Begin typing your search above and press return to search.
మన ఆర్మీపై దాడి కోసమే..పాక్ కొత్త తీవ్రవాద సంస్థ
By: Tupaki Desk | 5 Oct 2017 4:59 PM GMTఅంతర్జాతీయంగా ఎన్ని విమర్శలు వచ్చినా - ప్రపంచ దేశాలు ఏకాకిగా మార్చినా దాయాది దేశం పాకిస్తాన్ బుద్ధి మాత్రం మారడం లేదు. మనదేశంతో ఒక పక్క కయ్యానికి కాలుదుద్వుతూనే...మరోపక్క కుట్రలు చేస్తోంది. అయితే తాజాగా తన కుట్రల ఎపిసోడ్ లో కొత్త కోణాన్ని తెరమీదకు తీసుకువచ్చింది. హలాల్ దాస్తా పేరుతో ఇండియాపై దాడి కోసం పాకిస్థాన్ కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ ఐ) కొత్త ఉగ్రవాద సంస్థ ప్రారంభించింది. సరిహద్దులోని పాక్ ఆర్మీకి చెందిన బోర్డర్ యాక్షన టీమ్(బ్యాట్)తో కలిసి ఈ హలాల్ దాస్తా పనిచేయనుంది. నియంత్రణ రేఖ వెంబడి దాడులు చేయడమే వీళ్ల పని.
హలాల్ దాస్తా అర్థం కిల్లర్ స్కాడ్.లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు ఇందులో సభ్యులుగా ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. సురాన్ కోట్ - పూంచ్ జిల్లాల్లో దాడులు చేయడం, ఇండియన్ ఆర్మీ జవాన్లను గాయపరచడమే లక్ష్యంగా వీళ్లు పనిచేయనున్నారు. ఈ దాడులకు సంబంధించిన బ్లూప్రింట్ పై లష్కరే తోయిబా - హిజ్బుల్ ముజాహిదీన్ లతో కలిసి ఇప్పటికే ఐఎస్ ఐ చర్చించినట్లు భారత ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ఈ మీటింగ్ లో జైషే మొహమ్మద్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ కూడా ఉన్నట్లు తెలిపాయి. గతవారం బ్యాట్ కు చెందిన 8 మంది సభ్యులు జమ్ముకశ్మీర్ లోని కుప్వారాలోకి చొరబడటానికి ప్రయత్నించగా.. ఇండియన్ ఆర్మీ వాళ్లను అడ్డుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడీ కొత్త సంస్థను ప్రత్యేకంగా ఇండియన్ ఆర్మీకి నష్టం కలిగించడానికే ఏర్పాటు చేయడం గమనార్హం.
జమ్ముకశ్మీర్ లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంట బుధవారం పాకిస్థాన్ దళాలు కాల్పులు జరిపాయి. అత్యాధునిక ఆయుధాలు - మోర్టార్ షెల్స్‌తో ఉదయం 08.45 గంటలకు దాడిచేశారు. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. దీంతోపాటు లామ్ సెక్టార్ వద్ద కూడా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు పోలీసు అధికారులు పేర్కొన్నారు. మంగళవారం పూంచ్ సెక్టార్ లో పాకిస్థాన్ సైనికులు జరిపిన కాల్పుల్లో ఓ జవాను మృతిచెందిన సంగతి తెలిసిందే.