Begin typing your search above and press return to search.

ముషారఫ్ చస్తే అతడి శవానికి ఉరి వేయాలన్న సుప్రీంకోర్టు!

By:  Tupaki Desk   |   20 Dec 2019 6:16 AM GMT
ముషారఫ్ చస్తే అతడి శవానికి ఉరి వేయాలన్న సుప్రీంకోర్టు!
X
ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది పాకిస్తాన్ సుప్రీంకోర్టు అయితే.. ఎవరిని ఉద్దేశించి చేశారో తెలిస్తే మరింత అవాక్కు అవ్వాల్సిందే. ఓపక్క దారుణాతిదారుణ నేరానికి పాల్పడిన వైనం ఆధారాలతో సహా వెల్లడైనప్పటికీ గురివిందలా మాట్లాడే నిర్భయ హంతకులకు ఉరి వేసే విషయంలో మన దగ్గర కిందామీదా పడుతుంటే.. పక్కనే ఉన్నా పాక్ లో ఆ దేశ మాజీ అధ్యక్షుడు.. సైనిక పాలకుడు పర్వేజ్ ముషారఫ్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

167 పేజీల తీర్పును త్రిసభ్య ప్రత్యేక బెంచ్ తాజాగా ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. ముషారఫ్ మీద ఉన్న నేరారోపణలపై ఆరేళ్ల పాటు విచారణ జరిపిన పాక్ సుప్రీంకోర్టు తన తుది తీర్పును 2-1 తేడాతో పేర్కొంది. పాక్ మాజీ అధ్యక్షుడు కమ్ సైనిక పాలకుడ్ని ఉరిశిక్ష విధించాలన్న వరకూ ఓకే కానీ.. ఆ సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై మాత్రం అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

ముషారఫ్ ను వెతకాలని.. ఒకవేళ అతను కానీ దొరక్కుంటే అతని మృతదేహాన్ని అయినా ఈడ్చుకురావాలని పేర్కొన్నారు. అక్కడితో ఆగకుండా అతని మృతదేహాన్ని పార్లమెంటు ఎదురుగా ఉన్న డి.స్వ్కేర్ వద్దకు ఈడ్చుకురావాలని.. ప్రజలకు గుర్తుండిపోయేలా మూడు రోజుల పాటు ఆ కూడలిలోనే మృతదేహాన్ని వేలాడదీయాలని పేర్కొన్నారు.

అతనికి విధించిన మరణశిక్ష అమలయ్యే లోపు వేరే కారణాలతో మరణించినా సరే.. అతన్ని వదలొద్దు.. మూడ్రోజుల పాటు ఉరికి వేలాడతీయాలన్న వివాదాస్పద వ్యాఖ్యల్నిసుప్రీంకోర్టు చేయటం వెనుక అసలు కారణం వేరే ఉందంటున్నారు. ముషారఫ్ మీద సుప్రీంకు అంత కసి ఎందుకంటే.. ఇరవైఏళ్ల క్రితం సైనిక కుట్ర ద్వారా అధికారాన్ని చేజిక్కించుకున్న ఆయన తొలుత వేటు వేసింది సుప్రీంకోర్టు మీదనే.

అప్పట్లో ముషారఫ్ కు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపిన యువ న్యాయవాదులు.. న్యాయాధికారులే ఇప్పుడు సుప్రీంకోర్టుకు నాయకత్వం వహిస్తున్నారు. ఈ కారణంతోనే అంత కసిగా తీర్పు ఇచ్చారన్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే పాక్ సుప్రీంకోర్టు తనకు దేశద్రోహం కేసులో మరణశిక్ష విధించటాన్ని ద్వేషంతో చేసిన పనిగా ముషారఫ్ అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతం దుబాయ్ లో ఉంటున్న ఆయన.. తనకూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆసిఫ్ సయిద్ ఖోసాకు మధ్య ఉన్న వ్యక్తిగత వైరమే మరణశిక్ష విధించారంటున్నారు. తీర్పు సంచలనమైంది. మరి.. దాని అమలు ఎలా ఉంటుందో కాలమే తేల్చాలి.