Begin typing your search above and press return to search.

షరీఫ్ పలుకులకు పాక్ చేతలకు పొంతనేది?

By:  Tupaki Desk   |   16 Oct 2016 6:29 AM GMT
షరీఫ్ పలుకులకు పాక్ చేతలకు పొంతనేది?
X
ఉరీ ఉగ్రదాడి - అనంతరం సర్జికల్ స్ట్రైక్ తో భారత్ పాక్ కు బలమైన షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చెంప పై అంత పెద్ద వాపు కనిపిస్తున్నా... అబ్బే భారత్ మమ్మల్ని కొట్టలేదు అని సర్ధిచేప్పుకుంటూనే ఉంది పాకిస్థాన్. వాస్తవాలు ప్రపంచం మొత్తంతో పాటు పాక్ కు తెలిసినా, చెప్పుకోలేని పరిస్థితి! అయితే తాజాగా మూడో రోజుల పర్యటనలో భాగంగా అజర్ బైజాన్ - బాకులో మాట్లాడిన నవాజ్ షరీఫ్... భారత్ తో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, కశ్మీర్ సమస్యలను పరిష్కారించాలని భారత్ కూడా భావించినట్లయితే అందుకు తమకు ఏ అభ్యంతరం లేదని తెలిపారు. ఇదే క్రమంలో నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ ఎలాంటి చొరబాట్లకూ ప్రయత్నించలేదని, కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడలేదన్నట్లు చెబుతూ ఉడీలోని భారత ఆర్మీ క్యాంపుపై జరిగిన ఉగ్రదాడి పాకిస్తాన్ పనేనన్న భారత్ ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పారు. అయితే షరీఫ్ అలా ప్రకటించుకున్నారో లేదో పాక్ ఆర్మీ మరోసారి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది.

తాజాగా మరోసారి సరిహద్దులో నౌషరా సెక్టార్‌ నియంత్రణ రేఖ వద్ద భారత దళాలపై పాక్ దళాలు ఆదివారం ఉదయం కాల్పులకు తెగబడ్డాయి. నాలుగు ఆర్మీ పోస్టులే లక్ష్యంగా ఈ కాల్పులు జరిపాయి. అయితే వెంటనే అప్రమత్తమైన భారత భద్రతా దళాలు ఈ తాటాకు చప్పుళ్లకు వెంటనే స్పందించి ధీటుగా సమాధానం ఇచ్చినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ఇదే సమయంలో నేటి ఎదురు కాల్పుల్లో ఆర్మీ జవాన్లు ఎవ్వరికీ ఏవిధమైన గాయాలు కాలేదని అధికారులు పేర్కొన్నారు. కాగా, ప్రపంచం ముందు శాంతి శాంతి అంటూ పాడటం, చర్చలకు తామెప్పుడూ సిద్ధంగానే ఉన్నామని చెప్పుకోవడం చేస్తోన్న పాక్... భారత్ పై మాత్రం చేయాల్సిన పనికిమాలిన పనులన్నీ చేస్తూనే ఉంది. అయితే ఈ విషయంపై "చర్చల శాంతి" షరీఫ్ ఏమంటారో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/