Begin typing your search above and press return to search.

కేసీఆర్ అడ్డాలో పాకిస్థాన్ పాగా..

By:  Tupaki Desk   |   17 Nov 2019 5:13 AM GMT
కేసీఆర్ అడ్డాలో పాకిస్థాన్ పాగా..
X
తెలంగాణ పై కేంద్రం ఫోక‌స్ పెరుగుతోంది. ఇప్ప‌టికే ఉగ్ర‌వాద కార్యక‌లాపాల‌పై నిఘా పెట్టిన కేంద్రం తాజాగా మ‌రో అంశంలోనూ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్‌ పై న‌జ‌ర్ వేయ‌డంతో...సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. రహస్యంగా ఉండే మిలటరీ అధికారుల వ్యక్తిగత నంబర్లకు ఫోన్లు రావడంతో..కేంద్రం కూపీ లాగ‌గా...దాని మూలాలు హైద‌రాబాద్‌ లో బ‌య‌ట‌ప‌డ్డాయి. ఇలాంటి కాల్ డైవర్ట్‌ కేసుల్లో నిందితులుగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ - మహ్మద్ అక్బర్ అనే వ్యక్తుల కోసం గాలిస్తున్నారు.

ఫేస్ బుక్‌ లో - ట్విట్టర్ లోనో కామెంట్ల‌తో మాట కలిపే మాయ లేడీలు - చనువు పెంచుకుని నేరుగా ఫోన్ లో మాట్లాడేవరకు వెళ్లిపోతూ...సైనికులను - ఆర్మీ అధికారులను హనీట్రాప్ చేస్తున్న ఘటనలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. త‌మ‌తో చేసిన కాల్స్ - మెసేజ్‌ లు - వాట్సాప్ చాటింగ్ లను అడ్డుపెట్టుకుని అత్యంత ర‌హ‌స్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఉదంతాలు వ‌రుస‌గా జ‌రుగుతుండ‌టంతో...కేంద్రం ఇంటెలిజెన్స్ ర‌హ‌స్య నిఘాపెట్టింది. పాకిస్థాన్ ఐఎస్ ఐ ఆ కాల్స్ చేయిస్తోందన్న విషయం తేలింది.అయితే, అవి స్థానిక నంబ‌ర్ల నుంచి వ‌స్తున్నాయ‌ని గ్ర‌హించారు. ఐఎస్డీ (ఇంటర్నేషనల్ సబ్ స్క్రై బర్ డ‌య‌లింగ్ కాల్‌ ల‌ను లోకల్ కాల్స్‌ గా మార్చే ప్ర‌క్రియ హైదరాబాద్ నుంచే జ‌రుగుతోంద‌ని తేలడంతో హనీట్రాప్‌ లో కొత్త కోణం బయటపడింది.

దీంతో నిఘ‌వర్గాలు - ద‌ర్యాప్తు సంస్థ‌లు రంగంలోకి దిగాయి. మిలటరీలోని పై స్థాయి అధికారుల ఫోన్ నంబర్లు అత్యంత రహస్యంగా ఉంటాయి. అలాంటిది ఇద్దరు అధికారులకు ఇటీవల తరచూ కొత్త వ్యక్తుల నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఎవరో తెలుసుకోవాలని తిరిగి వేరే నంబర్లతో ద‌ర్యాప్తు వ‌ర్గాలు ఆ ఫోన్లకు కాల్ చేశారు. కానీ, అక్కడి నుంచి రెస్పాన్స్ రాలేదు. దీంతో అంత‌ర్గ‌త‌ దర్యాప్తు చేయ‌గా...ఆ ఫోన్లు వస్తున్నది హైదరాబాద్ నుంచి అని తెలుసుకున్నారు. వాటి సంగతేంటో తేల్చాలని మిలటరీ ఇంటెలిజెన్స్ - సిటీ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫోన్ నంబర్లు - ఐపీ అడ్రస్ ఆధారంగా చాంద్రాయణ గుట్ట పరిధిలోని ఇస్మాయిల్ నగర్ నుంచి ఫోన్లు వచ్చినట్టు గుర్తించారు. అయితే, అక్కడికి వెళ్లి దర్యాప్తు చేస్తే - ఆ కాల్స్ వచ్చింది పాకిస్థాన్ నుంచి అని తేలింది. వీవోఐపీ సెంటర్లను ఏర్పాటు చేసుకొని పాక్ నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ డైవర్ట్ చేసి లోకల్ కాల్స్ వ‌లే మార్చారని తేల్చారు. ఈ నేప‌థ్యంలో టెర్రరిస్టుల కుట్ర కోణంలో మిలటరీ ఇంటెలిజెన్స్ రహస్య దర్యాప్తు చేస్తోంది.