Begin typing your search above and press return to search.

పాక్ - బంగ్లాదేశ్ ముస్లీంలను దేశం నుంచి పంపించాల్సిందే: సామ్నా

By:  Tupaki Desk   |   26 Jan 2020 4:34 AM GMT
పాక్ - బంగ్లాదేశ్ ముస్లీంలను దేశం నుంచి పంపించాల్సిందే: సామ్నా
X
సిటిజన్‌ షిప్ అమెండ్‌ మెంట్ యాక్ట్ (CAA)పై మోడీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన శివసేన తాజాగా మిత్రపక్షాలను ఇరుకున పెట్టింది! గత ఎన్నికల్లో బీజేపీ - శివసేన కలిసి పోటీ చేయగా - కాంగ్రెస్ - ఎన్సీపీ కలిసి పోటీ చేశాయి. బీజేపీతో సంబంధాలు బెడిసి కొట్టడంతో కాంగ్రెస్ - ఎన్సీపీతో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. విరుద్ధమైన సిద్ధాంతాలు కలిగిన పార్టీలు ఏకమైతే ఎలా ఉంటుందో ఇప్పుడు మరోసారి తేటతెల్లమైంది.

ఓ వైపు కాంగ్రెస్ పార్టీ.. సీఏఏకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తోంది. ఈ చట్టం ముస్లీంలకు వ్యతిరేకమని ఆరోపిస్తోంది. ఈ ఆరోపణల్లో అర్థంలేదనేది బీజేపీ వాదన. భారత్‌లోని ఏ మతానికీ వ్యతిరేకం కాదని - పాక్ - బంగ్లా - ఆప్గనిస్తాన్ నుంచి వచ్చి అక్రమంగా ఉంటున్న వారి కోసమే సీఏఏ-ఎన్ ఆర్సీ అని చెబుతోంది. కానీ ఆ దేశ మైనార్టీలకు అమలు చేస్తున్న సీఏఏ - ఆ దేశాల్లోని మెజార్టీ ప్రజలకు ఎందుకు అప్లై చేయరనేది విపక్షాల వాదన.

సీఏఏ చట్టంలో సవరణలు చేయాల్సి ఉందని కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వస్తోన్న శివసేన.. తాజాగా శనివారం నాటి తమ పార్టీ పత్రిక సామ్నాలో ఆసక్తికరంగా స్పందించింది. ఓ విధంగా ఇది కాంగ్రెస్ - ఎన్సీపీలను ఇరకాటంలో పడేసేలా ఉందని అంటున్నారు. పాకిస్తాన్ - బంగ్లాదేశ్‌ లకు చెందిన ముస్లీంలను (చట్ట వ్యతిరేకంగా ఉంటున్నవారు) కచ్చితంగా దేశం నుంచి పంపించవలసిందేనని సామ్నా పేర్కొంది. అదే సమయంలో కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ.. ఈ చట్టంలో లూప్‌ హోల్స్ ఉన్నాయని - వాటిని సవరించాల్సి ఉందని పేర్కొంది.

'పాకిస్తాన్ - బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లీంలను ఇక్కడి నుంచి పంపించాల్సిందే. కానీ మీరు మీ జెండా రంగును మార్చడం ఆసక్తికరంగా ఉంది. శివసేన ఎప్పుడు కూడా తన జెండాను మార్చలేదు. ఇది ఎప్పుడు కాషాయంగానే నిలుస్తుంది. శివసేన ఎప్పుడూ హిందుత్వ కోసం పోరాడుతుంది. అయితే సీఏఏలో కొన్ని లూప్‌ హోల్స్ ఉన్నాయి' అని బీజేపీని ఉద్దేశించి సామ్నాలో పేర్కొంది.