Begin typing your search above and press return to search.

కరోనా వేళ... పాక్ కొత్త పన్నాగం చూశారా?

By:  Tupaki Desk   |   22 April 2020 5:30 PM GMT
కరోనా వేళ... పాక్ కొత్త పన్నాగం చూశారా?
X
పాకిస్థాన్... ఎవరేమన్నా భారత్ పై తన ద్వేషాన్ని వదులుకోని ఓ దుష్ట దేశం. ఈ విషయం ఇరు దేశాల మధ్య చోటుచేసుకుంటున్న ఘటనలతో ఎప్పటికప్పుడు నిరూపితమవుతూనే ఉంది. అంతర్జాతీయ వేదికల మీదా భారత్ పై పాక్ తన విద్వేషాన్ని చిమ్ముతున్న వైనం కూడా మనం మరువలేం. మొత్తంగా భారత్ పై ఎప్పటికప్పుడు కొత్త పన్నాగాలతో పాక్ విరుచుకుపడేందుకు యత్నిస్తుందనే చెప్పాలి. ఈ మాట నిజమేనన్నట్లుగా కరోనా వేళ కూడా పాక్.. భారత్ పై కొత్త అస్త్రంతో విరుచుకుపడేందుకు యత్నిస్తున్న వైనం వెలుగుచూసింది. ఇందులో కరోనా వైరస్ నే అస్త్రంగా పాక్ మలచుకున్నదన్న వాదనలు నిజంగానే భయాందోళనలను రేకెత్తిస్తున్నాయి.

ఓ వైపు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలూ ప్రాణాంతక వైరస్ కరోనాతో ఇబ్బందులు పడుతుంటే.. దాయాదీ దేశం పాక్‌ మాత్రం తన వక్రబుద్దిని మరోసారి బయటపెట్టుకుంటుంది. నిత్యం మన భారతదేశంలో అలజడి సృష్టించేందుకు పాక్ ఉగ్రవాదులను ఎగదోసే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా పాక్‌లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ అవుతున్నాయి. అయితే ఈ కరోనా రోగుల్లో కొందర్ని అస్త్రాలుగా మార్చి.. వారిని మన దేశంలోకి చొప్పించే ప్రయత్నాలు చేస్తోందని తెలిసింది. జమ్ముకశ్మీర్‌ మీదుగా దేశంలోకి పంపేందుకు వ్యూహాలను రచిస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి.

అంతేకాదు.. దీనికి సంబంధించిన విషయాన్ని జమ్మూకశ్మీర్ పోలీస్ చీఫ్ డిల్బాగ్‌ సింగ్‌ కూడా దాదాపుగా నిర్ధారించేశారు. ఇప్పటివరకు పాక్‌ ఉగ్రవాదులను ఆయుధంగా చేసుకోవడమే మనకు తెలుసని.. ఇప్పుడు కరోనా పాజిటివ్ రోగులను కూడా ఆయుధంగా మార్చి భారత్ లోకి చొప్పించేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ కుట్రలను ఎప్పటికప్పటికి తిప్పికొడుతున్నామని.. అయినప్పటికీ ఇప్పుడు కరోనా రోగులనే ఆయుధాలుగా మలచుకున్న పాక్ వైఖరి ఆందోళన కలిగించేదేనని ఆయన పేర్కొన్నారు.