Begin typing your search above and press return to search.

అమెరికా కూల్ అయ్యే మాట చెబుతున్న పాక్

By:  Tupaki Desk   |   5 March 2019 4:26 AM GMT
అమెరికా కూల్ అయ్యే మాట చెబుతున్న పాక్
X
మీరు ఒక షాపులో ఏదైనా వ‌స్తువు కొన్నారు. దాన్ని వాడే క్ర‌మంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పుడు మీరు షాపు వాడిని తిడ‌తారా? లేక‌.. షాపు వాడే.. మిమ్మ‌ల్ని తిడ‌తాడా? అంటే.. క‌చ్ఛితంగా షాపువాడ్ని మ‌న‌మే తిడ‌తామ‌ని ఎవ‌రైనా స‌మాధానం ఇస్తారు. కానీ.. అంత‌ర్జాతీయ విష‌యాల్లో.. అందునా అమెరికా విష‌యంలో సీన్ అలా ఉండ‌దు. కొన‌టం త‌ర్వాత.. దాన్ని వాడే విష‌యంలోనూ అమెరికా ఓ కంట క‌నిపెడుతూ ఉంటుంది. ఎందుకంటే.. తాను అమ్మే వ‌స్తువుల ఇమేజ్ పోతే.. త‌న మార్కెట్ కు దెబ్బ ప‌డుతుంద‌న్న అప్ర‌మ‌త్త‌తే.

తాజాగా భార‌త్‌.. పాక్ ల మ‌ధ్య న‌డిచిన ఉద్రిక్త‌త‌ల వేళ‌.. భార‌త గ‌గ‌న‌త‌లంలోకి దూసుకొచ్చిన ఎఫ్ -16ను భార‌త్ వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్ వ‌ర్ద‌న్ త‌నకిచ్చిన‌ పాత‌కాలం మిగ్ తో కూల్చేయ‌టంపై అమెరికా ఒక్క‌సారి ఉలిక్కిప‌డింది. ఎందుకంటే.. ర‌ష్యాకు చెందిన కాలం చెల్లిన మిగ్ తో అమెరికా కంపెనీకి చెందిన ఎఫ్ 16ను కూల్చేయ‌టం సాధ్య‌మేనా? అన్న అనుమానం ఉన్నా.. అందుకు సాక్ష్యంగా తాజా ఎపిసోడ్ పెద్ద‌న్న‌కు మంట పుట్టేలా చేసింది.

పాక్ కు చెందిన ఎఫ్ 16 యుద్ధ విమానాన్ని భార‌త పైల‌ట్ కూల్చేశాడ‌న్న వార్త‌.. ల‌క్ష‌ల కోట్లు విలువ చేసే త‌మ మార్కెట్ ప్ర‌యోజ‌నాల్ని దెబ్బ తీసే అవ‌కాశం ఉండ‌టంతో అమెరికా ఒక్క‌సారి అలెర్ట్ అయ్యింది. పాక్ ఎఫ్ 16ను ప్ర‌యోగించిందా? లేదా? అన్న రిపోర్ట్ ఇవ్వాలంటూ తాఖీదు ఇచ్చేసింది. అమెరికాకు కోపం వ‌స్తే సీన్ సితారే అన్న విష‌యం పాక్ కు తెలియంది కాదు. ఇప్ప‌టికే ఎఫ్ 16 కూల్చివేత‌తో ప‌డుతున్న దిగులుకు పెద్ద‌న్న ఆగ్ర‌హం తోడు కావ‌టంతో దాయాది ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

త‌మ‌కున్న ఆయుధ‌గారం మీద అంచ‌లంచెల విశ్వాసంతో ఉన్న పాక్ కు.. ఎఫ్ 16 కూలిన వైనం వారి కాన్ఫిడెన్స్ ను భారీగా దెబ్బ తీసింద‌న్న మాట వినిపిస్తోంది. ఇదే స‌మ‌యంలో అమెరికా గుర్రుగా ఉండ‌టంతో పాక్ స‌ర్కారు కొత్త ప‌ల్ల‌విని అందుకున్న‌ది. భార‌త్ పై దాడితో తాము వాడింది ఎఫ్ 16 యుద్ధ విమానాన్ని అస‌లు వాడ‌నేలేద‌ని.. చైనా త‌యారీ జేఎఫ్ 17ను వాడిన‌ట్లు స్ప‌ష్టం చేసింది.

చైనాతో క‌లిసి తాము త‌యారు చేసుకున్న జేఎఫ్ 17 యుద్ధ విమానంతోనే అభినంద‌న్ న‌డుపుతున్న మిగ్ 21ను ఆక్ర‌మిత క‌శ్మీరులో కూల్చిన‌ట్లు పాక్ ప్ర‌భుత్వం తాజాగా వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది. చైనాతో క‌లిసి త‌యారు చేసిన యుద్ధ విమానం కూలిందంటే అమెరికా హ్యాపీనే. ఎందుకంటే.. వారి ఎఫ్ 16మార్కెట్ కు ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు. ఇంకా చెప్పాలంటే పాక్ కానీ ఎఫ్ 16 వాడి ఉంటే సీన్ మ‌రోలా ఉండేద‌న్న మాట‌ను చెప్పుకోవ‌చ్చు కూడా. అయితే.. పెద్ద‌న్న ఆగ్ర‌హానికి గురి కాకుండా.. వారిని కూల్ చేసేందుకు పాక్ చెప్పిన జేఎఫ్ 17మాట చైనాకు చిర్రెత్తేలా చేయ‌దా? అన్న‌ది మ‌రో క్వ‌శ్చ‌న్. అమెరికా అనుగ్ర‌హం పుష్క‌లంగా ఉంటే చైనా చిరాకును ఏదోలా అధిగ‌మించొచ్చ‌న్న ఉద్దేశ‌మే పాక్ చేత ఇలా మాట్లాడించి ఉంటుంద‌ని చెబుతున్నారు. ఈ ఎపిసోడ్ లో పాక్ కు క‌లిసి వ‌చ్చే మ‌రో అంశం ఏమంటే.. కూలిన ఎఫ్ 16 (ఇప్పుడు చెబుతున్న దాని ప్ర‌కార‌మైతే జేఎఫ్ 17) పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్ లో కూలింది. అదే భార‌త్ లో ప‌డి ఉంటే.. వాటి సాక్ష్యాల్ని బట్ట‌బ‌య‌లు చేయ‌టం ద్వారా పాక్ అస‌లు మోసాన్ని చెప్పేయొచ్చు. కానీ.. కూలింది పాక్ అధీనంలోని భూభాగంలో కాబ‌ట్టి.. ఎఫ్ కాస్తా.. జేఎఫ్ గా మార్చేసినా పెద్ద ఇబ్బంది ఉండ‌దంటున్నారు.