Begin typing your search above and press return to search.

పాకిస్తాన్ ను కాపాడాలంటే టీ తాగడం తగ్గించాలట..

By:  Tupaki Desk   |   16 Jun 2022 2:30 AM GMT
పాకిస్తాన్ ను కాపాడాలంటే టీ తాగడం తగ్గించాలట..
X
శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాక నెక్ట్స్ పాకిస్తాన్ అని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ దేశం ఆర్థిక సంక్షోభం ముగింట ఉందని అంటున్నారు. పాకిస్తాన్ దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రజలు తాగే ‘టీ’కి సంబంధం ఉందా? అంటే ఔననే అంటున్నాడు పాకిస్తాన్ మంత్రి. పాక్ ప్రజలు టీ తాగడం వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ కష్టాల్లో పడిందంటున్నారు. ‘దేశ ప్రజలారా తగ్గించండి.. దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడండీ ’ అంటూ మంత్రి వేడుకుంటున్నారు.

అదేంటీ ప్రజలు టీ తాగితే దేశ ఆర్థిక వ్యవస్థకు వచ్చిన నష్టమేంటి? ఆ వింత కష్టమేంటి? సాక్షాత్తూ మంత్రినే ఇలా ప్రజలను టీ తాగవద్దు అని కోరడం వెనుక అసలు విషయం ఏంటనేది హాట్ టాపిక్ గా మారింది.

సాధారణంగా చాలా మంది కాస్త ఎక్కువగా చెప్పాలంటే అందరూ ఉదయం లేవగానే కప్పు టీ తాగడం ఆనవాయితీగా వస్తోంది. అదే కప్పు టీ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందట.. కానీ ఇదే నిజమని పాకిస్తాన్ మంత్రి అంటున్నాడు.

ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న పాకిస్తాన్ కుప్పకూలకుండా ఉండడానికి తాగే టీలు తగ్గించాలని ప్రజలకు ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. ప్రజలు ప్రతీరోజూ తాగే టీ కప్పుల సంఖ్యను తగ్గించుకుంటే పాకిస్తాన్ భారీ దిగుమతుల ఖర్చులు తగ్గుతాయని పాకిస్తాన్ మంత్రి అహసాన్ ఇక్బాల్ చెప్పుకొస్తున్నారు.

పాక్ విదేశీ మారక ద్రవ్యం నిల్వలు గణనీయంగా పడిపోయాయి. ప్రస్తుతం రెండు నెలల దిగుమతులకు చెల్లించగల నిల్వలే ఉన్నాయి.దీంతో దేశానికి నిధులు అత్యవసరమయ్యాయి. ప్రపంచంలో తేయాకును మరే దేశం కన్నా అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశం పాకిస్తాన్.

గత ఏడాది 60 కోట్ల డాలర్లు అంటే సుమారు 5000 కోట్ల రూపాయలు కన్నా ఎక్కువ విలువైన టీని పాకిస్తాన్ దిగుమతి చేసుకుంది. ఈ క్రమంలోనే దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడండీ అంటూ మంత్రి విజ్ఞప్తి చేశారు. మనం తెచ్చుకున్న అప్పు మీద టీని దిగుమతి చేసుకుంటున్నాం అని మంత్రి ఇక్బాల్ దేశ ప్రజలను కోరారు.

మంత్రి విజ్ఞప్తులపై పాకిస్తాన్ ప్రజలు మండిపడుతున్నారు. ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్లే దేశంలో ధరలు విపరీతంగా పెరిగాయని.. పెరిగిన ధరలను తగ్గించకుండా టీ తాగడం తగ్గించాలనడం ఏంటని ప్రజలు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలోనూ విమర్శలు గుప్పిస్తున్నారు.