Begin typing your search above and press return to search.

పాక్ హిందువులు ఎంత సంతోషంగా ఉన్నారో

By:  Tupaki Desk   |   18 Feb 2017 7:34 AM GMT
పాక్ హిందువులు ఎంత సంతోషంగా ఉన్నారో
X
పొరుగు దేశ‌మైన పాకిస్తాన్‌ తో భార‌త‌దేశం సంబంధాల విష‌యంలో ప్ర‌స్తుతం ఉద్రిక్త ప‌రిస్థితులు ఉన్న స‌మ‌యంలోనే ఆ దేశంలోని హిందువులు సంతోషంగా ఉన్నారు. ఈ సంతోషానికి గ‌ల కార‌ణం..పాకిస్తాన్‌ లో మైనార్టీల‌యిన‌ హిందువుల వివాహాలను రిజిస్టర్ చేసుకునే వీలు కల్పిస్తూ పాకిస్తాన్ పార్లమెంట్ ఓ చారిత్రక జాతీయ చట్టాన్ని ఆమోదించడ‌మే. దాదాపు పది నెలల చర్చోపచర్చల తర్వాత ఈ బిల్లును పాక్ జాతీయ అసెంబ్లీ గ‌త ఏడాది ఆమోదించింది. తాజాగా పెద్ద‌ల స‌భ కూడా ఈ బిల్లుకు ఓకే చెప్పేసింది.

పెద్ద‌ల‌స‌భ(సేనేట్‌) ఏక‌గ్రీవంగా ఆమోదించడంతో పాకిస్థాన్‌ లో ఉన్న హిందువుల‌కు ప్ర‌త్యేక వివాహ చ‌ట్టం ఇక నుంచి అధికారికంగా వ‌ర్తిస్తుంది. గ‌త ఏడాది సెప్టెంబ‌ర్ 26న ఈ బిల్లుకు జాతీయ అసెంబ్లీలో ఆమోదం ద‌క్కింది. వ‌చ్చే వారం ప్రెసిడెంట్ ఆమోదం పొందిన త‌ర్వాత ఈ బిల్లు చ‌ట్టంగా మారుతుంది. పాకిస్థాన్‌ లో ఉన్న హిందువుల‌కు ఈ కొత్త చ‌ట్టం వ‌ల్ల ర‌క్ష‌ణ పెర‌గ‌నుంది. పంజాబ్‌ - బ‌లోచిస్తాన్‌ - ఖైబ‌ర్ ప్రాంతాల్లో ఉన్న హిందువుల‌కు ఇది ఎక్కువ‌గా ఉప‌యోగ‌ప‌డ‌నుంది. న్యాయ‌శాఖ మంద్రి జాహిద్ హ‌మిద్ ఈ బిల్లును సేనేట్‌ లో ప్ర‌వేశ‌పెట్టారు. ఎటువంటి వ్య‌తిరేక‌త లేకుండానే బిల్లుకు ఆమోదం ద‌క్కింది.

కాగా, తాజా చ‌ట్టంలోని నిబంధ‌న‌ల ప్ర‌కారం హిందువుల కనీస వివాహ వయస్సును 18ఏళ్లుగా నిర్ణయించింది. మిగతా మతాలకు చెందిన వారిలో పురుషులు వివాహం చేసుకోవడానికి కనీస వయస్సు 18కాగా మహిళలకు పదహారు సంవత్సరాలు. వివాహ వయసు విషయంలో కొత్త చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై 5వేల రూపాయల జరిమానా విధించాలని నిర్ణయించింది. వివాహాలను రిజిస్టర్ చేసుకోవడం వల్ల హిందూ మహిళలకు మరింత రక్షణ లభిస్తుందని, ప్రభుత్వ పరంగా కూడా ఎన్నో హక్కులూ లభిస్తాయని పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జోహ్రా యూసఫ్ తెలిపారు. వివాహాల రిజిస్ట్రేషన్ లేకపోవడం వల్ల భర్త పోయిన వితంతువులకు ఇప్పటివరకూ ఎలాంటి ప్రభుత్వ ప్రయోజనాలు అందని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా తమకు వివాహమైందని రుజువు చేసే ఆధారాలేవీ వీరి వద్ద లేకపోవడం ఇందుకు కారణమని తెలిపారు. కొత్త చట్టం వల్ల.. భర్త పోయిన ఆర్నెల్ల తర్వాత వితంతువులకు చట్ట పరంగా పనర్వివాహం చేసుకునే అవకాశం ఉంటుందని జోహ్రా తెలిపారు. విడాకులు ఇచ్చే హక్కును కూడా ఈ చట్టం హిందువులకు కల్పిస్తోందని ముఖ్యంగా.. భర్త నిర్లక్ష్యం చేయడం, రెండో పెళ్లి చేసుకోవడం లేదా పద్దెనిమిది సంవత్సరాలు నిండక ముందే తనకు వివాహం జరిగిందన్న కారణాలపై హిందూ మహిళలు విడాకులు ఇచ్చేందుకు దీనివల్ల అవకాశం ఉంటుందని ఆమె తెలిపారు. అయితే కిడ్నాప్‌లు, బలవంతపు మతమార్పిడుల నిరోధానికి సంబంధించి హిందువులకు మరింతగా రక్షణ కల్పించాల్సి ఉంటుందని మానవ హక్కుల కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/