Begin typing your search above and press return to search.

ఈ డాక్టర్ పిచ్చ వింటే షాక్ తినాల్సిందే

By:  Tupaki Desk   |   23 March 2016 4:59 AM GMT
ఈ డాక్టర్ పిచ్చ వింటే షాక్ తినాల్సిందే
X
ఇవాల్టి రోజు ఒక సంతానం చాలనుకునే వాళ్లు చాలామందే ఉన్నారు. ఇద్దరంటే అతి కష్టమ్మీదా ఓకే చెప్పే వాళ్లు ఉన్నారు. అలాంటిది మంది మంది సంతానాన్ని కని పోషించాలని ఉవ్విళ్లూరుడుతున్నాడు పాకిస్థాన్ కు చెందిన ఒక డాక్టర్. తన కోరికను తీర్చుకోవటంలో భాగంగా ఫుల్ బిజీగా ఉన్న ఆయన.. తాజాగా ఇద్దరు ఆడపిల్లలకు తండ్రి కావటం ద్వారా తన ఇంటి స్కోర్ ను 35కు చేర్చారు.

తనకు వందమంది పిల్లలు కావాలనుకునే ఈ పాక్ డాక్టర్ కు.. అంతమంది పిల్లల్ని కనిచ్చే భార్యలు ఉండాలన్న సందేహం అక్కర్లేదు. ఎందుకంటే.. ఇప్పటికే అతగాడికి ముగ్గురు భార్యలు. ఇంతకీ ఇతగాడి పేరేంటి? ఇతడు ఎక్కడుంటాడు అన్న విషయాల్లో వెళితే..

పాకిస్థాన్ లోని గిరిజన ప్రాంతంగా ప్రసిద్ధి పొందిన బలూచిస్తాన్ ప్రావిన్స్ లోని క్వెట్టా నగరానికి చెందిన డాక్టర్ జాన్ మహమద్ కాస్త భిన్నం. ఇతగాడికి 43 ఏళ్లు. వందమంది పిల్లలకు తాను తండ్రి కావాలన్నది ఇతగాడి ఆరాటం. ఇందుకోసం ఇప్పటికే ముగ్గురిని పెళ్లాడిన ఇతగాడు.. తన ముగ్గురు భార్యల పుణ్యమా అని ఇప్పటికి 35 మంది సంతానాన్ని కనగలిగాడు.

తన టార్గెట్ ను చేరుకునే ప్రయత్నంలో అవసరమైతే.. మరికొందరిని పెళ్లి చేసుకోవాలన్న తలంపులో ఉన్నాడు. భార్యలు ఎంతమంది అన్నది ముఖ్యం కాకుండా.. వంద మంది పిల్లలు తనకు ఉండటమే అతగాడి లక్ష్యంగా చెబుతుంటారు. పిల్లలు పుట్టించటంలో ఉండే శ్రద్ధకు తగ్గట్లే డాక్టర్ గా మంచి పేరు ప్రఖ్యాతులు ఉండటంతో ఇతగాడికి ఆర్థిక సమస్యలు పెద్దగా లేవని చెబుతున్నారు.

వైద్య వృత్తితో పాటు.. చిన్న వ్యాపారం ఒకటి చేస్తుండటంతో.. ఇతనికి ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ పెద్దగా లేవు. ఇంతమంది పిల్లల్ని కని ఏం చేస్తావంటే.. చక్కగా చదివిస్తానని.. చదువే జీవితం ఇస్తుందని చెబుతున్నాడు. ఇతని ఫ్యామిలీ పై ఈ మధ్యనే పాక్ కు చెందిన డాన్ టీవీ చానల్ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. ఇతగాడి లక్ష్యం విన్నవారంతా ఆశ్చర్యపోతున్నారు. ఎవరు మాత్రం కారు..?