Begin typing your search above and press return to search.

ఇండియాలో జాబిల్లి మిషన్.. పాకిస్తాన్ బెల్లీ మిషన్

By:  Tupaki Desk   |   9 Sep 2019 7:31 AM GMT
ఇండియాలో జాబిల్లి మిషన్.. పాకిస్తాన్ బెల్లీ మిషన్
X
భారత్ చేపట్టిన చంద్రయాన్-2 చివరి అంకంలో తడబడినా కూడా దేశమంతా ఇస్రో శాస్త్రవేత్తల ప్రయత్నాన్ని ప్రశంసించి వారి వెన్నంటి నిలిచింది.. అంతేకాదు.. ప్రపంచంలోనే అతిపెద్ద అంతరిక్ష సంస్థ నాసా కూడా చంద్రయాన్-2 గొప్ప విజయమని చెప్పింది. అమెరికా వంటి దేశాలు కూడా 10 ప్రయత్నాలు విఫలమై పదకొండో ప్రయత్నంలో కానీ చంద్రుడిపైకి వెళ్లలేకపోయాయి. అలాంటి ఇండియా తొలి ప్రయత్నంలోనే చంద్రుడి ఉపరితలం వరకు వెళ్లగలిగిందని ప్రపంచమంతా గుర్తించింది. కానీ... ఎక్కడ ఏ అవకాశం దొరుకుతుందా భారత్‌ పై విమర్శలు కురిపిద్దామా అని చూసే పాకిస్తాన్ మాత్రం దీనిపైనా అక్కసు వెళ్లగక్కింది. కానీ... పాకిస్తాన్‌ లోని విద్యావంతులు - యువత మాత్రం తమ నాయకులు చేస్తున్న పిచ్చి విమర్శలను అంగీకరించడం లేదు. ఇప్పటికే ఆ దేశ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిష్టర్ ఫవాద్ హుస్సేన్ చంద్రయాన్2పై చేసిన విమర్శలపై పాకిస్తాన్ ప్రజలు మండిపడిన సంగతి తెలిసిందే.

చంద్రుడిపై సిగ్నల్స్ కట్ అయ్యాయని అనుకుంటున్న ల్యాండర్ విక్రమ్‌ను ఇస్రో మళ్లీ గుర్తించడం.. దానితో కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తుండడంతో పాకిస్తాన్ ప్రజలు తమ ప్రభుత్వం చేతకానితనంపై, వారి విధానాలపై మండిపడుతున్నారు. భారత్ చంద్రయాన్ వంటి గొప్ప కార్యక్రమాలతో సైన్స్ అండ్ టెక్నాలజీలో దూసుకెళ్తోందని.. కానీ, పాక్ మాత్రం పెట్టుబడిదారులను ఆకర్షించడానికి బెల్లీ డ్యాన్సర్లను ఎరవేసి పరువు పోగొట్టుకుంటోందని విమర్శలు చేస్తున్నారు.

తీవ్ర ఆర్థిక సమస్యలతో అతలాకుతలమవుతున్న పాకస్థాన్... పెట్టుబడుల కోసం దిగజారి ప్రవర్తిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బెల్లీ డ్యాన్సర్ల చేత పెట్టుబడిదారులకు కనువిందు చేయించి... వారిని బుట్టలో వేసుకునేందుకు యత్నిస్తోందట. ప్రభుత్వ దిగజారుడుతనంపై ఆ దేశ ప్రజలే విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. ఓ వైపు ఇండియా చంద్రయాన్-2 ప్రయోగంలో బిజీగా ఉంటే... పాక్ మాత్రం బెల్లీ మిషన్ ను సమర్థవంతంగా నిర్వహించిందంటూ ఎద్దేవా చేస్తున్నారు.