Begin typing your search above and press return to search.

పాక్ క్రైస్త‌వులు టార్గెట్‌..చైనా యువ‌కుల కొత్త ల‌క్ష్యం

By:  Tupaki Desk   |   7 May 2019 4:23 PM GMT
పాక్ క్రైస్త‌వులు టార్గెట్‌..చైనా యువ‌కుల కొత్త ల‌క్ష్యం
X
హైద‌రాబాద్ పాత‌బ‌స్తీ అన‌గానే చాలామందికి స్ఫూర‌ణ‌కు వ‌చ్చే అంశం చార్మినార్‌తో పాటుగా అక్క‌డి అమ్మాయిల‌ను గల్ఫ్ షేక్‌ ల‌కు అమ్మేయ‌డం - దానికి ముద్దుగా కాంట్రాక్టు వివాహాల పేరు పెట్ట‌డం. అక్క‌డి షేక్‌ లు - కొంద‌రు బ్రోక‌ర్లు క‌లిసి చేసే దందాతో పాత‌బ‌స్తీలో బాధితులుగా మిగులుతున్న మ‌హిళ‌లు ఎంద‌రో. ఇలాంటి దారుణ‌మైన ఘ‌ట‌న‌లు పొరుగుదేశ‌మైన పాకిస్తాన్‌ లోనూ చోటుచేసుకుంటున్నాయి. చైనాకు చెందిన యువ‌కులు పాక్ అమ్మాయిల‌పై క‌న్నేసి వారిని వివాహం చేసుకునేందుకు డాల‌ర్లు ఎర‌గా వేస్తున్నార‌ని, ఇందుకు క్రైస్త‌వ మ‌తానికి చెందిన కొంద‌రు స‌హ‌క‌రిస్తున్నార‌ని సంచ‌ల‌న క‌థ‌నం వెలుగులోకి వ‌చ్చింది.

అసోసియేటెడ్ ప్రెస్‌ ను ప్ర‌స్తావిస్తూ - జాతీయ మీడియా రాసిన క‌థనం ప్ర‌కారం - చైనాలోని క్రైస్త‌వ మ‌తానికి చెందిన యువ‌త పాకిస్తాన్‌ లో నివ‌సిస్తూ మ‌త మార్పిడి చేసుకున్న అమ్మాయిల‌పై క‌న్నేస్తున్నారు. వారిని వివాహం చేసుకునేందుకు ఆస‌క్తి చూపిస్తూ వీసాలు తీసుకొని పాక్‌ లో అడుగుపెడుతున్నారు. త‌మ‌కు వ‌ధువు కావాల‌నే ఆస‌క్తిని వ్య‌క్తీక‌రిస్తూ వారు స్థానికంగా ఉండే కొంద‌రు మ‌త ప్ర‌బోధ‌కులు స‌హా బ్రోక‌ర్ల‌ను ఆశ్ర‌యిస్తున్నారు. వారు పేద‌రికంలో ఉన్న కుటుంబాల‌ను టార్గెట్ చేసుకొని ఆ కుటుంబ పెద్ద‌ల‌కు వంద‌లు-వేల కొల‌ది డాల‌ర్ల‌ను ఎర‌గా వేస్తున్నారు. దీంతో వారు త‌మ కూతుళ్ల‌ను చైనా యువ‌కుల‌కు ఇచ్చి వివాహం చేసేందుకు సిద్ద‌మ‌వుతున్నారు.

అయితే, ఇటీవ‌ల ఇలా వివాహం చేసుకున్న ముఖ‌దాస్ అష్ర‌ఫ్ అనే యువ‌తి ఐదు నెల‌ల‌కే త‌న భ‌ర్త‌తో విడాకులు కావాల‌ని కోరుతూ - పాక్‌ కు తిరిగి వ‌చ్చింది. త‌న గోడును వెళ్ల‌బోసుకుంది. ఆమెలాగే మ‌రికొంద‌రినీ ఈ క‌థ‌నం పేర్కొంటూ - ఎంద‌రో మ‌హిళ‌ల జీవితాలు చైనీయుల చేతుల్లో బ‌లి అవుతున్నాయ‌ని ఆ దేశంలోని స్వ‌చ్ఛంద సేవా సంస్థ‌లు ఆందోళన వ్య‌క్తం చేస్తున్నాయి. ఇది ఒక‌ర‌కంగా మ‌నుషుల స్మ‌గ్లింగ్ అని మండిప‌డుతున్నాయి. ఇటీవ‌లి కాలంలో ఇలా విజిటింగ్ వీసాల‌పై పాక్‌కు వ‌చ్చి వివాహం చేసుకుంటున్న దోర‌ణులు పెరిగిపోతున్నాయ‌ని అయినా చ‌ట్ట‌ప‌రంగా ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

కాగా, పాకిస్తాన్‌ లోని పంజాబ్ ప్రావిన్స్‌ కు చెందిన మైనార్టీ శాఖ మంత్రి అస్లం అగ‌స్టీన్ ఈ నూత‌న ప‌రిణామం గురించి స్పందిస్తూ - పేద‌రిక‌మే ఇలాంటి వివాహాల‌కు కార‌ణ‌మ‌ని మండిప‌డ్డారు. ఇలాంటి వివాహాలు మానవ‌ హ‌క్కుల ఉల్లంఘ‌నే అని పేర్కొంటూ వాటిని నిరోధించేందుకు త‌గు చ‌ర్య‌లు చేప‌ట్టాల్సి ఉంద‌న్నారు. చైనా ప్ర‌భుత్వం - పాకిస్తాన్‌ లోని ఆ దేశ రాయ‌బార కార్యాల‌యం స‌రైన రీతిలో స్పందించ‌క‌పోవ‌డం వ‌ల్లే ఈ రోణి పెరిగిపోతోంద‌ని ఆక్షేపించారు. కాగా, ఈ అంశంపై హ్యుమ‌న్ రైట్స్ వాచ్ ఇప్ప‌టికే చ‌ర్య‌లు ప్రారంభించింది.