Begin typing your search above and press return to search.

మినీ సర్జిక‌ల్స్ స్ట్రైక్స్‌ పై పాక్ క‌వ‌రింగ్

By:  Tupaki Desk   |   30 Dec 2017 4:30 AM GMT
మినీ సర్జిక‌ల్స్ స్ట్రైక్స్‌ పై పాక్ క‌వ‌రింగ్
X
ఇటీవ‌లి కాలంలో త‌ర‌చుగా కాల్పుల విర‌మ‌ణ‌కు పాల్ప‌డుతున్న పాకిస్థాన్‌ కు బుద్ది చెప్పే రీతిలో మ‌న ఆర్మీ వ్య‌వ‌హ‌రించిన సంగ‌తి తెలిసిందే. రెండు రోజుల క్రితం పాక్ కు చెందిన 'బ్యాట్' టీమ్ - సరిహద్దులు దాటి వచ్చి నలుగురు జవాన్లను దారుణంగా చంపేసింది. దీనికి ప్రతీకారంగా భారత జవాన్లు కూడా స్ట్రైక్స్ జరిపారు. భారత భద్రతా దళాలు మినీ సర్జికల్ స్ట్రైక్స్ జరిపిన ఘటనపై పాకిస్తాన్ స్పందించింది. క‌వరింగ్ చేసుకునే మాట‌ల‌తో ప‌రువు కాపాడుకునేందుకు ప్ర‌య‌త్నించింది.

తమ జవాన్లు ముగ్గురు మరణించిన మాట వాస్తవమేనని, అయితే, అది భారత సైనికుల పని కాదని పాక్ వెల్ల‌డించింది. తమ సరిహద్దులను దాటి ఎవరూ రాలేదని పాక్ ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు పాక్ విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. రక్ చిక్రీ ప్రాంతంలో భారత దళాలు తాము రెచ్చగొట్టకుండానే కాల్పులకు దిగాయని - కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పెట్టాయని ఆరోపించింది. ఈ విషయంలో భారత డిప్యూటీ హై కమిషనర్ కు సమన్లు జారీ చేశామని పేర్కొంది. ఎల్ ఓసీ దాటి వెళ్లామని భారత ఆర్మీ తప్పుడు మాటలు చెబుతోందని ఆరోపించింది. మన దళాలు సరిహద్దులు దాటి జరిపే దాడులపై గతంలో చెప్పినట్టుగానే పాక్ ఇప్పుడూ చెప్పడం ద్వారా విషయాన్ని చిన్నదిగా చూపే ప్రయత్నం చేసిందని అంటున్నారు.

కాగా,గత ఏడాది యూరీ దాడికి ప్రతీకారంగా జరిపిన సర్జికల్ దాడుల తరహాలో భారత ఆర్మీ ఎల్వోసీ దాటి పాక్ దళాలకు బుద్దిచెప్పాయి. ఎల్వోసీలోకి ప్రవేశించి పాక్ సైనికులను హతమార్చిన భారతీయ ఆర్మీ ఆ ఆపరేషన్‌ ను లోకలైజ్డ్ టాక్టికల్ లెవల్ ఆపరేషన్‌ గా పేర్కొంది. స్థానికంగా ఆ ప్రాంతంలో ఉండే ఆర్మీ కమాండర్ ఆ ఆపరేషన్‌ ను నిర్వహిస్తాడు. అధికారుల సమాచారం ప్రకారం సుమారు పది మంది ప్రత్యేక దళానికి చెందిన భారతీయ సైనికులు లైన్ ఆఫ్ కంట్రోల్‌ ను దాటి కాల్పులు జరిపారు. సోమవారం పూంచ్ సెక్టార్ ప్రాంతంలో ఈ ఆపరేషన్ జరిగింది. ఈ కాల్పుల్లోనే ముగ్గురు పాక్ సైనికులు మృతిచెందారు. రాజౌరిలో శనివారం పాక్‌కు చెందిన బోర్డర్ యాక్షన్ టీమ్ జరిపిన దాడిలో నలుగురు భారతీయ సైనికులు మృతిచెందారు. ఆ ఘటనకు ప్రతీకారంగా ఈ దాడులు చేశారు. అయితే ఈ ఆపరేషన్‌ ను సర్జికల్ దాడిగా అధికారులు వర్ణించలేదు. కేవలం ఎంపిక చేసిన టార్గెట్‌ ను మాత్రమే నిర్వీర్యం చేసినట్లు అధికారులు చెప్పారు. చాలా స్పష్టమైన లక్ష్యాలను ఈ ఆపరేషన్ ద్వారా ఛేదిస్తారు.