Begin typing your search above and press return to search.

రూమ్‌కు వ‌స్తావా.. వీసా ఇప్పిస్తా: భార‌తీయ మ‌హిళ‌పై పాకిస్థాన్ అధికారి వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   13 Jan 2023 10:30 AM GMT
రూమ్‌కు వ‌స్తావా.. వీసా ఇప్పిస్తా:  భార‌తీయ మ‌హిళ‌పై పాకిస్థాన్ అధికారి వ్యాఖ్య‌లు
X
ప్ర‌స్తుతం కూటికి గ‌తిలేక‌.. ప్ర‌పంచ దేశాల ముందు చిప్ప‌ప‌ట్టుకుని నిల‌బ‌డ్డ పాకిస్థాన్‌కు భారత్ విష‌యంలో ఎక్క‌డా గ‌ర్వం త‌గ్గ‌లేదు. ప్ర‌పంచ దేశాల్లో 5వ అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా అవ‌త‌రించిన భార‌త్‌విష‌యంలో ఇంకా విషం చిమ్ముతూనే ఉంది.

భార‌త్‌కు చెందిన ఉన్న స్థాయి మ‌హిళ ఒక‌రు పాకిస్థాన్‌లోని ఓ కాలేజీలో లెక్చ‌ర్ ఇచ్చేందుకు వెళ్లాల‌ని ప్ర‌య‌త్నించ‌గా.. ఆమెతో పాకిస్థాన్ అధికారులు అత్యంత అభ్యంత‌ర‌క‌రంగా మాట్లాడారు.

పంజాబ్‌లోని ఓ యూనివర్శిటీ లో ఓ మ‌హిళ‌ సీనియర్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. పాకిస్థాన్‌లోని ఓ కాలేజీలో లెక్చర్‌ ఇవ్వడానికి వెళ్లేందుకు వీసా కోసం ప్రయత్నించారు. ఈ క్ర‌మంలో ఢిల్లీలోని పాక్‌ హైకమిషన్‌లో వీసా ఇంటర్వ్యూ కోసం ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్‌ బుక్‌ చేశారు.

ఆ తర్వాత ఇంటర్వ్యూ కోసం అక్కడకు వెళ్తే సిబ్బంది తనను అసభ్యకర ప్రశ్నలతో ఇబ్బంది పెట్టారని ఆ మహిళ ఆరోపించారు. ఇంటర్వ్యూలో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయాలని, అందుకు తగినంత డబ్బులు ఇస్తామంటూ ఆశజూపారని ఆ మహిళ పేర్కొన్నారు. అంతేకాదు.. తాను ఎంబసీ నుంచి బయటకు వెళ్లిపోతుండగా ఓ అధికారి తన వద్దకు వచ్చి సాయం పేరుతో అసభ్యంగా ప్రవర్తించారని వాపోయారు.

"మీరు పెళ్లి ఎందుకు చేసుకోలేదు? ఒంటరిగా ఎలా ఉండగలుగుతున్నారు? ఒక్క‌సారి నా రూమ్‌కు వ‌స్తే.. వీసా ఇప్పించే ఏర్పాట్లు చేస్తా`` అని వ్యాఖ్యానించ‌డంతో ఆగ్ర‌హించిన స‌ద‌రు ప్రొఫెస‌ర్ పాకిస్థాన్‌ పోర్టల్‌లో ఫిర్యాదు చేశారు. అంతేకాదు, దీనిపై పాక్‌ విదేశాంగ మంత్రికి లేఖ కూడా రాశానని ఆమె తెలిపారు. అయినప్పటికీ ఎలాంటి ప్రయోజనం క‌నిపించ‌లేదు.

దీంతో తాజాగా ఆమె భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌కు లేఖ రాశారు. తనకు న్యాయం చేయాలని ఆమె కేంద్రమంత్రిని కోరారు. అయితే ఆ మహిళ ఆరోపణలపై పాక్‌ హైకమిషన్‌ ఇంకా స్పందించలేదు. ఇదిలావుంటే.. పాక్ అధికారి వ్య‌వ‌హార శైలిని కేంద్ర ప్ర‌భుత్వం త‌ప్పుబ‌ట్టింది.