Begin typing your search above and press return to search.

తలొగ్గిన పాకిస్తాన్.. నిషేధం ఎత్తివేత

By:  Tupaki Desk   |   16 July 2019 6:40 AM GMT
తలొగ్గిన పాకిస్తాన్.. నిషేధం ఎత్తివేత
X
జమ్మూకాశ్మీర్ లోని పుల్వామాలో భారత సైనికులపై ఉగ్రవాది దాడి తర్వాత భారత్ ఫిబ్రవరి 26న పాకిస్తాన్ పై దండెత్తి ఆ దేశంలోని బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలను వాయు విమానాలతో నేలమట్టం చేసిన సంగతి తెలిసింది. ఆ నాటి నుంచి నేటి వరకు పాకిస్తాన్ సైన్యం తన గగనతలాన్ని మూసివేయించింది. రెండు సార్లు ఈ నిషేధాన్ని ఎత్తివేయాలిన భారత్ కోరినా పెడచెవిన పెట్టింది. దీంతో పాకిస్తాన్ గుండా విదేశాలకు వెళ్లే పలు విమానయాన సంస్థలకు తీవ్ర నష్టం వాటిల్లింది.

దాదాపు 140 రోజుల పాటు పాకిస్తాన్ తమ దేశ గగనతలాన్ని మూసివేయడంతో విమానయాన సంస్థలకు 500 కోట్ల నష్టం వాటిల్లింది. తాజాగా ఒత్తిడికి తలొగ్గిన పాకిస్తాన్ మంగళవారం అర్ధరాత్రి నుంచి అన్ని రకాల ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్ ను పాకిస్తాన్ భూభాగం గుండా పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు పాకిస్తాన్ సివిల్ ఏవియేషన్ అధికారులు విమానయాన సంస్థలకు నోటీసులు జారీ చేశారు.

పాకిస్తాన్ పై దాడి తర్వాత భారత వాయు విమానాలను జమ్మూకాశ్మీర్ లోని ఎయిర్ బేస్ లలోనే మోహరించింది. దీంతో వాటిని ఖాళీ చేసే వరకు పాకిస్తాన్ గగనతలాన్ని తెరవబోమని పాకిస్తాన్ రెండు రోజుల క్రితమే స్పష్టం చేసింది. ప్రధాని నరేంద్రమోడీ గత నెలలో షాంఘైలోని బిష్కేక్ సదస్సు వెళ్లడానికి పాక్ తన గగనతలాన్ని అనుమతిచ్చినా ఆయన ఇరాన్ మీదుగా వెళ్లి హాజరయ్యారు. ఇప్పుడు పాకిస్తాన్ నిషేధం ఎత్తివేయడంతో ముఖ్యంగా ఈ మార్గం గుండా విదేశాలకు ప్రయాణించే మలేషియా, థాయ్ లాండ్, ఇండోనేషియా విమానాలకు చాలా దూరం భారం తగ్గుతోంది.