Begin typing your search above and press return to search.

ఎన్ని చెప్పినా ఎలక్షన్‌ పెట్టేసిన దాయాది

By:  Tupaki Desk   |   9 Jun 2015 4:25 AM GMT
ఎన్ని చెప్పినా ఎలక్షన్‌ పెట్టేసిన దాయాది
X
మోడీ కానీ ప్రధానమంత్రి కావాలే కానీ.. దాయాది దేశమైన పాకిస్థాన్‌కు వణుకు పుట్టిస్తాడు.. కాంగ్రెస్‌ సర్కారు మాదిరి పరిస్థితి ఉండదు. తోక జాడిస్తే.. దాన్ని ఓ రేంజ్‌లో కట్‌ చేసి పారేస్తాడు అలాంటి చాలామాటలు చాలామంది భారతీయులు అనుకున్నారు.

మెజార్టీ భారతీయులు అనుకున్నట్లే మోడీ దేశ ప్రధాని అయ్యారు. ఏడాది పాలనను పూర్తి చేసుకున్నారు. అయితే.. మోడీ మీద పెట్టుకున్న నమ్మకాల్లో కొన్నింటి విషయాల్లో చాలా దారుణంగా దెబ్బ పడ్డాయి. అలా దెబ్బ పడిన వాటిల్లో దాయాది దేశమైన పాకిస్థాన్‌కు తగిన రీతిలో బుద్ధి చెప్పే విషయం కూడా. వివాదాస్పద ప్రాతంలో ఎన్నికలు నిర్వహించవద్దని భారత్‌ ఎన్ని రకాలుగా చెప్పి చూసినప్పటికీ.. ఆ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించే విషయంలో పాకిస్థాన్‌ వెనక్కి తగ్గలేదు.

వివాదాస్పదమైన గిల్గిట్‌.. బల్టిస్థాన్‌ ప్రాంతంలో పాకిస్థాన్‌ విజయవంతంగా ఎన్నికలు నిర్వహించింది. భారత్‌ అభ్యంతరాల్ని పక్కన పెట్టేసి మరీ ఎన్నికలు నిర్వహించి తాను అనుకున్నది అనుకున్నట్లు చేస్తానని చెప్పకనే చెప్పేసింది. ఇక్కడి 24 అసెంబ్లీ స్థానాలకు పాకిస్థాన్‌ ఎన్నికలు నిర్వహించింది. వివాదాస్పద ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించటం ఇది రెండోసారి. మోడీ లాంటి నేత దేశ ప్రధాని అయితే.. పాకిస్థాన్‌ తాట తీస్తారని.. తోక జాడిస్తే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పే మాటకు భిన్నంగా.. ఎన్నికలు తాను అనుకున్నట్లు పాకిస్థాన్‌ నిర్వహించటం ద్వారా ఇచ్చే సందేశం ఏమిటి..?