Begin typing your search above and press return to search.

నవాజ్ కు షాకిస్తున్న పాక్ మీడియా

By:  Tupaki Desk   |   13 Oct 2016 5:39 AM GMT
నవాజ్ కు షాకిస్తున్న పాక్ మీడియా
X
భారత్ జరిపిన సర్జికల్ దాడులతో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నసంగతి తెలిసిందే. ఈ దాడులపై పాక్ ప్రభుత్వ పక్షాన నిలిచిన ఆ దేశ మీడియా.. తర్వాతి కాలంలో సత్యశోధనలో భాగంగా కొన్ని కీలక కథనాల్ని వెలువరించింది. పాక్ లోప్రముఖ దినపత్రిక డాన్ ఈ మధ్యన ప్రచురించిన కథనం తీవ్ర సంచలనంగా మారటమే కాదు.. పాక్ ప్రభుత్వాన్ని తీవ్ర ఆగ్రహానికి గురి చేసేలా చేసింది. అంతే.. ఆ కథనం రాసిన జర్నలిస్ట్ పై నిషేధం విధించటమే కాదు.. ప్రచురించిన డాన్ పత్రికపై కారాలు మిరియాలు నూరుతోంది.

నిజాన్ని రాసిన జర్నలిస్టుపైనా.. మీడియా మీద నవాజ్ సర్కారు విరుచుకుపడటంపై పాక్ మీడియా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. ఇంతకీ నవాజ్ ప్రభుత్వానికి మంటపుట్టేలా రాసిన కథనం సారాంశం ఏమిటన్నది చూస్తే.. నవాజ్ సర్కారుకు.. ఆర్మీకి మధ్య చెడిందని తేల్చటమే కాదు.. అందుకు సంబంధించిన ఆధారాల్ని వెల్లడించారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. పాక్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసినా.. సదరు కథనాన్ని ప్రచురించిన డాన్ పత్రిక మాత్రం ఏ మాత్రం బెదరటం లేదు సరికదా.. బ్యాన్ విధించిన తమ జర్నలిస్ట్ ఎలాంటి తప్పు చేయలేదంటూ ఆయన పక్షాన నిలవటం గమనార్హం.

ఇది చాలదన్నట్లుగా డాన్ పత్రికకు.. పాక్ కు చెందిన మిగిలిన మీడియా సంస్థలు మద్దతు పలకటం ఇప్పుడు నవాజ్ ప్రభుత్వానికి పెద్ద షాక్ గా మారింది. వండి వార్చిన కథనమని.. వాస్తవ విరుద్ధంగా నవాజ్ షరీఫ్ మండిపడుతున్న కథనంపై పాక్ మీడియా భిన్నంగా స్పందిస్తోంది. తాము అన్ని విధాలుగా చెక్ చేసుకున్న తర్వాత సదరు కథనాన్ని ప్రచురించినట్లుగా వెల్లడించిన డాన్ పత్రిక.. ప్రభుత్వ నిషేధానికి గురైన తమ జర్నలిస్టుకు అండగా నిలుస్తామని స్పష్టం చేసింది.

తమపై దాడి చేస్తున్న నవాజ్ ప్రభుత్వానికి కరెంటు షాక్ కొట్టేలా తాజాగా అక్కడి మీడియా మరో అస్త్రాన్ని సంధించింది. పార్లమెంటు సభ్యులు నిషేధిత ఉగ్రవాద సంస్థల నేతలైన మసూద్ అజర్.. హఫీజ్ సయూద్ లను ఎందుకు వెనకేసుకొస్తున్నారంటూ సూటిగా ప్రశ్నించింది. వారికి వ్యతిరేకంగా ఒక్క ముక్క కూడా మాట్లాడటం లేదని ప్రశ్నించటం నవాజ్ సర్కారుకు ఇబ్బందికరంగా మారింది.

అంతేకాదు.. జర్నలిస్టులు ఎలా పని చేయాలి? ఏ వార్తలు రాయాలని చెప్పటం సరికాదంటూ పాక్ మీడియా సంస్థలు తేల్చి చెప్పటమే కాదు.. నేతలు మెరుగ్గా ఎలా పని చేయాలో తామే సూచనలు చేస్తామంటూ ప్రభుత్వానికి సలహా ఇవ్వటం గమనార్హం. జర్నలిస్టు మీద నిషేధం విధించటం లాంటి చర్యలతో పాక్ ప్రతిష్ఠ మంటగలుస్తోందని.. ప్రభుత్వం చేస్తున్న నిషేధ ప్రకటనలపై భయపడాల్సిన అవసరం లేదని.. ప్రభుత్వంపై తన ధిక్కార స్వరాన్ని వినిపించాలని.. నిషేధానికి గురైన జ‌ర్న‌లిస్టు ఆల్మైదాకు.. అతడి కలానికి చాలా శక్తి ఉందంటూ పాక్ కు చెందిన మరో మీడియా సంస్థ ‘ది నేషన్’ సూచించటం విశేషం. ఏది ఏమైనా.. సత్యం కోసం పాక్ మీడియా చేస్తున్న పోరాటాన్ని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/