Begin typing your search above and press return to search.

దిగజారిన పాక్ ఆర్థిక పరిస్థితి.. ప్లాస్టిక్ కవర్లలో వంట గ్యాస్ నిల్వ..!

By:  Tupaki Desk   |   3 Jan 2023 3:33 AM GMT
దిగజారిన పాక్ ఆర్థిక పరిస్థితి.. ప్లాస్టిక్ కవర్లలో వంట గ్యాస్ నిల్వ..!
X
ఉగ్రవాదం కబంధ హస్తాల్లో ఇరుక్కున్న పాకిస్తాన్ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతుంది. పాక్ లో అస్థిర ప్రభుత్వ పాలనకు తోడు కరోనా ఎంట్రీ తర్వాత పరిస్థితి అధ్వానంగా మారింది. అయితే కరోనా కేసులు పాక్ లో తగ్గుముఖం పట్టినప్పటికీ ద్రవ్యోల్భణం పెరిగిపోవడంతో ప్రజలంతా నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్లో పరిస్థితులు చూస్తుంటే శ్రీలంక బాటలోనే ఆ దేశం నడుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

శ్రీలంకలో రాజకీయ సంక్షోభం.. వ్యవసాయ రంగం దెబ్బతినడం.. కరోనా ఎఫెక్ట్ తో ఆ దేశం దివాళా తీసిన సంగతి తెల్సిందే. నిత్యావసర వస్తువులు.. పెట్రోల్.. డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటడంతో అక్కడి ప్రజలంతా అవస్థలు పడ్డారు. ఈక్రమంలోనే ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేయడంతో ఆ దేశ అధ్యక్షుడు ప్రజలకు భయపడి విదేశాల్లో తలదాచుకున్నాడు. ప్రజల ఆగ్రహావేశాల నడుమే ఆ దేశంలో కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరిగిన విషయం తెల్సిందే.

ఈ బాటలోనే పాక్ నడుస్తుందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. పాకిస్తాన్లో ద్రవ్యోల్భణం ఊహించని స్థాయిలో పెరిగిపోయింది. దీనికితోడు పాక్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే సబ్సిడీపై అందించే నిత్యావసర వస్తువుల్లో కోత పెట్టింది. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటడంతో ప్రజలకు ప్రభుత్వం సైతం మౌలిక సదుపాయాలు అందించడంలో విఫలమైందని అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నారు.

ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లోనూ ప్రభుత్వం కోత విధిస్తోంది. పెరుగుతున్న ధరల భారాన్ని తగ్గించుకునేందుకు అక్కడి ప్రజలు వంట గ్యాస్ ను ప్లాస్టిక్ కవర్లలో నిల్వ చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పాక్ లోని అనేక ప్రాంతాల్లో వంట గ్యాస్ కొరత తీవ్రంగా నెలకొంది.ముఖ్యంగా ఖైబర్ ఫఖ్తూంఖ్వాలో పరిస్థితి దారుణంగా ఉండటంతో ప్రజలు వంట గ్యాస్ ను ప్లాస్టిక్ కవర్లలో నిల్వ చేసుకుంటున్నారు.

భారీ సైజులో ఉన్న తెల్లటి ప్లాస్టిక్ బ్యాగుల్లో వంట గ్యాస్ ను నింపుతున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్లాస్టిక్ బ్యాగులపై ప్రభుత్వం నిషేధం విధించినట్లు స్థానిక మీడియా పేర్కొంటుంది. కాగా గత రెండేళ్లుగా ఖైబర్ ఫఖ్తూంఖ్వాలోని ప్రజలు వంట గ్యాస్ కు దూరంగా ఉంటూ గ్యాస్ కనెక్షన్ లేకుండానే జీవిస్తున్నారని సమాచారం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.