Begin typing your search above and press return to search.

పాక్ ప్రధాని ప్రయాసకి స్పందన కరువు!

By:  Tupaki Desk   |   22 Sep 2016 5:17 AM GMT
పాక్ ప్రధాని ప్రయాసకి స్పందన కరువు!
X
కశ్మీర్ సమస్య ఎలా పుట్టింది, ఎందుకు ఇంకా పాక్-భారత్ ల మధ్య అతి పెద్ద సమస్యగా ఉంది, పీఓకే లో పాక్ చేస్తున్న దురాగతాలు ఏ స్థాయిలో ఉంటున్నాయి, ఉగ్రవాదుల అక్రమ చొరబాట్లు, పాక్ సైన్యం అప్రకటిత కాల్పులు.. ఇలా చెప్పుకుంటూ పోతే కశ్మీర్ లో ఏమి జరుగుతుందో పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కి తెలియనిది కాదు. అయితే దొంగే.. దొంగా దొంగా అని అరిచినట్లు కశ్మీర్ అంశంపై ప్రపంచస్థాయి వేదికలపై కేకలేసే ప్రయత్నాలు చేస్తున్నాడు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్. ఇదే సమయంలో కశ్మీర్ అంశాన్ని ప్రపంచ సమస్యగా చూపించే ప్రయత్నం బలంగా చేస్తున్నారు. అయితే... ప్రపంచదేశాల మధ్య పాక్ అంటే ఏంటో, భారత్ కు ఉన్న స్థానమేమిటో అందరికీ తెలిసిందే కావడంతో.. షరీఫ్ కష్టానికి ఫలితం శూన్యంగానే కనిపిస్తొంది.

ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశాల్లో పాల్గొనడానికి వెళ్లిన సందర్భంగా కశ్మీరు అంశాన్ని అమెరికా, బ్రిటన్‌, జపాన్‌, టర్కీ దేశాల నాయకుల వద్ద లేవనెత్తారు పాకిస్థాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌. పనిగట్టుకుని కశ్మీరు అంశాన్ని ప్రపంచ నాయకులందరి ముందూ ప్రస్తావించారు. కశ్మీరు సమస్య పరిష్కారం కోసం జోక్యం కల్పించుకోవాలని ఆయన చేసిన విన్నపాలను ఆయా దేశాల ప్రతినిధులనుంచి ఆశించిన స్పందన రాలేదనే చెప్పాలి. ఇదే సమయంలో ఐరాస సారథి బాన్‌ కీ మూన్‌ కూడా అసలు కశ్మీరు అంశాన్నే మాటవరసకైనా ప్రస్తావించక పోవడం గమనార్హం. ఐక్య రాజ్య సమైతి సర్వప్రతినిధిసభలో చేసిన ముగింపు ప్రసంగంలో ఆయన ఎక్కడా మాటవరసకైనా కశ్మీరు వూసే ఎత్తలేదు.

ఈ సందర్భంగా పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ అనుచిత వ్యాఖ్యలు చేసి పరోక్షంగా భారత్‌ ను రెచ్చగొట్టే పనికి పూనుకున్నారు. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో మాట్లాడుతూ.. కశ్మీర్ అంశంపై స్వంతంత్ర విచారణ జరగాలని, లోయలో కర్ఫ్యూ ఎత్తేయాలని అన్నారు. కశ్మీర్‌లో భారత ఆర్మీ ఆకృత్యాలకు పాల్పడుతుందని ఆరోపించిన షరీఫ్... ఆమేరకు తనవద్ద కొన్ని ఆధారాలు ఉన్నాయని చెబుతూ, వాటిని ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్‌ కీ మూన్‌ కి అందజేస్తానన్నారు. ఈ సందర్భంగా భారత్‌ కు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు షరీఫ్ ప్రయత్నించారు.. కానీ, ఆయా దేశాల నేతల నుంచి స్పందన మాత్రం అంతంతమాత్రంగానే ఉంది!!