు దేశాలు నిర్ణయం తీసుకోవాలని అతను విన్నవించాడు. బ్రిటిష్ పార్లమెంటులో విద్యార్థులతో మాట్లాడుతూ ఆఫ్రిది ఈ వ్యాఖ్యలు చేశాడు. ఉగ్రవాదుల నుంచి దేశాన్ని సురక్షితంగా ఉంచడం తమ ప్రభుత్వాలకు చేత కాలేదని అఫ్రిది విమర్శించడం విశేషం. పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రధానిగా ఉండగా అఫ్రిది ఇలా మాట్లాడటం చర్చనీయాంశమవుతోంది. అఫ్రిది గతంలో కూడా భారత్‌ ఆక్రమించిన కశ్మీర్‌లో పరిస్థితి దారుణంగా ఉందంటూ వ్యాఖ్యానించాడు. అప్పుడు భారతీయులు అతడిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈసారి అతను కొంచెం సమతూకంతో మాట్లాడాడు. దీనిపై పాకిస్థాన్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.