Begin typing your search above and press return to search.

పాక్ మంత్రి బ‌లుపు..భార‌త మంత్రికి సిగ్గెందుకు?

By:  Tupaki Desk   |   30 Nov 2018 11:11 AM GMT
పాక్ మంత్రి బ‌లుపు..భార‌త మంత్రికి సిగ్గెందుకు?
X
సుష్మా స్వ‌రాజ్...హుందాత‌నంతో రాజ‌కీయాలు చేసే నేత‌. భార‌తీయ జ‌న‌తా పార్టీ సీనియ‌ర్ నాయ‌కురాలు. ప్ర‌స్తుతం భారత విదేశాంగ మంత్రి కూడా. త‌న శాఖ ప‌రిధిలోకి వ‌చ్చే అంశాలు త‌న దృష్టికి ఆన్‌ లైన్ ద్వారా తీసుకు వ‌చ్చినా...నేరుగా త‌న‌తో ప్ర‌స్తావించినా ఆమె ప‌క్కాగా త‌న‌వంతు స‌హాయం చేస్తుంటారు. అలాంటి సుష్మ స్వరాజ్‌ పై నోరు పారేసుకున్నారు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషీ. ఆమె వయసును ప్రస్తావిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. త‌ద్వారా త‌మ దేశం ప్ర‌వ‌ర్తించే బ‌లుపు వంటి కార్య‌క్ర‌మాల‌ను ఆయ‌న మ‌రోమారు నిరూపించుకున్నారు.

పాకిస్థాన్ ఉగ్రవాద కార్యకలాపాలు ఆపే వరకు ఆ దేశంలో ద్వైపాక్షిక చర్చల పునరుద్ధరణ ప్రసక్తే లేదని సుష్మ స్వరాజ్ తేల్చి చెప్పిన సంగ‌తి తెలిసిందే. అనంత‌రం కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ప్ర‌క‌ట‌న‌పై స్పందిస్తూ ``ఏం జరిగిందో తెలియదు. సుష్మా ఈ వయసులో ఎందుకు సిగ్గు పడుతున్నారో నేను చెప్పలేను. బహుశా భారత రాజకీయాలను చూసి కావచ్చు`` అని ఖురేషీ అన్నట్లు ద ప్రింట్ పత్రిక వెల్లడించింది. కర్తార్‌ పూర్ కారిడార్ పనుల ప్రారంభోత్సవానికి భారత ప్రభుత్వం ఉండేలా ఇమ్రాన్‌ ఖాన్ గూగ్లీ వేశారని అంతకుముందు ఖురేషీ అన్నారు. కర్తార్‌ పూర్ కారిడార్ ప్రారంభించడం వంద రోజుల ఇమ్రాన్‌ ఖాన్ పాలన సాధించిన ఘనత అని ఖురేషీ చెప్పారు.

పాక్ పంజాబ్‌ లోని నరోవల్ జిల్లాలో కర్తార్‌ పూర్ సాహిబ్ ఉంది. ఇక్కడే సిక్కు మత వ్యవస్థాపకుడు గురు నానక్ సమాధి ఉంది. ఈ ఏడాది జరుగుతున్న గురునాన‌క్‌ 550వ జయంతి వేడుకల సందర్భంగా ఈ కారిడార్‌ ను తెరవనున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది. క‌ర్తార్‌ పుర్ కారిడార్‌ కు ఇవాళ పాకిస్థాన్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ శంకుస్థాప‌న చేశారు. సిక్కుల ప‌విత్ర స్థ‌ల‌మైన ద‌ర్బార్‌ సాహిబ్ అక్క‌డ ఉన్న‌ది. పంజాబ్‌లోని బోర్డ‌ర్‌ స‌మీపంలో ఉన్న కారిడార్ ప్రారంభోత్స‌వానికి.. భార‌త్ నుంచి కేంద్ర మంత్రి హ‌ర్‌ సిమ్ర‌త్ కౌర్‌ తో పాటు మాజీ క్రికెట‌ర్ సిద్ధూ వెళ్లారు. గురుద్వారా ద‌ర్బార్ సాహిబ్‌ కు ఇక నుంచి సిక్కులు ఎటువంటి వీసా లేకుండా వెళ్లవ‌చ్చు. పాక్‌ లోని న‌రోవాల్ జిల్లా నుంచి ఇండియాలోని గురుదాస్ పుర్ జిల్లాకు ఈ కారిడార్ ద్వారా మార్గాన్ని నిర్మిస్తారు. శంకుస్థాప‌న కార్య‌క్ర‌మానికి భారీ ఎత్తున సిక్కు యాత్రికులు కూడా వ‌చ్చారు. గురుద్వారా ద‌ర్బార్ సాహిబ్‌ కు వెళ్లి సిక్కు యాత్రికుల వీడియోను ఈ సంద‌ర్భంగా అక్క‌డ ప్లే చేశారు.